మోడీ గ్రాఫ్ పెరుగుతోందా..అదెలా అంటే ?
దేశంలో మూడు సార్లు వరసగా ప్రధానిగా ప్రమాణం చేసి కొత్త రికార్డుని నెలకొల్పారు నరేంద్ర మోడీ. పండిట్ నెహ్రూ తరువాత స్థానంలోకి ఆయన ఆ విధంగా వచ్చేశారు.
By: Satya P | 29 Aug 2025 4:00 PM ISTదేశంలో మూడు సార్లు వరసగా ప్రధానిగా ప్రమాణం చేసి కొత్త రికార్డుని నెలకొల్పారు నరేంద్ర మోడీ. పండిట్ నెహ్రూ తరువాత స్థానంలోకి ఆయన ఆ విధంగా వచ్చేశారు. మరోసారి ప్రధాని కావాలని కూడా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం బీజేపీని మోడీని కొంత నిరాశ పరచాయి. మోడీ నాయకత్వం వహించిన బీజేపీ ఫుల్ మెజారిటీకి దూరంగా నిలిచింది. కేవలం 240 ఎంపీ సీట్లు మాత్రమే సొంతంగా సాధించగలిగింది. అయితే పదిహేను నెలలు గిర్రున తిరగకుండానే దేశంలో రాజకీయం మారుతోందని అది మోడీకి అనుకూలంగా ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయి.
బలమైన నాయకుడిగా :
మోడీకి 2014 నుంచి ఈ రోజు దాకా ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటి అంటే బలమైన నాయకుడు అని. ఆయన నాయకత్వం మీద జనాలకు ఆ విధంగా నమ్మకం అయితే ఉంది. ఇక దేశంలోనూ అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక పరిణామాలను కూడా బేరీజు వేసుకున్న ప్రజలు ఈ కీలక సమయంలో ఆయన ఉండడమే సబబు అని భావిస్తున్నారు. భారత్ కి ఈ రోజు పక్కలో బల్లెంలా పాక్ తో పాటు బంగ్లాదేశ్ ఉంది. అలాగే చైనా కూడా భారత్ కి నమ్మదగిన నేస్తం కాదు. ఈ నేపథ్యంతో పాటు నిన్నటిదాకా మిత్రుడిగా ఉన్న అమెరికా ఈ రోజు శత్రువుగా మారి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు భారత్ కి ఇంటా బయటా సవాళ్ళు అనేకం ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితులలో నరేంద్ర మోడీ నాయకత్వం వీటికి సరైన జవాబు చెప్పగలదని అత్యధికుల విశ్వాసంగా కనిపిస్తోంది అంటున్నారు.
సరిసాటి లేకుండా పోయారా :
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ధీటైన నాయకులు ఎంతో మంది ఉండేవారు. కానీ రాను రానూ ఆ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజాకర్షణ కలిగిన నాయకత్వంతో పాటు అత్యధిక శాతం మంది మన్ననలు పొందే లీడర్లు అవసరం ఉంది ఇక ఒక్కసారి చూసుకుంటే కనుక గత పదకొండేళ్ళ నుంచి నరేంద్ర మోడీ దేశంలో ధీటైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయనకు సరిసాటిగా సమీపంలోకి కూడా వచ్చే వారు పెద్దగా కనిపించడం లేదు అని అంటున్నారు. బీజేపీలో కీలక నేతలు సీనియర్లు ఎంతో మంది ఉన్నా కూడా ఎవరికి వారుగా గొప్పవారే కానీ మోడీ స్థానాన్ని ఆయన స్థాయిని ఆక్రమించేవారు అయితే ప్రస్తుతానికి లేరని అంటున్నారు. ఇక బయట చూసినా విపక్షంలోనూ అదే కొరత ఉంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇపుడిపుడే రాటు తేలుతున్నారు. ఆయనకు పాలనానుభవం అయితే లేదు. అదే విధంగా కాంగ్రెస్ కి మునుపటి ఆదరణ ఇంకా దక్కాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వస్తున్న సర్వేలు కానీ అంచనాలు కానీ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయి.
సిద్ధాంత రాహిత్యం :
ఇంకో వైపు చూస్తే దేశంలో సాగుతున్న రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే రాద్ధాంతాల తం మీదనే పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఒకనాడు సిద్ధాంత పరంగా పార్టీల మధ్య సమరం సాగేది అది జనాలకు కూడా నచ్చేది కానీ ఇపుడు పూర్తిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా చేసుకుంటున్నారు. ఈ పరిణామాల వల్ల జనాలకు ఆయా పార్టీల పట్ల అంతగా మొగ్గు కనిపించేందుకు ఆస్కారం ఉండడం లేదని విశ్లేషణలు ఉన్నాయి.
చట్ట సభలను వాడుకోవాలి :
రాజకీయంగా పై చేయి సాధించాలంటే సిద్ధాంతపరమైన పోరాటం ఉండాలి. దానికి గానూ చట్ట సభలను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. కానీ పార్లమెంట్ లో చూస్తే కనుక ప్రతీ సారీ వాయిదాల పర్వమే సాగుతోంది. ఒకే అంశం మీద మొత్తం సెషన్లు కొట్టుకుని పోతున్నాయి. దాని వల్ల అధికార పక్షానికి పోయేది ఏమీ లేకపోయినా విపక్షానికే రాజకీయంగా నష్టం వాటిల్లుతోంది. ఇవన్నీ కూడా ప్రజల మూడ్ ని కూడా తెలియచేస్తున్నాయి.
మూడ్ ఆఫ్ ది నేషన్ ఇదేనా :
ఇదిలా ఉంటే ఇండియా టుడే సీ ఓటర్ కలిసి చేసి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మరోసారి మోడీ నాయకత్వంలోని బీజేపీకి అవకాశాలు మెరుగు అవుతాయని తేలింది. 2024లో 240 ఎంపీ సీట్లు మాత్రమ సాధించిన బీజేపీ ఈ పదిహేను నెలల్లో మరో ఇరవై సీట్లను పెంచుకుని 260 కి ఎగబాకడం అంటే అది మోడీకి పెరిగిన గ్రాఫ్ గానే చూడాలని అంటున్నారు అదే సమయంలో ఎన్డీయే మిత్రులతో కలిపి ప్రస్తుతం 292 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు ఈ సంఖ్య ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే ఏకంగా 324కి ఎగబాకుతుంది అని అంటున్నారు. అంటే ఇందులో బీజేపీకి పెరిగిన ఇరవై సీట్లు పోనూ మిత్రులు మరో పది సీట్లు ఎక్కువ సాధిస్తారు అని లెక్క తేల్చింది అన్న మాట. చూడాలి మరి ముందు ముందు మోడీ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో.
