నవంబరు.. నవీన్ యాదవ్... నాయకుడి రాత మార్చిన నెల
17/11/1983..: అంటే నవంబరు 17న చిన్న శ్రీశైలం యాదవ్ కు పెద్ద కుమారుడు పుట్టాడు. అతడి పేరు నవీన్ యాదవ్.
By: Tupaki Political Desk | 14 Nov 2025 4:30 PM IST17/11/1983..: అంటే నవంబరు 17న చిన్న శ్రీశైలం యాదవ్ కు పెద్ద కుమారుడు పుట్టాడు. అతడి పేరు నవీన్ యాదవ్.
15/11/2023: అంటే సరిగ్గా రెండేళ్ల కిందట ఎన్నికల ముంగిట నవంబరు నెలలో అప్పటి టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరారు నవీన్ యాదవ్.
14/11/2205: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడి. పార్టీలో చేరిన రెండేళ్లకే కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపు.
ఒకే వ్యక్తి విషయంలో ఈ మూడు పరిణామాలు నవంబరు నెలలోనే జరిగాయి. యాదృచ్ఛికమే అయినా ఆయన పుట్టుక సహా అన్నీ ఒకే నెలలో జరగడమే విచిత్రం. నవీన్ యాదవ్ పేరులో ఎన్ ఉన్నట్లే.. ఆయన జీవితంలోనూ ఎన్ తో మొదలయ్యే నవంబరు నెల చాలా కీలక పాత్ర పోషించింది.
ఆ ఒక్క నిర్ణయం...
నవీన్ యాదవ్ ఎంఐఎం తరఫున 2014లో జూబ్లీహిల్స్ నుంచి పోటీకి దిగి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018లో ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. ఆ తర్వాత ఎంఐఎంకూ దూరం జరిగారు. అంతకుముందు రెండుసార్లు కార్పొరేటర్ గానూ ఓడిపోవడంతో ఓ విధంగా రాజకీయ చౌరస్తాలో ఉన్నారు. ఈ పరిస్థితి 2023 వరకు కొనసాగింది. ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయారు. 2023 నవంబరు 15న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి (అజహరుద్దీన్)కి మద్దతు ఇచ్చారు. అదే నవీన్ యాదవ్ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనుకోవాలి.
కేసులతో ఇబ్బందిపెట్టినా..
2023 ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ లో గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్... రాజకీయంగా నవీన్ యాదవ్ వర్గాన్ని టార్గెట్ చేసి కేసులు పెట్టించారు. ఇది తీవ్ర వివాదాలకు దారితీసింది. అయితే, అదే గోపీనాథ్ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ రావడం, ఆయన గెలుపొందడం అనూహ్యం. ఇక గత ఎన్నికల్లో అజహర్ కు మద్దతుగా ఉండడం నవీన్ పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేసింది.
ఈ నవంబరులో...
1983 నవంబరు నెలలో పుట్టి, 2023 నవంబరులో కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్.. 2025 నవంబరులోనే ఎమ్మెల్యే అయ్యారు. రెండుసార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో, రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి... మరొక్క పరాజయం ఎదురైతే రాజకీయంగా వెనుకంజనే అనే పరిస్థితుల్లో నవంబరు 11న జరిగిన పోలింగ్ నవీన్ యాదవ్ జీవితంలో చెరిగిపోని ముద్రవేసింది. తాజాగా నవంబరు 14న వెలువడిన ఫలితాల్లో ఆయన గెలుపు ఓ మలుపుగా మిగిలింది.
