Begin typing your search above and press return to search.

బీజేపీ సునామీకి తిరుగులేదు: మోడీ

దేశంలో బీజేపీ సృష్టిస్తున్న సునామీకి తిరుగులేద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నొక్కి చెప్పారు. గ‌త నెల‌లో జ‌రిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన‌ ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన‌ ఫలితాలపై చర్చ జ‌రుగుతోంద‌ని తెలిపారు.

By:  Garuda Media   |   10 May 2026 10:00 PM IST
బీజేపీ సునామీకి తిరుగులేదు: మోడీ
X

దేశంలో బీజేపీ సృష్టిస్తున్న సునామీకి తిరుగులేద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నొక్కి చెప్పారు. గ‌త నెల‌లో జ‌రిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన‌ ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన‌ ఫలితాలపై చర్చ జ‌రుగుతోంద‌ని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వరుసగా రెండోసారి, అస్సాంలో వరుసగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం ప్ర‌జ‌లు ఇచ్చిన ఘ‌న‌మైన తీర్పుగా అభివ‌ర్ణించారు.

అదేవిధంగా ప‌శ్చిమ‌ బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ భారీ మెజారిటీని అందుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌న్నారు. అంతేకాకుండా, కేవలం రెండు వారాల క్రితం గుజరాత్‌లో జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం గత రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింద‌ని తెలిపారు. ఇక‌, దేశంలో బీజేపీ సునామీ సృష్టించింద‌న‌డానికి ఇవ‌న్నీ ఉదాహ‌ర‌ణ‌ల‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇవన్నీ కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయ‌ని మోడీ ఉద్ఘాటించారు.

మే 10వ తేదీకి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. బెంగ‌ళూరులో నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో ప్ర‌ధాని మాట్లాడుతూ.. 1857లో సరిగ్గా ఇదే రోజు భారత స్వాతంత్ర‌ పోరాటపు తొలి నిప్పురవ్వ ప్రజ్వరిల్లిందన్నారు. కాలక్రమేణా ఆ నిప్పురవ్వ బానిసత్వపు సంకెళ్లను తెంచిన ఒక మహా జ్వాలగా మారిందని తెలిపారు. నాటి ధైర్యసాహసాల వారసత్వమే మనకున్న గొప్ప శక్తి వనరులలో ఒకటి అని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో... ఆత్మనిర్భర్ భారత్, వికసిత్‌ భారత్ కోసం యావ‌త్ జాతి వ‌డివ‌డిగా ముందుకు అడుగులు వేస్తున్నాయ‌ని తెలిపారు.

నాటి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి నూతన శక్తిని నింపుతోంద‌ని ఉద్ఘాటించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బెంగ‌ళూరులో ప‌ర్య‌టించారు. ప్ర‌ముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్స‌వంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. తొలుత రాష్ట్ర బీజేపీ నాయ‌కులు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. గ‌త నెలలో జ‌రిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించిన విజ‌యాన్ని కొనియాడుతూ.. రాష్ట్ర బీజేపీ నేత‌లు ప్ర‌ధానిని ఘ‌నంగా స‌త్క‌రించారు. సంప్ర‌దాయ త‌ల‌పాగా ధ‌రింప‌జేసి.. శాలువా క‌ప్పి.. ప్ర‌ధానిని స‌త్క‌రించారు.