Begin typing your search above and press return to search.

మోడీ వర్సెస్ అదర్స్...చక్రబంధం నుంచి బయటికెలా ?

నరేంద్ర మోడీ రాజకీయ చాణక్యుడు అని వేరేగా విశేషణాలు తగిలించాల్సిన అవసరం లేదు. ఆయన ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం వర్కర్ గా ఉంటూ ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం బీజేపీలో చేరారు.

By:  Satya P   |   24 July 2026 1:03 PM IST
మోడీ వర్సెస్ అదర్స్...చక్రబంధం నుంచి బయటికెలా ?
X

నరేంద్ర మోడీ రాజకీయ చాణక్యుడు అని వేరేగా విశేషణాలు తగిలించాల్సిన అవసరం లేదు. ఆయన ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం వర్కర్ గా ఉంటూ ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం బీజేపీలో చేరారు. అలా అంచెలంచెలుగా అందులో ఎదుగుతూ 1990 నాటికల్లా గుజరాత్ బీజేపీలో ప్రముఖ నేత స్థాయిని అందుకున్నారు. అప్పట్లో గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెర వెనక నరేంద్ర మోడీ పాత్రను ఎవరూ మరచిపోలేరు. కేశూభాయి పటేల్ వంటి వారితో కలసి పార్టీలో మోడీ పనిచేశారు. అనూహ్యంగా 2001లో ఆయనే గుజరాత్ సీఎం అయిపోయారు. ఆ సమయంలో ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, 2002లో ఆయన ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి వచ్చారు.

పాతికేళ్ళ ప్రస్థానంలో :

ఇక బీజేపీలో కురు వృద్ధులు ఎందరో మోడీని ప్రోత్సహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అందరితో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. వారి కుడి భుజంగా ఆయన ఉంటూ వచ్చారు. వరిష్ట నేత ఎల్ కే అద్వానీ పట్ల మోడీకి గురు భావం ఉంటే ఆయన శిష్య వాత్సల్యంతో ఆదరించారు. వాజ్ పేయి అంటే మోడీకి స్పూర్తి. ఇక మాజీ బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషీ వంటి వారు కూడా మోడీ పట్ల ఆప్యాయంగా ఉండేవారు. ఇలా బీజేపీలో ఎందరో ఉద్ధండ నేతల ఆశీస్సులు అందుకున్న మోడీ అనూహ్యంగా 2013లో బీజేపీకి ప్రధాని అభ్యర్థి అయ్యారు. 2014లో ఆయన గెలిచి ప్రధాని పీఠం ఎక్కారు. ఆ తరువాతనే పార్టీలో మోడీ శకం మొదలైంది. అదే సమయంలో మోడీతో ఇతర నేతలకు గ్యాప్ కూడా ఏర్పడింది అని అంటారు.

కురు వృద్ధులు దూరంగా :

ఇక బీజేపీలో కురు వృద్ధులు అంతా దూరంగా ఉండిపోయారు. వారిని బీజేపీలో కొత్తగా తెచ్చిన రాజకీయ సూత్రం పక్కన పెట్టేసింది అని అంటారు. 75 ఏళ్ళు దాటిన వారు అంతా పార్టీకి రాజకీయాలకు అలా దూరం అయిపోయారు. మోడీతో వారికి గ్యాప్ కూడా అపుడే వచ్చింది అంటారు. మరో వైపు బీజేపీలో మోడీ శకం మొదలవనంతవరకూ మార్గదర్శిగా ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకంగా ఉండేది. మోడీ వచ్చాక అంతా తానే అయి పార్టీని నడిపిన తీరుతో ఆర్ఎస్ఎస్ కూడా అసంతృప్తిగా ఉందని వార్తలు వచ్చాయి. ఆ విధంగా సంఘ్ వైపు నుంచి గ్యాప్ ఉందని అంటారు.

