ఐసీయూలో వైద్యుల నిర్లక్ష్యం.. ఆసుపత్రికి రూ.18 లక్షల ఫైన్
మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఒక యువకుడు 2010 ఏప్రిల్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడి తండ్రి అతడ్ని స్థానికంగా ఉండే ఒక ప్రైవేటు ఆసుపత్రికి చేర్పించాడు.
By: Garuda Media | 30 July 2025 1:00 PM ISTతీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వేళ పరుగు పరుగున ఆసుపత్రులకు వెళ్లటం. ఐసీయూని ఆశ్రయించటం లాంటివి కామన్. ఐసీయూలో అందించే చికిత్సలోని లోపంతో ఒక ప్రాణం పోయిన విషాద ఉదంతంపై ఆసుపత్రికి భారీగా ఫైన్ విధించింది ఒక వినియోగదారుల కమిషన్. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఎంతోమందికి కొత్త స్ఫూర్తిని ఇవ్వటంతో పాటు.. ఎంతో మంది బాధితులకు కొత్త ఆశల్ని కల్పించేలా చేస్తోంది. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఒక యువకుడు 2010 ఏప్రిల్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడి తండ్రి అతడ్ని స్థానికంగా ఉండే ఒక ప్రైవేటు ఆసుపత్రికి చేర్పించాడు. తర్వాతి రోజు తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లే వేళలో బాధితుడు ఛాతీ నొప్పితో కింద పడిపోయాడు. అతడి పరిస్థితి క్షీణిస్తున్నట్లు కనిపించినప్పటికి ఆసుపత్రి వర్గాలు అతడ్ని ఐసీయూకు షిప్టు చేయలేదు. ఉదయం ఏడు గంటలు అవుతున్నా అతడికి అత్యవసర వైద్య చికిత్స అందించలేదు.
ఈ ఆలస్యం చివరకు మధ్యాహ్నం 12.50గంటల వేళలో బాధితుడు మరణించినట్లుగా సదరు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. తన కొడుకు ఉదయం ఎనిమిది గంటల వేళలోనే మరణించాడని.. అతనికి చికిత్స చేసినట్లుగా ఆధారాలు క్రియేట్ చేసేందుకు మధ్యాహ్నం వరకు వైద్యులు చికిత్స చేసినట్లుగా చూపించినట్లుగా బాధితుడి తండ్రి ఆరోపించారు
ఆసుపత్రి.. అందులోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ జిల్లా వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించారు. ఐసీయూ పర్యవేక్షణ అవసరమైన వేళ వైద్యులు సరిగా వ్యవహరించలేదని.. ఈ క్రమంలోనే తన కొడుక్కి గుండెపోటు వచ్చి మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జిల్లా ఫోరమ్ తిరస్కరించటంతో బాధితుడి తండ్రి రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు,
ఇక్కడ జరిగిన వాదనల్లో నైపుణ్యం ఉన్న వైద్యులు చికిత్స చేశారని.. బాధితుడి తండ్రి ఆరోపణల్లో నిజం లేదని.. ఆసుపత్రి తరఫున ఎలాంటి సేవాలోపం లేదంటూ ఆసుపత్రి యాజమాన్యం కమిషన్ ఎదుట తన వాదనను వినిపించింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలే బాధితుడి మరణానికి కారణంగా పేర్కొన్నారు. ఐసీయూ ఆడ్మిషన్ కు బాధితుడి తండ్రి ఒప్పుకోలేదని వాదనలు వినిపించారు.
ప్రాణపాయ పరిస్థితుల్లో ఐసీయూ ఆడ్మిషన్ కు చట్టపరంగా సమ్మతిఅవసరం లేదన్న సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించిన కమిషన్.. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేస్తే.. ప్రాణాంతకమన్న అంశాన్ని గుర్తు చేస్తూ..ఆసుపత్రి వైఖరిని తప్పు పట్టింది. జీవించే హక్కులో అత్యవసరమైన వైద్య సంరక్షణ కూడా ఒక భాగమన్న కమిషన్.. మరణించిన వ్యక్తి కుటుంబీకులు పడిన మానసిక వేదనను పరిగణలోకి తీసుుకొని సదరు ఆసుపత్రికి రూ.18 లక్షలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తానికి 2010 అక్టోబరు నుంచి ఆరు శాతం వడ్డీతో కలిపి బాధితులకు చెల్లించాలని పేర్కొంది. వైద్య సేవలు అందించే విషయంలో ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం వహిస్తే.. చట్టప్రకారం పోరాడాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
