పాతికేళ్ళ మోడీ...ఎవర్ గ్రీన్
ఇక మోడీ దేశానికే ప్రధాని అయ్యారు. ఆయన 2014 మే 16 నుంచి ఈ రోజు దాకా మొత్తం మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసి కొనసాగుతున్నారు.
By: Satya P | 7 Oct 2025 11:07 PM ISTఅదేంటి నరేంద్ర మోడీకి పాతికేళ్ళ అని ఆశ్చర్యపోనవసరం లేదు. మోడీ వయసు అచ్చంగా మూడు పాతికలే. అంటే డెబ్బై అయిదేళ్ళు. ఆయన ఈ మధ్యనే తన 75 ఏళ్ళ పుట్టిన రోజు వేడుకను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మరి ఈ పాతికేళ్ళు దేనికి సంకేతం అంటే అక్కడే ఉంది అసలు విషయం. మోడీ ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి కీలకమైన ముఖ్యమంత్రి ప్రధాని వంటి పదవులు అలుపు ఎరగకుండా అవిశ్రాంతంగా నిర్వహిస్తూ పాతిక ఏళ్ళ మైలు రాయి వద్ద నిలిచారు. అందుకే మోడీ ఎవర్ గ్రీన్ అని చెప్పాల్సి వస్తోంది.
ఎమ్మెల్యే కూడా కాకుండానే :
ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ సరిగ్గా పాతికేళ్ళ క్రితం అంటే 2001 అక్టోబర్ 7న గుజరాత్ కి ముఖ్యమంత్రి అయ్యారు. అది అనూహ్యంగా జరిగిన పరిణామం. ఆనాటికి మోడీ ఎమ్మెల్యే కూడా కారు. అంతే కాదు ఆయన అంతకు ముందు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. చట్ట సభలకు వెళ్ళలేదు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా అంతకంటే లేదు. కానీ ఏకంగా గుజరాత్ లాంటి స్టేట్ కి సీఎం అయిపోయారు. అలా నెగ్గిన తరువాత రాజ్ కోట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అలా ఎవరికీ లేని విధంగా మొదలైన మోడీ రాజకీయ జీవితం పాతికేళ్ళలో ఎన్నో మలుపులు తిరిగింది అని చెప్పాల్సిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ 2014 మే 16 వరకూ కొనసాగారు.
దేశ ప్రధానిగా :
ఇక మోడీ దేశానికే ప్రధాని అయ్యారు. ఆయన 2014 మే 16 నుంచి ఈ రోజు దాకా మొత్తం మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసి కొనసాగుతున్నారు. మూడు టెర్ములుగా ఆయన ప్రధానిగా ఉంటూ వచ్చినా ఎక్కడా దూకుడు అయితే తగ్గలేదు. అంతే కాదు ఆయన 2029 దాకా ఈ పదవిలో కొనసాగబోతున్నారు. ఇలా పాతికేళ్ళ తన ఉన్నత స్థాయి పదవుల జీవితంలో మోడీ ఎక్కడా అలసిపోలేదని చెబుతారు. ఆయన ఏ ఒక్క రోజూ సెలవు కూడా పెట్టలేదు. 2022లో తన తల్లి మరణించినపుడు కూడా ఆయన విధులలో పాల్గొనడం బట్టి చూస్తే మోడీ పనితీరు అర్థం అవుతుంది అంటారు.
థాంక్స్ టూ నేషన్ :
తన పాతికేళ్ళ ప్రస్థానం మీద మోడీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఆయన దేశ ప్రజలకే ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యుడిని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఈ రోజు వరకూ తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఆయన జనాలతో పంచుకున్నారు.
డెబ్బై అయిదులో ఇరవై అయిదు :
మొత్తం మీద చూస్తే నరేంద్ర మోడీ రాజకీయ జీవితం చిత్రంగా తోస్తుంది. డెబ్బై అయిదు లో ఇరవై అయిదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రధానిగా కొనసాగుతూ నాటౌట్ అంటూ దూకుడు చేయడం ఏ ఇతర రాజకీయ నాయకునికీ సాధ్యపడదు అనే చెప్పాల్సి ఉంది. అంతే కాదు మోడీ యాభై ఏళ్ళకు ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే సగం జీవితం అయ్యాక ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించినా అన్నీ సక్సెస్ లే అన్నీ సిక్సర్లే అంటే మోడీ పొలిటికల్ లైఫ్ కానీ ఆ గ్రాఫ్ కానీ ఎవరికీ రావు అంటే అది అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. దటీజ్ మోడీ అనాలనిపిస్తుంది.