విపక్షాలు సహజం :

ఇక మోడీ హయాంలో ఇంత సుదీర్ఘంగా బీజేపీ దేశాన్ని ఏలుతుందని విపక్షాలు ఊహించలేదు. మొదట్లో ఎవరికి వారుగా విడివిడిగా మోడీని ఎదుర్కొన్నారు. కానీ 2019 తరువాత మోడీ బలం తెలిసి సీన్ మార్చారు. అంతా కలసి వస్తున్నారు. 2024 ఎన్నికల నాటికి మరింత పటిష్టంగా ఇండియా కూటమి పేరుతో ఎదుర్కొన్నారు. 2029 నాటికి ఇది ఇంకా పకడ్బందీగా మారే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు వివిధ సంస్థలు మేధావులు ప్రజా సంఘాలు లెఫ్ట్ ఫిలాసఫీని తమ సొంతం చేసుకున్న వారందరికీ మోడీ నచ్చడం లేదు. ఇది సహజం అని కూడా చెప్పాల్సి ఉంది. ఇపుడున్న పార్టీలో కూడా మోడీ హవా ఆయన ఇమేజ్ పొలిటికల్ గ్లామర్ చూసి అనేక మంది సైలెంట్ అయ్యారు అని అంటారు. కానీ వారి మనసులో సైతం మోడీ ఏకపక్ష విధానాల పట్ల అసంతృప్తి ఉందని అంటారు.

మోడీ విత్ షా :

ఈ ఇద్దరూ కలిస్తే ఏమి జరుగుతుందో దేశంలో పన్నెండేళ్ళ రాజకీయ పరిణామాలు చెబుతాయి. ఈ రోజున సగానికి పైగా రాష్ట్రాలు బీజేపీ పరం అయ్యాయి. అలాగే చాలా చోట్ల ఎన్డీయే పాలన ఉంది. ప్రతిపక్షాలకు భారత రాజకీయ చిత్ర పటంలో అతి తక్కువ ప్లేస్ మాత్రమే మిగిలి ఉంది. మొత్తం కాషాయ మయం చేయడానికి మోడీ షా కలసి చేస్తున్న రాజకీయం వేస్తున్న వ్యూహాలు బీజేపీకి అధికార లాభాలను తెస్తున్నాయి. కానీ ఎందుకో బీజేపీలో ఉన్న వారే ఈ విజయాల పట్ల ఆనందంగా ఉండలేకపోతున్నారు అని అంటున్నారు. అలాగే బీజేపీని ఈ స్థాయిలో చూడాలనుకున్న వరిష్ట నేతలు ఆ పని చేసి చూపించిన మోడీని దీవించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. మురళీ మనోహర్ జోషీ వంటి వారు తాజాగా విద్యార్థి ఉద్యమాల మీద మోడీ సర్కార్ నే విమర్శించిన విషయం తెలిసిందే. మరి ఈ తేడాలేంటో మోడీకే అర్ధం కావాల్సి ఉంది.

రాజకీయ మొనగాడుగా :

మోడీ అంటే రాజకీయ మొనగాడుగా అపజయం లేని వీరుడిగా భారతీయ చరిత్రలో కనిపిస్తారు. ఆయన పట్టుకుంటే జయమే అన్నది కూడా అంతా చూస్తున్న విషయం. మోడీ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా జరిగే పొలిటికల్ వార్ లో ఒంటి చేత్తోనే ఆయన గెలుచుకుని వస్తున్నారు. తన ఇమేజ్ తో పాటు జనాల నాడి పట్టుకునే ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ మధ్యలో వచ్చే విమర్శలు అవి స్వపక్షం నుంచి అయినా విపక్షం నుంచి అయినా ఆయన లెక్క చేయడం లేదు. తాజా విద్యార్థి ఉద్యమం పేరుతో దేశంలో సాగుతున్న అలజడులను కూడా గట్టిగానే ఎదుర్కోవాలని చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే మోడీ మామూలు నాయకుడు కాదు, అందుకే ఆయన మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు, అయితే ప్రస్తుతం ఇంటా బయటా చక్రబంధం బిగుస్తోంది. మరి దీని నుంచి మోడీ ఎలా బయటపడతారు అన్నది దేశం మాత్రమే కాదు ప్రపంచం కూడా చూస్తోంది. ఎందుకంటే మోడీ అనేక దేశాలలో విరివిగా పర్యటించి బలమైన నేతగా ఆవిష్కరించబడ్డారు. మరి ప్రస్తుతం సాగుతున్న ఈ ఉద్యమాలకు లాజికల్ ఎండ్ ఎక్కడ, మోడీ ఏ మాత్రం తగ్గకుండానే నెగ్గుతారా అన్నది చూడాల్సి ఉంది.