Begin typing your search above and press return to search.

పేరు మార్చుకున్న చిన్న దేశం.. ఆ విశేషాలు ఏంటో తెలుసా?

వైశాల్యం పరంగా నౌఇరో ప్రపంచంలోనే మూడో అతిచిన్న దేశంగా రికార్డుల్లో ఉంది. ఇక్కడ జనాభా కేవలం 12,000 మంది మాత్రమే ఉంటారు.

By:  Madhu Reddy   |   5 Aug 2026 5:00 PM IST
పేరు మార్చుకున్న చిన్న దేశం.. ఆ విశేషాలు ఏంటో తెలుసా?
X

ప్రపంచ పటంలో ఎంతో చిన్నగా కనిపించే ద్వీప దేశం ‘నౌరు’ ఇటీవల తన పేరును అధికారికంగా ‘రిపబ్లిక్ ఆఫ్ నౌఇరో’గా మార్చుకుంది. వలస పాలకుల కాలంలో కోల్పోయిన తమ జాతీయ స్వయంప్రతిపత్తిని, సంస్కృతిని తిరిగి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు డేవిడ్ వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం పేరు మార్పుతో అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రపంచ చరిత్రలోని అనేక దేశాల పేరు మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది. ఆ విశేషాలు చూద్దాం..

'నౌరు' నుంచి 'రిపబ్లిక్ ఆఫ్ నౌఇరో'గా..:

విదేశీ వలస పాలకులు తమ పాలనా సౌలభ్యం కోసం అప్పట్లో ఈ దేశం పేరును 'నౌరు'గా మార్చారు. పూర్వం జర్మనీ, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల పాలనలో ఉన్న ఈ ద్వీపం సుదీర్ఘ పోరాటం తర్వాత 1968లో స్వాతంత్య్రం పొందింది. ఇక స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు తమ పూర్వీకుల సంస్కృతికి, మూలాలకు ప్రాధాన్యత ఇస్తూ 'రిపబ్లిక్ ఆఫ్ నౌఇరో'గా తమ స్వంత పేరును పునరుద్ధరించుకోవడం స్థానిక ప్రజల్లో ఎంతో ఆనందాన్ని నింపింది.

ప్రపంచంలోనే మూడో అతిచిన్న దేశం:

వైశాల్యం పరంగా నౌఇరో ప్రపంచంలోనే మూడో అతిచిన్న దేశంగా రికార్డుల్లో ఉంది. ఇక్కడ జనాభా కేవలం 12,000 మంది మాత్రమే ఉంటారు. ఇక ఈ చిన్న దేశానికి ప్రధానంగా ఫాస్ఫేట్ మైనింగ్, చేపల వేట, అలాగే ఆస్ట్రేలియా మరియు ఇతర అంతర్జాతీయ దేశాల నుంచి లభించే సహాయమే ప్రధాన ఆదాయ మార్గాలుగా ఉన్నాయి. భౌగోళికంగా చిన్నదైనప్పటికీ పసిఫిక్ రీజియన్‌లో ఇది పర్యావరణపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ద్వీపం.

చరిత్రలో పేరు మార్చుకున్న దేశాలివే:

విదేశీ పాలన నుంచి విముక్తి పొంది తమ సొంత సంస్కృతికి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు 70కి పైగా దేశాలు తమ అధికారిక పేర్లను మార్చుకున్నాయి. ఉదాహరణకు సిలోన్‌గా ఉన్న దేశం 'శ్రీలంక'గా, బర్మా 'మయన్మార్'గా, తూర్పు పాకిస్థాన్ 'బంగ్లాదేశ్'గా మారాయి. అలాగే టర్కీ 'తుర్కియే'గా, హాలండ్ 'నెదర్లాండ్స్'గా, పర్షియా 'ఇరాన్'గా, సియామ్ 'థాయిలాండ్'గా, చెక్ రిపబ్లిక్ 'చెకియా'గా పేర్లు మార్చుకుని జాతీయతను చాటుకున్నాయి.

సొంత గుర్తింపును, సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడానికి దేశాలు తమ పేర్లను మార్చుకోవడం చరిత్రలో కొత్తేమీ కాదు. ఇక ఇప్పుడు ఆ వరుసలోనే నౌఇరో చేరడం ద్వారా తమ ప్రాచీన వారసత్వానికి తగిన గౌరవం దక్కిందని ఆ దేశ ప్రజలు భావిస్తున్నారు. ఇక ఈ చిన్న దేశం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ఇతర దేశాల సాంస్కృతిక ఆత్మగౌరవ పోరాటాలకు నిదర్శనంగా నిలిచింది.