Begin typing your search above and press return to search.

బిల్లును కాదు.. మహిళా శక్తినే ఓడించారు

భారత రాజకీయాల్లో మహిళా సాధికారత లక్ష్యంగా అడుగులు పడుతున్న తరుణంలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందకపోవడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

By:  A.N.Kumar   |   19 April 2026 12:08 AM IST
బిల్లును కాదు.. మహిళా శక్తినే ఓడించారు
X

భారత రాజకీయాల్లో మహిళా సాధికారత లక్ష్యంగా అడుగులు పడుతున్న తరుణంలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందకపోవడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన విపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు ఈ బిల్లును అడ్డుకున్నాయని.. ఇది భారత నారీశక్తికి జరిగిన తీరని అవమానమని ఆయన మండిపడ్డారు.

స్వార్థ రాజకీయాల వల్లే అడ్డంకులు

బిల్లు వైఫల్యానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల సంకుచిత మనస్తత్వమేనని ప్రధాని ఆరోపించారు. దేశ హితం కంటే తమ రాజకీయ మనుగడే ముఖ్యమని భావించే పార్టీలు మహిళల కలలను చిదిమేశాయని విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ , డీఎంకే , సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుకు అడ్డంకులు సృష్టించాయని ఆయన నేరుగా పేరు పేర్కొన్నారు. "ఈ బిల్లును ఓడించడం అంటే కేవలం ఒక చట్టాన్ని ఓడించడం కాదు.. దేశంలోని సగం జనాభా అయిన నారీశక్తినే ఓడించడం. ఇది మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి." అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

'భ్రూణహత్య'తో పోల్చిన ప్రధాని

గత 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం చేస్తున్న పోరాటాన్ని విపక్షాలు హేళన చేశాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడాన్ని ఆయన అత్యంత తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తూ, ఇది ‘రాజకీయ భ్రూణహత్య’ తో సమానమని అభివర్ణించారు. మహిళలు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకనే ఈ పాపానికి ఒడిగట్టారని.. ఈ అన్యాయాన్ని దేశ మహిళలు ఎప్పటికీ మర్చిపోరని హెచ్చరించారు. భవిష్యత్తు ఎన్నికల్లో మహిళలు తమ ఓటు హక్కుతో విపక్షాలకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌పై స్పష్టత

బిల్లు అమలుకు ముడిపడి ఉన్న డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన భరోసా ఇచ్చారు. దీనివల్ల లోక్‌సభలో అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని.. అది దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను అయోమయానికి గురిచేయడం కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందని ధ్వజమెత్తారు.

సంస్కరణలకు వ్యతిరేకిగా కాంగ్రెస్

దేశాభివృద్ధికి తోడ్పడే ప్రతి కీలక నిర్ణయాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ నైజమని ప్రధాని విమర్శించారు. గతంలో జన్‌ధన్ యోజన, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆర్థిక సంస్కరణలు...జీఎస్టీ అమలు.. ఆర్టికల్ 370 రద్దు... ముస్లిం మహిళల కోసం తెచ్చిన ట్రిపుల్ తలాక్ రద్దు.. వంటి ప్రతి చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి నిరోధక శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, భారత నారీశక్తి ఎదుగుదలను ఎవరూ ఆపలేరని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మహిళా శక్తికి అండగా నిలబడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ పోరాటం ఇక్కడితో ఆగదని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.