ఆర్ఎస్ఎస్ కి అగ్ని పరీక్ష...మోడీ కాదంటే ?
ఈ రోజు మోడీకి సరిసాటి నాయకుడు దేశంలోనూ ఇతర పార్టీలలో సైతం కనిపించడం లేదు అన్నది ఒక విశ్లేషణ.
By: Satya P | 9 Aug 2025 8:15 AM ISTనరేంద్ర మోడీ ఈ రోజున ప్రపంచంలో అగ్ర నేతలా కొనసాగుతున్నారు. నిజానికి ఆయన సమర్థతతో పాటు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న వాతావరణం కూడా ఆయన ప్రాధాన్యతను పెంచేస్తోంది. అగ్ర దేశాల మధ్య మోడీ అత్యంత కీలకంగా మారుతున్నారు. ఏకధృవ ప్రపంచం గా ఉందని ఇంకా భావిస్తూ వస్తున్న అమెరికాకు చుక్కలు చూపించే పనిలో మోడీ ఉన్నారు అంటే భారతీయ నాయకుడిగా ఆయన ఎంత ఎత్తున ఉన్నారు అన్నది ఆలోచించాల్సిందే.
బీజేపీతో మోడీ :
మోడీ ఒక సాధారణ నాయకుడిగా బీజేపీలో ఉంటూ ఈ రోజు శిఖరాయమానం అయ్యారు. బీజేపీకి రెండు సార్లు పూర్తి మెజారిటీ రుచిని జాతీయ స్థాయిలో చూపించారు. అంతే కాదు వరుసగా మూడు సార్లు అధికారంలోకి తెచ్చారు. తన ఇమేజ్ తో బీజేపీకి దేశంలో ఎన్నో విజయాలు సమకూర్చారు. .దాదాపుగా 20 దాకా రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలో ఉన్నాయి. అదే సమయంలో మిగిలిన రాష్ట్రాలలో మిత్రులతో కలిసి అధికారం పంచుకుంటోంది. ఇలా దేశంలో అత్యంత పటిష్టమైన స్థితిలో కాషాయం పార్టీని ఉంచిన ఘనత అయితే అక్షరాల మోడీదే.
పార్టీని మించేసిన వైనం :
అయితే నరేంద్ర మోడీ తన ఇమేజ్ తో పార్టీని మించేశారు. బీజేపీలో ఆయన స్థాయికి తూగ గల నాయకుడిని తయారు చేయలేకపోయారు. అంతే కాదు తన వారసులను కూడా ఆయన సిద్ధం చేయలేకపోయారు. అదే వాజ్ పేయి సమయంలో ఆయన వెనక ఎంతో మంది కీలక నేతలు ఉండేవారు వాజ్ పేయ్ వారసుడు అంటే ఎల్కే అద్వానీని చెప్పుకునే పరిస్థితి ఉండేది. అలాగే మురళీ మనోహర్ జోషీ వంటి వారు ఉండేవారు. మోడీ విషయంలో మాత్రం అలా లేదు అనే అంటారు.
అతి పెద్ద సమస్యగా :
ఈ రోజున ఆర్ఎస్ఎస్ మోడీని గద్దె దిగమంటోంది. ఆయన వయసు ఏడున్నర పందులు దాటుతున్నాయి కాబట్టి హుందాగా తప్పుకోవాలని చెబుతోంది. సరే అని మోడీ కనుక గద్దె దిగితే ఇప్పటికిపుడు ఆయన ప్లేస్ లో ఆయన సాటి గల నాయకులు అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. మోడీ వారసులుగా వినిపిస్తున్న పేర్లు చూస్తే వారు ఎవరికి వారుగా సమర్ధులే అయినా మోడీ ఇమేజ్ తో పోలిస్తే మాత్రం వెనకబడే ఉన్నారని విశ్లేషణలు ఉన్నాయి.
బీజేపీకి ఇబ్బందిగానే :
ఏ కారణంగా అయినా నరేంద్ర మోడీ ప్రధాని పదవి నుంచి దిగిపోతే మాత్రం బీజేపీకి అసలు సిసలైన నాయకత్వ సమస్య ఎదురవుతుందని అంటున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారని కాదు కానీ బీజేపీకి 150 ఎంపీ సీట్లు అయినా వస్తాయా అంటే పెద్ద డౌటే అంటారు. బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా నాయకత్వ సమస్య ఉంది అని అంటున్నారు. వన్ టూ టెన్ మోడీగానే బీజేపీలో ఉండడం వల్లనే ఈ సమస్య అని చెబుతున్నారు మోడీ దేశంలోనే కాదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా పార్టీని పక్కన పెట్టి తానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నంతగా ప్రచారం చేస్తూ వస్తారు. దాంతో పార్టీ వెనక్కి పోయి మోడీ ముందుకు వచ్చేశారు. మోడీని చూసి ఓటేసే పరిస్థితిని బీజేపీకి తెచ్చారు. ఒక విధంగా చెప్పాలీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి పూజా తెలియకుండానే బీజేపీలో కూడా వచ్చేసింది అని అంటున్నారు.
దేశంలోనూ ఇదే సీన్ :
ఈ రోజు మోడీకి సరిసాటి నాయకుడు దేశంలోనూ ఇతర పార్టీలలో సైతం కనిపించడం లేదు అన్నది ఒక విశ్లేషణ. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిగా ఉన్నా మోడీకి ఆయన సమ ఉజ్జీ కాదనే అంటారు. ఇక ఇండియా కూటమిలో ప్రధాని పదవి మీద ఆశ పడుతున్న వారు ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న నేతలు అయితే కావచ్చేమో కానీ మోడీని జాతీయ స్థాయిలో సవాల్ చేసే స్థితి అయితే లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఒకే దేశం ఒకే పార్టీ ఒకే మోడీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. మోడీ రాజకీయంగా తన విశ్వరూపం చూపిస్తూ బీజేపీకి విజయాలు అందిస్తున్నారు కానీ అదే సమయంలో ఆయన కాషాయం పార్టీకి నాయకత్వ లోపం కూడా వెంట తెస్తున్నారు అని అంటున్నారు. అలాగే తన వ్యూహాలతో ఎత్తులతో దేశంలో విపక్షాన్ని కట్టడి చేయడంతో దేశంలో సైతం నాయకత్వ లోపం ఏర్పడిందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
