ఆర్ఎస్ఎస్ అంగీకరించాల్సిందేనా...మోడీ పొగడ్తల వెనక ?
ఈ దేశంలో తొలి తరం నేతలలో నెహ్రూ శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయి బలమైన నేతలను దేశం చూడలేదు మళ్ళీ నరేంద్ర మోడీ రూపంలోనే అది జరిగింది.
By: Satya P | 16 Aug 2025 11:35 PM ISTనరేంద్ర మోడీ అత్యంత బలమైన నాయకుడుగా బీజేపీ నేతలు చెబుతారు. ఆ మాట కూడా ఒక విధంగా కరెక్టే. ఈ దేశంలో తొలి తరం నేతలలో నెహ్రూ శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయి బలమైన నేతలను దేశం చూడలేదు మళ్ళీ నరేంద్ర మోడీ రూపంలోనే అది జరిగింది. ఆయన తానే పార్టీ తానే ప్రభుత్వం అన్నట్లుగా నడిపిస్తూ వస్తున్నారు. మోడీ ఒక విధంగా పార్టీ కంటే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతే కాదు ఆయన ప్రతిష్ట కూడా 2014 నాటి నుంచి అలా పెరుగుతూ వస్తోంది. అయితే అది ఆయనకు చాలా సార్లు ప్లస్ అయింది. కానీ ఆర్ ఎస్ ఎస్ మాత్రం దానినే మైనస్ గా చూస్తోంది.
సంస్థ కంటే ఎక్కువ కాదు :
సంఘ్ విధానం ప్రకారం సంస్థ కంటే వ్యక్తులు ఎవరూ ఎక్కువ కాదు. సంస్థ ఎప్పటికీ శాశ్వతం. సంస్థ పటిష్టంగా ఉంటే ఎంతో మంది నాయకులు వస్తారు అన్నదే ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ. సరిగ్గా ఆ విషయంలోనే మోడీ సంఘ్ కి గ్యాప్ వచ్చింది అని అంటారు. అయితే 2024 వరకూ మోడీకి సంఘ్ విషయంలో ఏమీ పేచీ పూచీలు ఉన్నా ఇబ్బందులు అయితే లేవు అని అంటున్నారు. ఆయన అనుకున్నదే చేసుకుని వెళ్ళగలిగారు అని చెబుతారు. అయితే 2024లో మెజారిటీ బీజేపీకి సొంతంగా రాలేదు. అదే సమయంలో మోడీ మిత్రులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక 2025 సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి. దీంతో మోడీ మీద సంఘ్ నుంచి ఒత్తిళ్ళు పెరుగుతున్నాయని అంటున్నారు.
బీజేపీకి కీలకంగా :
బీజేపీ అన్నది ఆర్ఎస్ఎస్ కి ఒక అనుబంధ విభాగం అని అంటారు. రాజకీయ అంగం అని కూడా వర్ణిస్తారు. నాయకత్వాన్ని సంఘ్ తయారు చేసి ఎంతో మందిని బీజేపీలోకి పంపించింది. అలా మోడీ కూడా సంఘ్ నుంచి వచ్చిన వారే. అయితే ఇపుడు మాత్రం సంఘ్ ఆయనను వయసు గుర్తు చేస్తూ దిగిపోమని కోరుతోంది అని ప్రచారం సాగుతోంది. నిజానికి 75 ఏళ్ళకు దిగిపోవాలి అన్న రూల్ అయితే బీజేపీలో లేదు. అలాగే ఆర్ఎస్ఎస్ లో కూడా లేదు. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన కొత్తలో బీజేపీలో దీనిని తీసుకుని వచ్చారు. అలా వరిష్ట నేతలు అయిన ఎల్కే అద్వానీ. మురళీ మనోహర్ జోషీ వంటి వారు తెర వెనక్కి వెళ్ళిపోయారు. ఇపుడు అదే సూతం మోడీకి ఎందుకు వర్తింపచేయరాదు అన్నదే ఆర్ఎస్ఎస్ పంతంగా ఉంది. ముందు నుంచి మోడీతో ఉన్న గ్యాప్ నేపథ్యంలో ఇపుడు సరైన సమయంలో ఈ ఏజ్ కండిషన్ ని ముందు పెట్టి సంఘ్ పట్టుబడుతోంది అని అంటున్నారు.
అద్వానీ పదవీ త్యాగం :
బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఏ విధంగా పనిచేస్తుందో ఒక ఉదాహరణ గత పదహారేళ్ల కాలంలోనే జరిగింది చెప్పుకోవాలి. బీజేపీలో అతి పెద్ద నేతగా ఉన్న లాల్ కృష్ణ అద్వానీ పాక్ జాతిపిత అయిన జిన్నాను లౌకిక వాదిగా కీర్తించారు అన్న కారణంతో ఆయనను జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సంఘ్ ఒత్తిడి చేసింది అని అంటారు. ఫలితంగా ఆయన తన పదవిని వదిలేశారు. లేకపోతే 2014 ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్ధిగా ఉండేవారు అన్నది వెనకటి చరిత్ర చెబుతోంది. అలాగే వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నపుడు కూడా సంఘ్ కొన్ని విషయాల్లో తమ మాట నెగ్గించుకుంది అని అంటారు.
ఆర్ఎస్ఎస్ ప్రసక్తి అందుకేనా :
దేశ స్వాతంత్ర్య ఉత్సవాల వేళ ఆర్ఎస్ఎస్ ప్రస్తావనను మోడీ తీసుకుని రావడం వెనక వ్యూహం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంఘ్ ని ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ ఉందని అంటున్నారు కాంగ్రెస్ కీలక నేత జై రాం రమేష్ తో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఆర్ ఎస్ ఎస్ ని పొగడడం అందుకోసమే అంటున్నారు. ఆర్ఎస్ఎస్ ని ప్రసన్నం చేసుకుని తమ పదవిని మోడీ కాపాడుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు. అయితే అదేమీ కాదు మోడీ ఫక్తు సంఘ్ కార్యకర్త అని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు.
మోడీ ఫుల్ టెర్మ్ గా :
ఇక చూస్తే మోడీ 2029 దాకా ఫుల్ టెర్మ్ ప్రధాని గా కొనసాగుతారు అని అంటున్నారు. గతానికి ఇప్పటికీ పరిస్థితులు మారాయని బీజేపీలోనే కాదు దేశంలోనూ అంతర్జాతీయంగా మోడీ బలమైన నేతగా ఉన్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. మోడీ ఫోబియాతో విపక్షాలు ఉన్నాయని ఆయన ఎదురుగా ఉంటే గెలవలేమన్న బెంగా భయం వారికి ఉందని అందుకే ఆర్ఎస్ఎస్ కి మోడీకి గ్యాప్ అని కధనాలు అల్లుతున్నారని మండిపడుతోంది. మొత్తం మీద వాస్తవంగా చూసినా బీజేపీకి ఈ రోజుకీ బలమైన నేత మోడీయే. ఆయనను కాదని పార్టీ ముందుకు వెళ్ళదు, అందువల్ల ఆర్ ఎస్ ఎస్ సూచనలు చేసినా మోడీ దేశ ప్రధానిగా వయసుతో సంబంధం లేకుండా కొనసాగుతారు అని అంటున్నారు.
