Begin typing your search above and press return to search.

నాడు వైఎస్సార్ చేశారు...నేడు షర్మిలకు కఠిన పరీక్ష

కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది అంటే ఆ పుణ్యం దివంగత నేత వైఎస్సార్ ది అని చెప్పాలి.

By:  Satya P   |   2 Jan 2026 11:00 PM IST
నాడు వైఎస్సార్ చేశారు...నేడు షర్మిలకు కఠిన పరీక్ష
X

కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది అంటే ఆ పుణ్యం దివంగత నేత వైఎస్సార్ ది అని చెప్పాలి. ఎందుకంటే ఆయన 2023 లో ఏప్రిల్ నెలలో మండుటెండలో చేసిన చేవేళ్ళ టూ ఇచ్చాపురం భారీ పాదయాత్ర ఫలితం అని విశ్లేషించాలి. 2004 లో యూపీఏ వన్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా 2009 లో యూపీఏ టూ మరోసారి పదవిని అందుకున్నా దాని వెనక ఏపీలో ఎక్కువ సంఖ్యలో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు కారణం. అలాగే ఆనాటి సీఎం వైఎస్సార్ కారణం. ఇక వైఎస్సార్ ని కాంగ్రెస్ అగ్ర నాయాకత్వం ఎంతగానో గౌరవించింది. అనేక పధకాలను కూడా ఏపీ నుంచి ఆనాడు శ్రీకారం చుట్టారు. అందులో ఒకటి జాతీయ ఉపాధి హామీ పధకం. 2006 ఫిబ్రవరి నెలలో ఈ కార్యక్రమాన్ని ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఆర్భాటంగా ప్రారంభించారు. ఒక జాతీయ స్థాయి పధకాన్ని ఏపీ నుంచి ప్రారంభించడం అన్నది వైఎస్సార్ సాధించిన ఘనతలలో ఒకటి. ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ వచ్చినపుడు జన సమ్మర్ధం ఒక స్థాయిలో ఉంది వైఎస్సార్ చరిష్మాకు అది ఒక సంకేతంగా నిలిచింది. కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయే సభలలో ఒకటిగా ఆనాడు అది సాగింది.

షర్మిల నాయకత్వంలో :

కట్ చేస్తే ఈ రోజున యాధృచ్చికంగా వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల నాయకత్వంలో ఏపీ కాంగ్రెస్ ఉంది. షర్మిల పీసీసీ చీఫ్ అయి ఈ జనవరికి రెండేళ్ళు పూర్తి అవుతుంది. ఆమె ఆ బాధ్యతలను అందుకున్న తరువాత సాధించింది ఏమైనా ఉంది అంటే ఏపీలో కాంగ్రెస్ కి ఉనికి లేకుండా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో గద్దె నుంచి దించడంలో తన వంతు పాత్ర పోషించడమే. అయితే అదే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని మాత్రం వెనక్కి చూపించలేకపోయారు అన్నది నిష్టుర సత్యంగా ఉంది. కాంగ్రెస్ గ్రాఫ్ ఆమె నాయకత్వంలో ఏ విధంగానూ పెరగలేదు సరికదా ఉన్న సీనియర్ నేతలు అనేక మంది ఇపుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్ ఏపీలో చతికిలపడింది అన్నది అంతా అంటున్న మాట.

భారీ సవాల్ గా :

ఈ నేపథ్యంలో షర్మిల నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ నాయకుల సమక్షంలో శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలోనే ఫిబ్రవరి 2న అతి పెద్ద నిరసన కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి గాంధీల త్రయం వస్తున్నారు. అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా హాజరవుతున్నారు. ఇక ఏఐసీసీ సభ అందునా సోనియా గాంధీ రాక రాక ఏపీకి వస్తున్న సందర్భం. కాంగ్రెస్ కి ప్రెస్టేజ్ గా ఉన్న జాతీయ ఉపాధి పధకం రూపూ రేఖలను మోడీ ప్రభుత్వం మార్చిందని ఆ సెంటిమెంట్ ని రాజేసే వ్యూహం. ఇలా ఇవన్నీ చూసుకున్నపుడు శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలోని సభ కాంగ్రెస్ కి చాలా ప్రధానమైనది. అలాంటి సభను సూపర్ సక్సెస్ చేయడం అంటే అది షర్మిల నాయకత్వానికి ఒక అగ్ని పరీక్ష అని చెబుతున్నారు. జన సమీకరణ విషయంలో కానీ కాంగ్రెస్ జాతీయ పెద్దలను సంతృప్తి పరచేలా సభను జరిపించడంలో కానీ షర్మిల ఎంతో చేయాల్సి ఉందని అంటున్నారు.

వైఎస్సార్ వారసత్వం :

నాడు వైఎస్సార్ ఏ లోటూ లేకుండా ఏపీలో కాంగ్రెస్ జాతీయ నాయకుల మీటింగులు అన్నీ సక్సెస్ చేయించారు. అఫ్ కోర్స్ అప్పట్లో కేంద్రంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వైఎస్సార్ కూడా ఎంతో అనుభవం కలిన నేత, సీఎం గా కూడా ఉన్నారు. ఇపుడు అంతా ప్రతికూల వాతావరణం ఉంది. అయినా కానీ మోడీ మీద పోరు అంటే కాంగ్రెస్ సభ ఎక్కడా ఫెయిల్ కాకూడదు, జనాలు రాలేదన్న నింద పడకూడదు. ఇవన్నీ జరగాలంటే షర్మిల ఈ నెల రోజులు పూర్తిగా ఫోకస్ పెట్టి ఈ సభను హిట్ చేయాల్సి ఉంది. అది ఆమె నాయకత్వ దీక్షా దక్షతలకు గీటు రాయిగా మారనుంది అని అంటున్నారు. అంతే కాదు వైఎస్సార్ వారసురాలిగా వైఎస్సార్ ఫ్యామిలీకి అచ్చి వచ్చిన హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలో సభ విజయవంతం అయింది అంటే షర్మిలకే ఆ టోటల్ క్రెడిట్ దక్కుతుంది. సో షర్మిల ముందు అతి పెద్ద బాధ్యత ఉంది అన్నది అంతా అంటున్న మాట.