సాయిరెడ్డి పార్టీ పై 'నేషనల్' టాక్ ఇదే..!
విజయవాడలో విజయసాయిరెడ్డి ప్రారంభించిన పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ)పై జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం, కుటుంబ రాజకీయాలపై ఆయన విమర్శలు, గత రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావించింది. 2029 ఎన్నికల్లో యువతకు 66 శాతం టికెట్లు ఇస్తామన్న ప్రకటనపైనా సందేహాలు వ్యక్తం చేసింది.
By: Garuda Media | 12 Nov 2026 9:00 PM ISTవైఎస్సార్‌సీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజయవాడలో పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీ ఏర్పాటుపై జాతీయ స్థాయిలోనూ చర్చ సాగింది. ముఖ్యంగా ఆంగ్ల మీడియా సంస్థలు ఈ పార్టీ వెనుక ఉన్న కారణాలు.. అదే సమయంలో సాయిరెడ్డి శైలి.. ఆయన వ్యూహం వంటివాటిని ప్రధానంగా రాసుకొచ్చాయి. ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం, కుటుంబ రాజకీయాలపై విమర్శలు, గత నేపథ్యంపై దృష్టి సారించాయి.
ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఏపీ రాజకీయాల్లో రెండు రాజకీయ కుటుంబాల (టీడీపీ, వైఎస్సార్‌సీపీ) ఆధిపత్యాన్ని అంతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని విజయసాయి రెడ్డి ప్రకటించడాన్ని తప్పుబట్టింది. నిన్న మొన్నటి వరకు అదే కుటుంబ పార్టీలో ఉన్నారని.. సుమారు 10 ఏళ్లపాటు అదే కుటుంబ పార్టీకి సేవ అందించారని విశ్లేషించడం గమనార్హం. అదేసమయంలో కాన్షీరామ్(యూపీ), బాలఠాక్రే(మహారాష్ట్ర)లతో తనను తాను పోల్చుకోవడాన్ని కూడా.. ఈ పత్రిక తప్పుబట్టింది. వారిస్థాయి సాయిరెడ్డికి రావాలంటే.. ప్రజలు అంగీకరించాలని పేర్కొనడం గమనార్హం.
ఓ చానల్ నివేదిక ప్రకారం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్సార్ సీపీని వీడి ఇప్పుడు టీడీపీ, వైఎస్సార్ సీపీలకు ప్రత్యామ్నాయంగా పీఆర్‌పీని తీసుకొచ్చారని పేర్కొంది. వ్యవసాయ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు తమ పార్టీ ప్రధాన ప్రాధాన్యతలుగా ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. కానీ, అదేసమయంలో ఆయన వ్యాఖ్యలను యువత విశ్వసిస్తారా? అనేది సందేహించడం గమనార్హం. ఎందుకంటే.. వైసీపీలో ఆయనకు `గౌరవం` దక్కి ఉంటే అసలు బయటకు వచ్చేవారు కాదన్న అభిప్రాయం యువతలో ఉన్నట్టు ఈ ఆంగ్ల మీడియా పేర్కొనడం గమనార్హం.
తెలుగు వారికి సుపరిచితమైన మరో ఆంగ్ల పత్రికలో విజయసాయి రెడ్డి గత రాజకీయ ప్రస్థానం, ఆయనపై ఉన్న కేసుల నేపథ్యాన్ని ప్రస్తావించారు. తన ప్రసంగంలో ఆయన బీజేపీ లేదా జనసేనపై ఎటువంటి విమర్శలు చేయలేదని, సీబీఐ, ఈడీ విచారణల నేపథ్యంలోనే ఈ కొత్త పార్టీ వ్యవహారం నడుస్తోందని ఒక బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించినట్లు ఈ పత్రిక పేర్కొంది. అలాగే, టీడీపీ, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆయన్ను ఒకరికొకరు 'బీ-టీమ్' (ఏజెంట్) అని విమర్శించు కుంటున్నారని ఈ కథనం వివరించింది.
విజయసాయి రెడ్డి తన పార్టీకి పీఆర్‌పీ (గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ) అనే సంక్షిప్త నామాన్ని ఎంచుకోవడంపై మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంతేకాకుండా, 2029 ఎన్నికల్లో యువతకు 66 శాతం టికెట్లు కేటాయిస్తామని, తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని ఆయన చేసిన ప్రకటనలను జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. ఇవి ప్రకటనల వరకు పరిమితం అవుతాయని పెదవి విరవడం గమనార్హం. గతంలో మహారాష్ట్ర, యూపీలలో జరిగిన పరిణామాలను ప్రస్తావించడం గమనార్హం.
