మోడీ ముందు ఎన్నో సవాళ్లు !
తప్పుడు ఓట్లు ఫేక్ ఐడీలు ఈసీ సాయం ఇలా రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీతో ఈసీని ముడి పెట్టి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
By: Satya P | 13 Aug 2025 9:46 AM ISTకేంద్రంలో మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీకి ఈసారి అంత సవ్యంగా సాఫీగా సాగేలా కనిపించడం లేదు అని అంటున్నారు. బీజేపీకి మెజారిటీ సొంతంగా లేదు. మిత్రుల ఆసరాతో కేంద్ర ప్రభుత్వం నడపాలి. అది తొలి సవాల్. పైగా రాజకీయంగా ఎంతో విశేష అనుభవం ఉన్న చంద్రబాబు నితీష్ కుమార్ లను పక్కన పెట్టుకుని ప్రభుత్వం నడపడం కూడా కత్తి మీద సాము లాంటిది. అయితే ఇప్పటికి అయితే ఈ ఇద్దరు మిత్రుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ రాజకీయ వాతావరణం జాతీయ స్థాయ్హిలో నెమ్మదిగా మారిన వేళనే ఎన్డీయే మిత్రుల స్టాండ్ వారి వ్యూహాలు ఏంటో తెలుస్తాయన్న చర్చ ఉండనే ఉంది.
అటు ఆర్ఎస్ఎస్ అలా :
బీజేపీకి రాజకీయ గురువు మార్గదర్శి అయిన ఆర్ఎస్ఎస్ మోడీ మీద పరోక్షంగా ఒత్తిడి పెడుతోంది. ఏడున్నర పదుల వయసు నిండిన వారు రాజీనామాలు చేయాల్సిందే రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే అని ఆర్ఎస్ఎస్ భారీగానే సూచనలు చేస్తోంది. ఇదంతా మోడీని దృష్టిలో పెట్టుకునే అని అంటున్నారు. ఇక చూడబోతే ఒక్క నెల మాత్రమే ఉంది. మోడీ 75 ఏళ్ళు నిండి 76వ ఏటలోకి అడుగు పెట్టడానికి. మరో వైపు చూస్తే రాజకీయంగా అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. రాహుల్ గాంధీ అనూహ్యంగా విపక్షం నుంచి పుంజుకుంటున్నారు. తన బలమైన వాయిస్ ని వినిపిస్తున్నారు.
రాజకీయ రచ్చగానే :
తప్పుడు ఓట్లు ఫేక్ ఐడీలు ఈసీ సాయం ఇలా రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీతో ఈసీని ముడి పెట్టి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ రోజున దేశంలో అది హాట్ టాపిక్ అయింది. ఈసీ తప్పుడు పద్ధతులు అనుసరించి బీజేపీకి సాయం చేసింది అని ఓట్ల చోరీ అని రాహుల్ అండ్ కో గొంతు పెంచుతున్నారు. దానిని ఎలా ఎదుర్కోవాలో ఈసీకి పాలుపోవడం లేదు. అదే సమయంలో బీజేపీ సాధించిన విజయాల వెనక మోడీ ఇమేజ్ కాకుండా ఈ తరహా వ్యూహాలు ఉన్నాయా అన్న చర్చ అయితే జనంలోకి గట్టిగా వెళ్లేలా ఇండియా కూటమి తీవ్రతరమైన ప్రచారాన్ని చేసింది.
బీహార్ తో సీన్ మారుతుందా :
ఇక చూస్తే కేవలం రెండు మూడు నెలల వ్యవధిలో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల ముందే ఇలా ఈసీ విశ్వసనీయతను బీజేపీ రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీసేలా విపక్షం మొత్తం ఎలుగెత్తి చాటుతోంది. చేయాల్సిన విమర్శలు అన్నీ చేస్తోంది. దాంతో ఏమి జరుగుతుంది అన్నదే ఇపుడు అందరి మదిలో ఉంది. బీహార్ లో కనుక ఎన్డీయే కూటమి ఓటమి పాలు అయితే కనుక అసలైన కష్టాలు కేంద్రంలోని ఎన్డీయే కూడా మొదలవుతాయా అన్నది కూడా ఉంది.
గాలి మారితే తీరు మారుతుందా :
దేశంలో గాలి రాజకీయంగా మారితే దాని ప్రభావం కచ్చితంగా ఎన్డీయే కూటమి మీద పడుతుంది అని అంటున్నారు. మిత్రులు కూడా అపుడు ఏ విధంగా ఆలోచిస్తారు మరే విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే అంతర్జాతీయంగా కూడా భారత్ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. రష్యాతో ఇబ్బంది లేకపోయినా చైనాతో మాత్రం భారత్ చెలిమి అంత విశ్వసనీయంగా ఉంటుందా అన్న చర్చ ఉండనే ఉంది.
ఇవన్నీ కూడా మోడీ గడచిన పదకొండేళ్ళుగా చూడని సవాళ్ళుగా మారబోతున్నాయని అంటున్నారు. పక్కలో బల్లెంగా పాక్ ఉంటే దానికి పాలు పోసేందుకు అమెరికా సిద్ధంగా ఉంటే ఆ పరిణామాలు కూడా ఏ మలుపు తిరుగుతాయన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తానికి నరేంద్ర మోడీకి ఇంటా బయటా సమస్యలు అయితే పొంచి ఉన్నాయని అంటున్నారు. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తే మోడీ అజేయుడే అని స్పష్టంగా అంతా ఒప్పుకుంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
