Begin typing your search above and press return to search.

మోడీకి పాతికేళ్ళు...కమలం పరవళ్ళు

ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన గుజరాత్ రాష్ట్ర బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు.

By:  Satya P   |   31 Aug 2026 9:26 AM IST
మోడీకి పాతికేళ్ళు...కమలం పరవళ్ళు
X

నరేంద్ర మోడీకి వయసు ఏడున్నర పదులు కదా. ఆయనకు పాతికేళ్ళు ఏమిటి అని ఆశ్చర్యపోనవసరం లేదు. మోడీ అధికార పీఠం ఎక్కిన తరువాత నుంచి ఈ రోజు దాకా చూస్తే ఆయన వయసు పాతికేళ్ళు అన్న మాట. అందులో ముఖ్యమంత్రిగా పదమూడేళ్ళ కాలం ఉంటే ప్రధానిగా పన్నెండేళ్ల కాలం ఉంది. దాంతో ఇపుడు బీజేపీ ఈ అంశం మీద జనంలోకి వెళ్తోంది. ప్రధాని మోదీ రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా దేశ వ్యాప్తంగా సేవ సంకల్ప ఉత్సవ్ పేరుతో సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. అందులో భాగంగా ఏపీలో కూడా ప్రతీ చోటా కార్యక్రమాలు నిర్వహిస్తామని అంటున్నారు.

ఆనాడు అలా :

ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన గుజరాత్ రాష్ట్ర బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. బీజేపీ ప్రభుత్వాలు అక్కడ 1996 నుంచి ఏర్పడుతూ వచ్చాయి. మొదట కేశూ భాయ్ పటేల్ ప్రభుత్వం ఏర్పడింది. మధ్యలో అది కూలి కాంగ్రెస్ మద్దతుతో వేరే ప్రభుత్వం వచ్చింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇలా కొంత అస్థిరత్వంతోనే పాలన సాగుతున్న దశలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఏడాది కాలం ఉన్న తరుణంలో బీజేపీ జాతీయ నాయకత్వం వారూ వీరూ ఎందుకు గుజరాత్ రాష్ట్రంలో పార్టీ కీలక నేత నరేంద్ర మోడీ ఉన్నారు కదా అని ఆయనకే పగ్గాలు అప్ప్పగించింది.

తెర వెనక నుంచి :

అప్పటిదాకా తెర వెనక ఉండి ప్రభుత్వాన్ని కాసుకుని వచ్చిన మోడీ ఒక్కసారిగా గుజరాత్ లాంటి సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పటికి ఆయన చట్ట సభలో సభ్యుడు కాదు. అలా నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2002 ఫిబ్రవరిలో రాజ్‌కోట్-2 నియోజకవర్గం ఉపఎన్నికలో గెలిచి తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టారు. 2002 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా చూస్తే మోడీ పాతికేళ్ళ అధికార రాజకీయం పూర్తి అయినట్లు అవుతుంది.

ప్రధానిగా సైతం :

ఇక మోడీ ప్రధానిగా సైతం అనూహ్యంగానే అయిపోయారు. దాని కంటే ముందు 2013లో ఆయన ప్రధాని అభ్యర్ధిగా అయ్యారు. మోదీ దేశ ప్రధాని కావడం వెనుక 2013లో జరిగిన పరిణామాలు చాలా కీలకమైనవి. బిజెపిలో అప్పట్లో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ రాజకీయాలు వాసనే తెలియని ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఒక సంచలన నిర్ణయం.2013 జూన్‌లో గోవాలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీని లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఈ నిర్ణయంతో అప్పట్లో పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి తన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే బుజ్జగింపుల తరువాత వెనక్కి తీసుకున్నారు.

అధికారిక ప్రకటన:

ఇక అదే ఏడాది సెప్టెంబర్ 13 బిజెపి పార్లమెంటరీ బోర్డు మోదీని అధికారికంగా 2014 లోక్‌సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన అభివృద్ధి గుజరాత్ మోడల్ ప్రచారం ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. 2014 మే నెలలో జరిగిన ఎన్నికలలో బిజెపి సొంతంగా 282 సీట్ల స్పష్టమైన మెజారిటీ సాధించి 2014 మే 26 న మోదీ మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా చూస్తే మోడీ ప్రధానిగా పన్నెండేళ్ళు పూర్తి చేశారు అన్న మాట. ఇపుడు మోడీ విజయాలు రికార్డులతో బీజేపీ మరోసారి జనంలోకి వెళ్లబోతోంది.

క్రేజ్ తగ్గుతోందా :

ఇదిలా ఉంటే ఇపుడే దేశవ్యాప్తంగా ఈ ప్రచారం ఎందుకు అంటే ఉత్తరాదిన వివిధ అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ఉన్నాయి. అదే సమయంలో దేశంలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతోంది. విపక్షం పుంజుకుంటోంది. మోడీ ఇమేజ్ కి సైతం ఇబ్బంది కలిగించే సంఘటనలు విద్యార్ధి ఉద్యమాలు రూపంలో జరిగి ఏకంగా కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో మరోసారి మోడీకి పాతికేళ్ళు అంటూ బీజేపీ ఆయన క్రేజ్ ని పెంచాలని చూస్తోంది అని అంటున్నారు. అయితే ఇవెంత వరకూ వర్కౌట్ అవుతాయో తెలియదు కానీ విపక్షం అయితే మోడీని బీజేపీని అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లోనూ ఓడిస్తామని అంటోంది.