Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్ అద్వానీ డౌట్...మోడీకే సీటు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 సెప్టెంబర్ 17తో 75 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు.

By:  Satya P   |   17 Sept 2025 9:12 AM IST
వాజ్ పేయ్ అద్వానీ డౌట్...మోడీకే సీటు
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 సెప్టెంబర్ 17తో 75 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన జీవితంలో ఇది వజ్రోత్సవ సంవత్సరంగా చెప్పాలి. నరేంద్ర దామోదర్ దాస్ నుంచి దేశమంతా ప్రపంచమంతా మోడీగా పిలుచుకునే ఆయన జీవితంలో ఎన్నో పేజీలు ఎవరికీ తెలియవు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మోడీ రాజకీయ జీవితం కూడా ఎన్నో మలుపులు తిరుగుతూ సాగింది. ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరిన నాటి నుంచి ప్రధానిగా మూడు సార్లు గెలిచి ఈ రోజున దేశంలో కీలక పదవిలో కొనసాగుతున్నంతవరకూ ఒక సుదీర్ఘమైన ప్రస్తానంగానే చూడాలి.

సందేహించిన వారినే :

గుజరాత్ లో చిమన్ భాయ్ పటేల్ వంటి దిగ్గజ నేతకు వారసుడిని ఎంపిక చేయాల్సి వచ్చినపుడు మోడీ పేరుని స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే ఆయనకు రాజకీయ గురువుగా ఉన్న అద్వానీ కానీ ఆనాడు ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ కానీ మోడీకి ముఖ్యమంత్రిగా పగ్గాలు ఇచ్చే విషయంలో సందేహించారు అని చెబుతారు. బీజేపీకి ఎంతో ముఖ్యమైన రాష్ట్రం. అప్పటికి కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. ఉద్ధండులే తట్టుకోలేని రాజకీయం. ప్రభుత్వాన్ని నడపడం బహు కష్టం. అసలు చట్ట సభనే చూడని మోడీ చేతిలో పగ్గాలు అంటే వారు ఎంతో ఆలోచించారు. అయితే మోడీ వారి సందేహాలను సవాల్ గానే తీసుకున్నారు. తానేంటో నిరూపించుకుంటాను అని చెప్పి మరీ గద్దెనెక్కారు. కేవలం ఏడాది సీఎం గా ఉండగానే 2002లో వచ్చిన ఎన్నికలను ఎదుర్కొని బీజేపీని గెలిపించి మరీ బీజేపీ పెద్దల మన్ననలు అందుకున్నారు.

ఎనిమిదేళ్ళకే :

మోడీ కేవలం ఎనిమిదేళ్ళ వయసులో ఉండగానే ఆర్ఎస్ఎస్ పట్ల ప్రభావితం అయ్యారు. అలా ఆయన తన సొంత ప్రాంతం అయిన వాదు‌నగర్ లో ఒక సాధారణ సంఘ్ కార్యకర్తగా మొదలెట్టారు. ఆ తరువాత ఆ ప్రయాణం కాస్తా సుదీర్ఘంగా సాగింది. ఎంతదాకా అంటే 1985లో ఆయన బీజేపీలో చేరేంతవరకూ. అంటే ఆర్ఎస్ఎస్ తో మోడీ బంధం డైరెక్ట్ గా 28 ఏళ్ళు అన్న మాట.

అద్వానీ చలువతోనే :

ఇక బీజేపీ అధ్యక్షుడుగా లాల్ క్రిష్ణ అద్వానీ 1986లో నియమితులు అయ్యాక ఆర్ఎస్ఎస్ నుంచి చురుకైన నాయకులను తీసుకోవాలని ఆలోచించారు అలా ఆయన కంటబడిన వారు మోడీ. పైగా ఆయన సొంత రాష్ట్రానికి చెందిన వారే కావడంతో ప్రోత్సహించారు. ఇక 1990లో అద్వానీ రధ యాత్రకు మోడీ వెనక ఉండి చేసిన సారధ్యం అంతా ఇంతా కాదు. దాని ఫలితంగా ఆయనకు బీజేపీలో పదవులు వెన్నంటే వచ్చాయి. గుజరాత్ బీజేపీలో కీలకంగా మారారు. 1995లో బీజేపీ గుజరాత్ లో గెలవడం వెనక మోడీ ఉన్నారు. ఆ తరువాత 1997లో గుజరాత్ లో బీజేపీ చీలిపోయిన సందర్భంలో మోడీ మళ్ళీ పార్టీని బలోపేతం చేయడంతో 1998లో పార్టీ మళ్ళీ గెలిచింది. చిమన్ భాయ్ పటేల్ సీఎం అయ్యారు అయితే 2001లో ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో అద్వానీ దృష్టిలో మళ్ళీ మోడీ పడ్డారు. అలా ఏ సభలోనూ సభ్యుడు కానీ మోడీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ కి తొలిసారి సీఎం అయ్యారు. 2002లో ఆయన సీఎం గా ఉంటూనే బీజేపీని తన హయాంలో గెలిపించారు అలా 2014 దాకా ఆయన 13 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సార్లు పార్టీని నెగ్గించారు.

జాతీయ రాజకీయాల్లోకి :

అదే విధంగా చూస్తే 2013 సెప్టెంబర్ 13న మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా జాతీయ కార్యవర్గం మద్దతుతో ముందుకు వచ్చారు. అలా ఆయన తన 63వ పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందు అత్యంత కీలకమయ్యారు. ఆ ఎంపిక ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతో మార్చేసింది. ఆయన 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీని దక్కించారు. అలా తొలిసారి ప్రధాని అయ్యారు. అది లగాయితూ 2024లో మూడవసారి గెలిచి కాంగ్రెసేతర ప్రధానులలో అత్యధిక కాలం పాలించిన నేతగా గుర్తింపు పొందారు. ఇక్కడ చిత్రమేంటి అంటే మోడీ ముఖ్యమంత్రిగానూ ప్రధానిగానూ అనూహ్యంగానే అందలాలు అందుకున్నారు అనే చెప్పాలి.