డీఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు: మోడీ సంచలన వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి స్వార్థపూరిత రాజకీయాలు మరోసారి బయట పడ్డాయని వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 10 May 2026 6:12 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి స్వార్థపూరిత రాజకీయాలు మరోసారి బయట పడ్డాయని వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా ఉన్న డీఎంకేతో బంధాన్ని ఒక్కసారిగా తెగతెంపులు చేసుకుందని ప్రధాని విమర్శించారు. అధికార కాంక్ష తప్ప.. నీతి, నిజాయితీ, స్నేహం విలువ, మిత్రుల పట్ల ప్రేమ వంటివి ఆ పార్టీకి ఎప్పటికీ తెలియవని దుయ్యబట్టారు. దశబ్దాలుగా ఉన్న స్నేహాన్ని ఒక్కరాత్రితో తెగతెంపులుచేసుకుని.. అధికారం కోసం అర్రులు చాచిందని వ్యాఖ్యానించారు.
తాజాగా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఐదు స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయంటే దాని వెనుక డీఎంకే శ్రేణుల కృషి.. ఆ పార్టీ నాయకుల ప్రోత్సాహం ఎంతో ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. కానీ, ఇవన్నీ కల్లలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తును తెంచుకుని.. అన్యాయం చేసిందన్నారు. ఇలాంటి పార్టీలను ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో పర్యటించిన ప్రధాని మోడీ.. ఇక్కడ జరిగిన బీజేపీ అభినందన సభలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం దక్కించుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీని ఇక్కడి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన మోడీ.. కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. ఇలాంటి పార్టీకి ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని సూచించారు. మిత్రపక్షాలనే మోసం చేసే పార్టీ ప్రజలకు ఏం మేలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు.
కాగా.. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం దక్కించుకుంది. కానీ, మెజారిటీ సరిపోక పోవ డంతో.. కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే తన మిత్రపక్షం డీఎంకేతో పొత్తును తెంచుకుంది. దీనిపై రాజకీయంగా విమర్శలు వచ్చినా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభను ఏదో ఒక విధంగా నిలబెట్టుకునే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ టీవీకేతోచేతులు కలిపి.. అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవులను కూడా దక్కించుకుంది.
