Begin typing your search above and press return to search.

కార్యకర్త నుంచి నేరుగా సీఎం పీఠానికి...పాతికేళ్ళ మోడీ ప్రస్థానం !

నరేంద్ర మోడీ ఈ రోజున దేశానికి వరసగా మూడవసారి ప్రధానిగా ఉన్నారు. మూడవ టెర్మ్ లో దాదాపుగా సగం పాలనను పూర్తి చేసుకుంటున్నారు.

By:  Satya P   |   6 Oct 2026 9:52 PM IST
కార్యకర్త నుంచి నేరుగా సీఎం పీఠానికి...పాతికేళ్ళ మోడీ ప్రస్థానం !
X

నరేంద్ర మోడీ ఈ రోజున దేశానికి వరసగా మూడవసారి ప్రధానిగా ఉన్నారు. మూడవ టెర్మ్ లో దాదాపుగా సగం పాలనను పూర్తి చేసుకుంటున్నారు. అయితే మోడీ రాష్ట్రంలో మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే సీఎం గా ప్రమాణం చేశారు. ఒక సాధారణ కార్యకర్తగా బీజేపీకి సేవ చేస్తున్న మోడీకి బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. అంతే ఆయన సైతం ఆశ్చర్యపోయేలా అధికార పీఠం దరి చేరింది. అలా 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎం గా మోడీ ప్రమాణం చేశారు. అదే ఏడాది జనవరి నెలలో గుజరాత్ పెను భూకంతో అల్లాడింది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఆ ప్రకృతి విపత్తుకు గుజరాత్ చిగురాకులా వణికింది. ఏకంగా ఇరవై వేల మంది ప్రజలు భూకంపానికి బలి అయిపోయారు. ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఆస్థి నష్టం అపారంగా జరిగింది.

అనుభవం లేకుండానే :

నేరుగా సీఎం కావడంతో మోడీకి ఎలాంటి పరిపాలన అనుభవం లేదు. పైగా గుజరాత్ భూకంపం ద్వారా సంక్షోభంలో చిక్కుకుంది. అన్ని విధాలుగా రాష్ట్రం ఇబ్బందులో ఉంది. ఇక బీజేపీలో కూడా కొంత నాయకత్వ సమస్యలు ఉన్నాయి. ఈ కీలక సమయంలో మోడీ సీఎం అయ్యారు. అయితే తనకు పాలన విషయంలో అనుభవం లేకపోయినా ఒక సవాల్ గా తీసుకుని పని చేసినట్లుగా తరువాత కాలంలో మోడీ చెప్పుకున్నారు. ముఖ్యంగా పేద ప్రజలు వారి సమస్యల పట్ల తనకు ఉన్న అవగాహన పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడింది అని మోడీ చెప్పారు. ఇక 2002లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ ని మోడీ ఒంటి చేత్తో గెలిపించారు. అలాగే 2007, 2012లో కూడా బీజేపీని గెలిపించారు. 2014 మే లో దేశానికి ప్రధాని అయ్యేదాకా మోడీ ఏకంగా 13 ఏళ్ళ పాటు గుజరాత్ ని ఏలారు. అక్కడ నుంచి ఆయన దేశానికి ప్రధానిగా సేవలు అందిస్తున్నారు.

కేబినెట్ ప్రశంసలు :

ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ ప్రజా పాలకుడిగా మారి అక్టోబర్ 7 కి పాతికేళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో మంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో మంత్రులందరూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించి ప్రధానమంత్రికి హృదయపూర్వక అభినందనలు తెలపడం విశేషం. ఇక ఆయన ఈ పాతికేళ్ళలో ఎక్కడా విరామం అన్నది తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా ప్రధానిగా ఆయన అధికార హోదాలో ఉంటూ ప్రజలకు తన నిరంతర నాయకత్వం అందించారు. అంతే కాదు భారత రాజకీయ చరిత్రలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా ఇలా విరామం లేకుండా పాతికేళ్ల పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగిన ఏకైక నాయకుడిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పక తప్పదు.

బీజేపీ సంబరాలు :

మోడీ పాతికేళ్ళ ప్రస్థానం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరో వైపు చూస్తే ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోడీ పేరిట విజయవాడ కనకదుర్గమ్మ కోవెలలో ప్రత్యేక పూజలను ఈ నెల 7న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని మోడీ పేరుతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి అంతరాలయంలోని శ్రీచక్రానికి అత్యంత శక్తిమంతమైన ఖడ్గమాల అర్చనను ప్రధాని మోదీ పేరిట నిర్వహిస్తారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి దుర్గమ్మ సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, ఆయనకు పరిపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని కాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాయకులు నిర్వహిస్తున్నారు.