మరో దేశంపైకి ట్రంప్.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ?
వెనుజులాపై ఆధిపత్యం సాధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను మరో దేశంపై పడింది.
By: A.N.Kumar | 10 Jan 2026 8:00 PM ISTవెనుజులాపై ఆధిపత్యం సాధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను మరో దేశంపై పడింది. డెన్నార్క్ లో భాగంగా ఉన్న గ్రీన్ ల్యాండ్ ను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. బలప్రయోగం చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు. దీనిపై డెన్మార్క్ కూడా స్పందించింది. గ్రీన్ ల్యాండ్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే నాటో రద్దవుతుందని స్పష్టం చేసింది. అమెరికా గ్రీన్ ల్యాండ్ ఆక్రమణకు యత్నిస్తే నాటో దేశాలన్నీ అమెరికాతో సహా డెన్మార్క్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది.
నాటో అంటే ?
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో అమెరికా కూడా భాగస్వామి. అదే విధంగా డెన్మార్క్ కూడా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో ఏర్పడింది. దీని లక్ష్యం నాటో దేశాలపై వేరే దేశాలు డాడి చేస్తే.. నాటో దేశాలన్నీ ఉమ్మడిగా ఎదుర్కోవాలి. కానీ నాటోలో భాగమైన అమెరికా.. మరో నాటో దేశంపై దాడి చేస్తే పరిణాలు ఎలా ఉంటాయి ?. అందుకే డెన్మార్క్ నాటో నాశనం అవుతుందని గుర్తు చేస్తోంది. నాటో దేశాలు డెన్మార్క్ వైపు నిలబడతాయని చెబుతోంది. నాటో దేశాలు డెన్మార్క్ వైపు నిలబడకపోతే నాటో రద్దవుతుంది. నాటోకు అర్థం ఉండదు.
ట్రంప్ వాదన.. దాని వెనుక ఉన్న వాస్తవం ఏంటి ?
గ్రీన్ ల్యాండ్ పై రష్యా, చైనాల కదలికలు పెరిగిన నేపథ్యంలో అమెరికా భద్రత కోసం గ్రీన్ ల్యాండ్ లో వ్యూహాత్మక ఆధిపత్యం కావాలంటున్నారు. చైనా, రష్యాలను బూచిగా చూపుతున్నారు. కానీ వాస్తవంగా గ్రీన్ ల్యాండ్ లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ పైనే ట్రంప్ కన్ను ఉందని తెలుస్తోంది. దీనితో పాటు షిప్పింగ్ రూట్ కూడా యూఎస్ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే ట్రంప్ గ్రీన్ ల్యాండ్ కావాలంటున్నారు. చైనా రేర్ ఎర్త్ మెటల్స్ లో అగ్రగామిగా ఉంది. ప్రపంచ అభివృద్థిలో రేర్ ఎర్త్ మెటల్స్ పాత్ర చాలా కీలకం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ , రక్షణ రంగంలోనూ రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం ఎక్కువగా ఉంది. అందుకే గ్రీన్ ల్యాండ్ కోసం ట్రంప్ పట్టుబడుతున్నారు.
అమెరికాకు ఆయిల్, గ్యాస్, రేర్ ఎర్త్ మెటల్స్ కంటే జాతీయ భద్రతే ముఖ్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదన్న వాదన ఉంది. వెనుజులా ప్రెసిడెంట్ మదురోను డ్రగ్స్ పేరుతో నిర్బంధించి అక్కడి చమురు, సహజ వనరులపై ఆధిపత్యం సాధించారు. ఇప్పుడు జాతీయ భద్రత పేరుతో గ్రీన్ ల్యాండ్ పై కన్ను వేశారు. ట్రంప్ అమెరికా ప్రయోజనాల పేరుతో గ్యాస్, ఆయిల్, సహజ వనరులపై ఆధిపత్యం కోసం ఆయా దేశాల సార్వభౌమత్వంపై దాడి చేస్తున్నారు.
