Begin typing your search above and press return to search.

నవారో అక్కసు.. భారత్ పై అదే ఫస్ట్రేషన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, వాణిజ్య సలహాదారుగా పేరుగాంచిన పీటర్‌ నవారో మళ్లీ భారత్‌పై నిప్పులు చెరిగాడు.

By:  A.N.Kumar   |   1 Sept 2025 3:19 PM IST
నవారో అక్కసు.. భారత్ పై అదే ఫస్ట్రేషన్
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, వాణిజ్య సలహాదారుగా పేరుగాంచిన పీటర్‌ నవారో మళ్లీ భారత్‌పై నిప్పులు చెరిగాడు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని భారత్‌ను విమర్శిస్తూ “క్రెమ్లిన్‌కు లాండ్రోమ్యాట్‌ వలే పనిచేస్తోంది” అని చెప్పడం అతని మాటల్లోని ఆవేశాన్నే కాకుండా.. అమెరికా దౌర్జన్య ధోరణిని కూడా బయటపెడుతోంది.

- ప్రజాస్వామ్యం పేరుతో ఒత్తిళ్లు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్‌ను ప్రశంసిస్తూనే.. దాని విదేశాంగ విధానంపై బహిరంగంగా ఆక్షేపించడం అంతర్జాతీయ మర్యాదలకు విరుద్ధం. ప్రతి దేశం తన అవసరాలు, తన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటుంది. చౌకైన చమురు అవసరాన్ని తీర్చుకోవడం కోసం భారత్‌ రష్యాను ఆశ్రయించడం తప్పా? లేక అమెరికా అంగీకారం లేకుండా భారత్‌ ఒక్క అడుగు కూడా వేయకూడదా?

-అమెరికా ద్వంద్వ ప్రమాణం

నవారో ఆరోపణల్లో ఒక పెద్ద లోపం స్పష్టంగా కనిపిస్తుంది. 2024లో అమెరికానే రష్యా నుంచి 3.27 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంది. వాటిలో 1.3 బిలియన్‌ డాలర్ల ఇంధన ఉత్పత్తులే. అయితే ఈ వాస్తవం గురించి నవారో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఒకవైపు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ.. మరోవైపు భారతదేశంపై నిందలు మోపడం అమెరికా రాజకీయ కపటత్వానికే నిదర్శనం.

- టారిఫ్‌ల విషయంలో అదే కథ

ట్రంప్‌ విధించిన సుంకాలను అమెరికా కోర్టులే చట్టవిరుద్ధమని కొట్టివేశాయి. అధ్యక్షుడి అధికారాల దుర్వినియోగం జరిగిందని న్యాయమూర్తులే తీర్పునిచ్చారు. అయినప్పటికీ నవారో మాటల్లో మాత్రం తాము చేసినది సరైనదే అన్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అమెరికా నాయకత్వం ఎంతవరకు తన ప్రయోజనాల కోసం వాస్తవాలను వంచిస్తుందో చూపించే ఉదాహరణ.

- భారత ధోరణి స్పష్టమే

భారతదేశం ఎప్పుడూ ఒకే సూత్రాన్ని పాటిస్తోంది. ప్రజల ప్రయోజనం ముందు. 150 కోట్ల జనాభా ఉన్న దేశానికి చౌకైన ఇంధనం అవసరం. అందుకే రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోంది. అదే సమయంలో అమెరికా, యూరప్‌లతోనూ వ్యాపార, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందిస్తోంది. ఈ సమతౌల్యమే భారత విదేశాంగ విధానం బలమూ, విశ్వసనీయతకూ మూలం.

నవారో వ్యాఖ్యలు కొత్తేమీ కావు. అమెరికా నాయకులు తరచుగా ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలాంటి మాటలు ఉపయోగిస్తుంటారు. కానీ నేటి ప్రపంచం ఏకపక్ష ఆధిపత్యాన్ని అంగీకరించదు. ప్రజాస్వామ్యం అంటే కేవలం అమెరికా చెప్పింది చేయడం కాదు, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. భారత్‌ అదే చేస్తోంది.