మగాడికి కూడా మనసుంటుంది.. వాడికీ కష్టాలొస్తాయి.. ‘పురుషుల కమిషన్’ కావాల్సిందే..
ఈ బిల్లు బయటకొచ్చిందో లేదో.. పుణెలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు పుణ్యమా అని సోషల్ మీడియాలో ‘మెన్ ఆర్ ఆల్సో హ్యూమన్స్’ (మగాళ్లు కూడా మనుషులే) అనే ట్రెండ్ ఊపందుకుంది.
By: A.N.Kumar | 8 July 2026 11:18 PM ISTఅవును.. మీరు చదివింది నిజమే.. దేశంలో ఒక వింత, విచిత్రమైన, మునుపెన్నడూ ఊహించని చర్చ మొదలైంది. ఇప్పటివరకు ‘మగాడ్రా బుజ్జీ.. నీకేం తక్కువ?’ అంటూ మీసాలు తిప్పిన పురుష పుంగవుల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కావాలంటూ రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్‌లో పడేశారు. "జాతీయ మహిళా కమిషన్" తరహాలోనే, ఇకపై "జాతీయ పురుషుల కమిషన్" కూడా పెట్టాలని ఆయన డిమాండ్. ఈ బిల్లు బయటకొచ్చిందో లేదో.. పుణెలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు పుణ్యమా అని సోషల్ మీడియాలో ‘మెన్ ఆర్ ఆల్సో హ్యూమన్స్’ (మగాళ్లు కూడా మనుషులే) అనే ట్రెండ్ ఊపందుకుంది.
కన్నీళ్లు పెడుతున్న ‘కండల వీరులు’
సమాజంలో మగాడంటే ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలి, ఏడవకూడదు.. భరించాలి అనే రూల్స్ ఉన్నాయి కదా! కానీ ఈ బిల్లు తెచ్చిన లెక్కలు చూస్తుంటే మగాళ్ల గుండెల్లో దాగున్న బాధలు హిమాలయాలంత ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో భార్య చేతిలో లేదా బెల్లం ముక్క లాంటి అత్తగారి చేతిలో దెబ్బలు తిన్నా బయటకు చెప్పుకోలేక కుమిలిపోయే భర్తలు ఎందరో.. ఎక్స్ లోనో, పోలీస్ స్టేషన్ లోనో ఒక్క తప్పుడు కేసు పడితే.. కెరీర్ గోవిందా! విడాకులయ్యాక పిల్లల్ని చూడనివ్వకుండా కేవలం మెయింటెనెన్స్ డబ్బుల కోసం మాత్రమే వాడుకునే ‘ఏటీఎం’ మిషన్లుగా మగాళ్లు మారుతున్నారట. ఆఫీసు ఒత్తిళ్లు, సామాజిక అంచనాలు తట్టుకోలేక దేశంలో పురుషుల ఆత్మహత్యల శాతం రాకెట్‌లా దూసుకెళ్తుంటే.. "అయ్యో పాపం" అనే నాథుడే కరువయ్యాడని పురుషుల హక్కుల సంఘాలు గొంతు చించుకుంటున్నాయి.
ఈ కమిషన్ వస్తే ఏం మారుతుంది?
ఒకవేళ దేవుడు కరుణించి అంటే పార్లమెంట్ ఒప్పుకొని ఈ కమిషన్ ఏర్పాటైతే.. మగాళ్లకు ఒక ‘సేఫ్ జోన్’ దొరుకుతుంది. "మా ఆవిడ నన్ను రోజుకు పదిసార్లు తిడుతోంది సార్" అని ఏడ్చే భర్తలకు ఉచితంగా టిష్యూ పేపర్లు, మానసిక ధైర్యం ఇస్తారు. ఉచిత న్యాయ సహాయం కింద తప్పుడు కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో లాయర్లతో ఫ్రీగా సలహాలు ఇప్పిస్తారు. అలిగిన భర్తలకు, అత్తగారి వేధింపులకు గురయ్యే అల్లుళ్లకు ఇదొక పెద్ద దిక్కు అవుతుంది.
"మేమేదో మహిళల హక్కులను లాగేసుకుందామని చూడట్లేదు బాబోయ్! వాళ్ల చట్టాలు వాళ్లకుండనివ్వండి.. మాకు కనీసం ఒక చిన్న కంప్లైంట్ బాక్స్ అయినా ఇవ్వండి" అని బిల్లు ప్రతిపాదకులు చేతులు జోడించి మరీ చెప్తున్నారు.
చట్టం అవుతుందా.. లేక చాయ్ బిస్కెట్ ముచ్చటవుతుందా?
మన దేశ పార్లమెంట్ చరిత్ర చూస్తే ‘ప్రైవేట్ మెంబర్ బిల్లులు’ చట్టాలుగా మారడం అనేది.. లాటరీలో కోటి రూపాయలు తగలడం కంటే అరుదు. కాబట్టి ఈ బిల్లు రేపో మాపో చట్టం అయిపోయి, మగాళ్లందరికీ రక్షణ వచ్చేస్తుందని పగటి కలలు కనడం కాస్త అత్యాశే అవుతుంది.
అయినప్పటికీ "మగాడికి కూడా మనసుంటుంది, వాడికీ కష్టాలొస్తాయి" అనే ఒక టాపిక్ మీద పార్లమెంట్ లో చర్చ జరగడమే ఒక పెద్ద అద్భుతం. మరి ఈ పురుషుల కమిషన్ ముచ్చట ఎంతవరకు వెళ్తుందో అధికార పక్షం దీనిపై ఎలాంటి ‘పంచ్‌లు’ వేస్తుందో చూడాలి. అంతవరకు.. ఆల్ ది బెస్ట్ మగాళ్లూ! మీ బాధలను వినడానికి కనీసం ఒక బిల్లు అయినా పుట్టుకొచ్చింది, సంతోషించండి..
