అక్కడ కాంగ్రెస్ బీజేపీ పక్క వాయిద్యాలే !
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాదిన ఇప్పటికీ పట్టు చిక్కలేదన్న సంగతి అందరికీ తెలిసిందే.
By: Satya P | 24 March 2026 9:27 AM ISTదేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాదిన ఇప్పటికీ పట్టు చిక్కలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణాలో ఒంటరిగా పోటీ చేసి తన సత్తాను ఒక మాదిరిగా రుజువు చేసుకుంటోంది. ఏపీలో చూస్తే టీడీపీ కూటమిలో జూనియర్ భాగస్వామిగా ఉంది. కర్ణాటకలో అయితే ప్రధాన శక్తిగా ఉంది, కేరళలో ఇపుడిపుడే ఉనికి పోరాటం మొదలెట్టింది. తమిళనాడులో అయితే అన్నా డీఎంకేకి ఈ రోజుకీ పక్క వాయిద్యం గానే ఉంది. తాజాగా పొత్తులలో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లు చూస్తే మొత్తం 234లో ఆ పార్టీ పోటీ చేస్తున్నవి కేవలం 27 మాత్రమే కావడం గమనార్హం.
రెండు ఆకులు పట్టుకుని :
తమిళనాడులో బీజేపీ రెండు ఆకులు పట్టుకుని రాజకీయాన్ని చేస్తోంది అని అంటున్నారు. ఆ రెండాకుల పార్టీ అన్నా డీఎంకే. ఆ పార్టీకి క్యాడర్ బేస్డ్ పార్టీగా గుర్తింపు ఉంది. జయలలిత ఎంజీఆర్ వీరాభిమానులు ఈ రోజుకీ ఉన్నారు పైగా తమిళనాడులో రాజకీయం అంతా నిట్ట నిలువుగా చీలిపోయి ఉంటుంది. దశాబ్దాలుగా ప్రజలు సైతం డీఎంకే అన్నా డీఎంకే గా విభజించబడ్డారు. దాంతో అన్నా డీఎంకేకి నాయకుడుగా మాజీ సీఎం పళని స్వామికి పెద్దగా ఇమేజ్ లేకపోయినా బీజేపీ ఆయన ఇచ్చిన సీట్లతో సర్దుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు. పైగా ద్రవిడ సీమలో హిందూత్వ రాజకీయాలు పెద్దగా చెల్లవు. దాంతో అన్నా డీఎంకేతో చెలిమి చేస్తూ తన పార్టీని మెల్లగా విస్తరించుకోవాలని బీజేపీ చూస్తోంది.
గెలిస్తే మంత్రి పదవులు :
ఇక చూస్తే ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే గెలిస్తే మంత్రి పదవులు తీసుకుంటుందని అంటున్నారు. పళమి స్వామి బలమైన నేతగా ఆ పార్టీలో ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీతో ఉన్న అవసరాలు ఇచ్చి పుచ్చుకోవడాలు వంటి కారణాల వల్ల కేబినెట్ లోకి కమలం పార్టీని తీసుకోవచ్చు అని అంటున్నారు అలా కనీసం రెండు మూడు మంత్రి పదవులు పొందాలని తొలిసారి తమిళనాడులో అధికారం ఎంతో కొంత చలాయించాలని బీజేపీ ఆరాటపడుతోంది.
కాంగ్రెస్ సీన్ చూస్తే :
ఇక అధికార డీఎంకే కూటమిలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంది. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 40కి పైగా అసెంబ్లీ సీట్లను కోరింది. కానీ అంత సీన్ లేదని స్టాలిన్ కాంగ్రెస్ కి జస్ట్ 28 సీట్లకే పొత్తులో భాగంగా ఇచ్చారు. అంతే కాదు రేపటి రోజున మరోసారి డీఎంకే గెలిస్తే కనుక మంత్రి వర్గంలో మొత్తం డీఎంకే నేతలే ఉంటారు అని కూడా ముందే చెప్పేశారు. అంటే స్టాలిన్ మంత్రి వర్గంలో కాంగ్రెస్ కి మంత్రి పదవులు ఉండవన్న మాట. అయితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో డీఎంకే ప్రధానం కావడం, తమిళనాడులో 39 ఎంపీ సీట్లు ఉండడంతో పొత్తు సర్దుబాట్లకు కాంగ్రెస్ అంగీకరించి ముందుకు సాగుతోంది.
జాతీయ పార్టీలంతే :
దేశంలో ఎక్కడైనా జాతీయ పార్టీలు కానీ తమిళనాడులో కాదని ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితమే అర్ధమైపోయింది. 1968లో తొలిసారిగా డీఎంకే అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ జమానాకు చెల్లు చీటీ ఇచ్చేశారు. అప్పటి నుంచి అయితే డీఎంకే లేకపోతే అన్నా డీఎంకేతో పొత్తులు పెట్టుకుని ఆ పార్టీలు ఇచ్చే సీట్లతో కాంగ్రెస్ నెట్టుకుని వస్తోంది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఎంపీల మద్దతుని తీసుకుని అలా లాభపడుతోంది. అదే కాంగ్రెస్ వ్యూహంగా మారింది. దీంతో మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో ఆ చివరి 34 సీట్లను కూడా పట్టు బట్టి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ తీసుకునే స్థితిలో లేకుండా పోయాయని అంటున్నారు.
