నీటిపై ఎగిరే వాహనం `వేవ్‌ఫ్లై 5X`: రవాణా రంగంలో సరికొత్త విప్లవం!
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, అవుట్‌డోర్ మొబిలిటీ ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంస్థ `నావీ` (NAVEE) తాజాగా సరికొత్త రవాణా విభాగంలోకి అడుగుపెట్టింది.
By: Sivaji Kontham | 8 Jun 2026 6:42 PM ISTఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, అవుట్‌డోర్ మొబిలిటీ ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంస్థ `నావీ` (NAVEE) తాజాగా సరికొత్త రవాణా విభాగంలోకి అడుగుపెట్టింది. చైనాలోని డాంగ్ తైహు సరస్సుపై నిర్వహించిన ఒక లైవ్ షోలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన `వేవ్‌ఫ్లై 5X` అనే వినూత్న వింగ్-ఇన్-గ్రౌండ్ (డబ్ల్యూఐజి) క్రాఫ్ట్‌ను కంపెనీ ఆవిష్కరించింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు, మీడియా ప్రతినిధులు, రవాణా రంగ నిపుణుల సమక్షంలో ఈ వాహనం సరస్సు ఉపరితలంపై అత్యంత వేగంగా దూసుకుపోతూ అందరినీ అబ్బురపరిచింది. ఈ లాంచ్‌తో నావీ సంస్థ సాంప్రదాయ రవాణా లిమిటేషన్స్ ను దాటి తక్కువ ఎత్తులో నీటిపై ప్రయాణించే సాంకేతికత వైపు ఒక విప్లవాత్మక అడుగు వేసింది.
ఈ `వేవ్‌ఫ్లై 5X` సాధారణ స్పీడ్‌బోట్ తరహాలో నీటిని తాకుతూ ప్రయాణించదు.. అలాగని సాధారణ విమానంలా ఆకాశంలోకి ఎగరదు. ఇది `వింగ్-ఇన్-గ్రౌండ్ ఎఫెక్ట్` సాంకేతికతపై పనిచేస్తుంది. అంటే దీని రెక్కలకు - నీటి ఉపరితలానికి మధ్య ఏర్పడే ఏరోడైనమిక్ లిఫ్ట్ (గాలి ఒత్తిడి) ఆధారంగా ఇది నీటిపై కేవలం కొన్ని అంగుళాల ఎత్తులో తేలుతూ.. కిందికి పైకి కదులుతూ ప్రయాణిస్తుంది. ఈ అధునాతన విధానం వల్ల అధిక వేగంతో వెళ్లేటప్పుడు నీటి ఘర్షణ పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా.. ఇంధన లేదా విద్యుత్ సామర్థ్యం అద్భుతంగా పెరుగుతుంది. కదిలే బోటులో ప్రయాణిస్తున్న భావన కాకుండా.. నీటి ఉపరితలానికి అతి తక్కువ ఎత్తులో విమానంలో ప్రయాణిస్తున్న సరికొత్త అనుభూతిని ఇది డ్రైవర్‌కు అందిస్తుంది.
సాంకేతిక ఆకృతి విషయానికి వస్తే... నావీ సంస్థ ఈ వేవ్‌ఫ్లై 5Xను ఏరోస్పేస్-గ్రేడ్ కార్బన్ ఫైబర్ బాడీతో.. డ్యూయల్ టాండెమ్-వింగ్ లేఅవుట్‌తో అత్యంత తేలికగా రూపొందించింది. ఈ నిర్మాణం వల్ల బహిరంగ జలాలపై తక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు కూడా వాహనం అద్భుతమైన స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రాఫ్ట్ గరిష్టంగా గంటకు 53 మైళ్ల (సుమారు 85 కిమీ) వేగాన్ని అందుకోగలదని.. ఒకే రన్‌లో 50 మైళ్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. అలాగే ఇది దాదాపు 309 పౌండ్ల (సుమారు 140 కేజీలు) బరువును మోయగలదు. ప్రదర్శన సమయంలో ఇది నీటిపై సాధారణంగా ప్రయాణించడంతో పాటు.. ఎలాంటి రన్‌వే అవసరం లేకుండానే సజావుగా గాల్లోకి లేచి స్కిమ్ ఫ్లైట్ మోడ్‌లోకి మారే సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
నిజానికి ఈ వింగ్-ఇన్-గ్రౌండ్ సాంకేతికత పూర్తిగా కొత్తదేమీ కాదు. గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగ సంస్థలు, ఇంజనీర్లు సైనిక రవాణా - అత్యంత వేగవంతమైన సముద్ర ఆపరేషన్ల కోసం దీనిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ డిజైన్లు చాలా ఖరీదైనవిగా.. భారీ పరిమాణంలో ఉంటూ కేవలం ప్రత్యేక అవసరాలకే పరిమితమయ్యాయి. కానీ నావీ సంస్థ ఈ మిలిటరీ స్థాయి సాంకేతికతను సామాన్య వినియోగదారుల వినోదం కోసం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మెరైన్ ఇంజనీరింగ్... తేలికపాటి ఏవియేషన్ నిర్మాణాలు .. ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థల కలయికగా ఈ కాంపాక్ట్ క్రాఫ్ట్‌ను మలిచింది. గ్లోబల్ లో-ఆల్టిట్యూడ్ ఎకానమీ (తక్కువ ఎత్తు రవాణా వ్యవస్థ) విలువ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తున్న తరుణంలో.. నావీ ఈ రంగాన్ని వాటర్-సర్ఫేస్ ఫ్లైట్ ద్వారా శాసించాలని చూస్తోంది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమం అంతర్జాతీయ కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించింది. నార్త్ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలకు చెందిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ వేవ్‌ఫ్లై 5Xను తమ మార్కెట్లలో ప్రవేశపెట్టడానికి ఇప్పటికే నావీ సంస్థతో ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ వాహనం తుది ధర లేదా భారీ స్థాయి ఉత్పత్తి ప్రణాళికలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. సాంప్రదాయ రోడ్లు, జలమార్గాలను దాటి భవిష్యత్తు రవాణా ఏ దిశగా వెళ్తోందో చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. భవిష్యత్ రవాణా విప్లవాన్ని అందుకోవాలని చూస్తున్న సంస్థల మధ్య.. ఇకపై నీటి ఉపరితలానికి పైన ఉండే ఆ కొద్దిపాటి ఖాళీ స్థలమే అత్యంత కీలకమైన.. పోటీతో కూడిన ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది.
