జీ రాం జీ పేరు...నోరు తిరగడం లేదా ?
పధకాలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కొనసాగాలన్నది ఒక విధానం. కాదు అవి రాజకీయ వాసనలు కలిగి ఉన్నాయి కాబట్టి జనాల కోసం మార్చాలి అన్నది మరో విధానం.
By: Satya P | 19 Dec 2025 8:15 AM ISTపధకాలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కొనసాగాలన్నది ఒక విధానం. కాదు అవి రాజకీయ వాసనలు కలిగి ఉన్నాయి కాబట్టి జనాల కోసం మార్చాలి అన్నది మరో విధానం. ఇపుడు దీని మీదనే దేశంలో విస్తృతంగా చర్చ సాగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం ఇది గత రెండు దశాబ్దాలుగా దేశంలో అందరికీ తెలిసిన పేరు. ముఖ్యంగా ప్రతీ పల్లెలో నలిగిన పేరు. అయితే ఇపుడు ఆ పేరుని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. దానికి కొత్తగా పెట్టిన పేరు ఏమిటి అంటే వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆవీజిక మిషన్ గ్రామీణ్ షార్ట్ కట్ లో జీ రామ్ జీ' బిల్లు-2025 అన్న మాట.
పేరులో ఏముందంటే :
ఇక చూస్తే కనుక జాతీయ ఉపాధి హామీ పధకం సింపుల్ గా ఉంది అని అంటున్నారు. కొత్త పేరు వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆవీజిక మిషన్ గ్రామీణ్ అంటే అసలు గుక్క తిప్పుకోవడం కష్టంగానే ఉంది అని కూడా అంటున్నారు. ఈ కొత్త పేరుతో బిల్లులో భారీ మార్పులతో ప్రవేశపెట్టిన జీ రాం జీ 2025 బిల్లు మీద మరిన్ని విమర్శలు కూడా ఉన్నాయి. రాముడి పేరుని ఈ బిల్లుకి షార్ట్ అయినా తగిలించారు అని. దీని మీద కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కూడా విమర్శలు చేశారు. అయితే ఈ బిల్లు పేరు రూపూ అలాగే విధనాలు మొత్తం మార్పు చేశామని ఇది భారత్ కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికార పార్టీ వాదిస్తోంది.
లోక్‌సభలో తీవ్ర గందరగోళం :
ఇదిలా ఉంటే ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో గురువారం ప్రవేశపెట్టినప్పుడు సభలో తీవ్ర గందరగోళమే చెలరేగింది. అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్లుగానే పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో అయితే ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను కూడా విపక్ష సభ్యులు చించి వేశారు. ఈ బిల్లులో మహాత్మా గాంధీ పేరుని కూడా తొలగించడమేంటని మండిపడ్డాయి. అంతే కాదు ఈ బిల్లు ద్వారా ఇక మీదట రాష్ట్రాల మీదనే ఉపాధి పధకం భారం పడుతోందని విపక్షాలు ఫైర్ అయ్యాయి.
స్టాండింగ్ కమిటీకి :
ఈ బిల్లుని పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు పంపించాలని ప్రతిపక్షాలు గట్టిగా కోరాయ్హి. అయితే దీనిని ప్రభుత్వం తిరస్కరించడంతో విపక్ష సభ్యులు నేరుగా స్పీకర్ వెల్ లోకి వెళ్ళి తమ నిరసనను తెలియచేశాయి. బిల్లు ప్రతులను చించడం పట్ల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందుకేనా ప్రజలు గెలిపించి పార్లమెంట్ కి పంపించింది అని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. లోక్ సభలో ప్రతీ సభ్యుడూ ఏమి చేస్తున్నారు అన్నది ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు అని ఆయన చెప్పారు.
జీ రాం జీ గొప్పది :
ఇదిలా ఉంటే జీ రాం జీ బిల్లు మంచి ఆశంతో తీసుకుని వచ్చామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటిదాకా ఈ పధకం కింద ఏడాదికి వంద రోజులు మాత్రమే పనులు ఉంటే దానికి 125కి పెంచామని చెప్పుకొచ్చింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు కార్మికులకు మేలు చేసే పధకం అని కూడా పేర్కొంది. పాత చట్టంలో అవినీతి ఆస్కారం ఉందని, అందుకే పారదర్శకంగా కొత్త చట్టం తెచ్చామని చెబుతోంది. అయితే ఇది యూపీఏ ప్రభుత్వం ఘనత అని ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది అనే పేరుని మార్చేసి మొత్తం రూపు రేఖలు లేకుండా చేస్తున్నారు అని విపక్షం మండిపడింది. మొత్తం మీద లోక్ సభలో విపక్షం నిరసనలు గందరగోళం మధ్యనే ఈ బిల్లుని ఆమోదించారు.
