మోడీ దృష్టిలో రాహుల్ గ్రాఫ్ ?
ప్రధాని నరేంద్ర మోడీ పరోక్ష ప్రత్యక్ష రాజకీయ అనుభవం దశాబ్దాలకు పైబడి ఉంటుంది ఇక ఆయన ముఖ్యమంత్రిగా 13 ఏళ్ళకి పైగా ఏకధాటిగా గుజరాత్ నుంచి పనిచేశారు.
By: Satya P | 12 March 2026 4:00 AM ISTప్రధాని నరేంద్ర మోడీ పరోక్ష ప్రత్యక్ష రాజకీయ అనుభవం దశాబ్దాలకు పైబడి ఉంటుంది ఇక ఆయన ముఖ్యమంత్రిగా 13 ఏళ్ళకి పైగా ఏకధాటిగా గుజరాత్ నుంచి పనిచేశారు. అలాగే దేశానికి ప్రధానిగా గత పన్నెండేళ్ళుగా చేస్తున్నారు. ఈ రెండూ కలిసి మోడీ పాలనానుభవం పావు శతాబ్దం పైగానే ఉంది. వర్తమాన దేశ రాజకీయాల్లో నాన్ స్టాప్ గా పరిపాలనలో ఉండడం అనేది ఒక్క మోడీకే దక్కిన అరుదైన రికార్డుగా చూడాలి. మోడీ తొలిసారి గుజరాత్ ప్రధాని అయినప్పుడు ఆయన వయసు 51 ఏళ్ళు. ఆనాటి నుంచి నేటి వరకూ టాప్ చెయిర్ నుంచి మోడీ దిగలేదు.
గాంధీల వారసుడిగా :
ఇక లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కీలకమైన బాధ్యతలు 2024 నుంచి నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ వయసు 55 ఏళ్ళు. గాంధీల వంశంలో ఐదవ తరం వారసుడిగా ఉన్న రాహుల్ కి అధికార పదవులు అందని పండు అయ్యాయి. దానికి కారణం కాంగ్రెస్ పతనావస్థ కాదు, రాహుల్ లో వ్యూహాల లేమి ప్రధాన కారణం అన్న విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ వన్ యూపీయే టూ ప్రభుత్వాలు దేశాన్ని 2004 నుంచి 2014 దాకా పదేళ్ళ పాటు ఏలాయి. ఆ సమయంలో కాంగ్రెస్ యువ నేతగా రాహుల్ తలచుకుంటే ప్రధాని ఎపుడో అయ్యేవారు. అది కూడా మోడీ కంటే ముందే అయి తన సత్తా చాటేవారు. కానీ రాహుల్ లో ఆ రాజకీయ చాతుర్యం లోపించడం వల్లనే ఆయన 2024 వరకూ జస్ట్ ఎంపీగానే ఉండిపోయారు.
నాయకుడిగా సైతం :
ఇక కాంగ్రెస్ కి అగ్ర నాయకుడిగా రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేసే విషయంలోనూ వెనుకబడ్డారు. కీలక నేతలను దగ్గర ఉంచుకోవాల్సింది పోయి వదులుకున్నారు. అలా జ్యోతిరాదిత్య సింధియా కానీ అస్సాం సీఎం హేమంత్ బిశ్వాల్ శర్మ కానీ ఇంకా అనేక మంది నేతలను కానీ కాంగ్రెస్ పోగొట్టుకుంది. అలాగే మిత్రులను సైతం దూరం చేసుకుంది. ఇంకా ఈ దేశంలో ఓల్డ్ కాంగ్రెస్ ట్రెండ్ ని ఫాలో అవుతూ పాత నినాదాలు అవే సిద్ధాంతాలతో రాహుల్ గాంధీ పొద్దు పుచ్చుతున్నారు అని ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. ఇక రాహుల్ అపొజిషన్ లో ఈ విధంగా ఉంటే బీజేపీ బలహీనం అయిన చోట బలంగా మారి తన రాజకీయ శిబిరాన్ని అత్యంత దుర్భేద్యంగా మార్చుకుంది.
యువ రాజు అంటూ :
ఈ రకమైన విశ్లేషణల నేపథ్యంలో రాహుల్ గాంధీని బీజేపీ కానీ మోడీ కానీ ఎప్పటికీ యువ రాజుగానే సంభోదిస్తారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ వారసుడిగానే చూస్తారు. ఆయనని తమకు ఏ మాత్రం ప్రత్యర్థిగా కారని కూడా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. తాజాగా కేరళం రాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని యువరాజు అని మరోసారి సంభోధించారు పశ్చిమాసియా సంక్షోభం మీద రాహుల్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు అంటే రాహుల్ కి ఇంకా ఏమీ తెలియదు అని బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
బీజేపీ ని ఢీ కొట్టలేరు :
నిన్నటికి నిన్న పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా రాహుల్ గాంధీ కంటే ప్రియాంకానే బెటర్ అని ఆమెకు అపొజిషన్ చెయిర్ ని అప్పగించాలని సూచించడం ఇక్కడ గమనార్హం. ఏతా వాతా తేలేది ఏమిటంటే రాహుల్ గాంధీ రాటు తేలలేదని ఆయన రాజకీయాన్ని లైట్ గానే తీసుకోవచ్చని బీజేపీ ఇప్పటికీ భావిస్తోంది అన్న మాట. అందుకే ఆయనను యువ రాజు స్థానంలోనే ఉంచుతోంది. అలా దేశాన్ని ఏలే బీజేపీ దృష్టిలో రాహుల్ గ్రాఫ్ ఎక్కడో ఉండిపోయింది. మరి విపక్షంలో ఉన్న వారు తమను తాము పదును పెట్టుకుంటూ అధికార పీఠం అందుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. రాహుల్ గాంధీ ఈ విషయంలో ఇంతకు ఇంతా కృషి చేస్తేనే తప్ప బీజేపీ ని ఢీ కొట్టలేరు అన్నది కూడా ఒక కఠినమైన విశ్లేషణగా ఉంది.
