12 ఏళ్లలో 100 మిలియన్ ఫాలోవర్లు.. మోడీ మరో రికార్డు
2014లో మోడీ ఇన్ స్టా ప్రయాణం మొదలైంది. కట్ చేస్తే.. దగ్గరదగ్గర పన్నెండేళ్ల కాలంలో ఆయన ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 మిలియన్లకు చేరుకోవటం విశేషంగా చెప్పాలి.
By: Garuda Media | 26 Feb 2026 2:54 PM ISTనరేంద్రమోడీనా మజాకానా? అన్నట్లు.. భారతప్రధానిగా వ్యవహరిస్తున్న ఆయన సోషల్ మీడియాలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోని రాజకీయ అధినేతలు ఎంతో మంది ఉన్నప్పటికి.. మరెవరికి సాధ్యం కాని పాపులార్టీని ఆయన సొంతం చేసుకున్నారు. వంద మిలియన్ ఇన్ స్టా ఫాలో వర్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. 2014లో మోడీ ఇన్ స్టా ప్రయాణం మొదలైంది. కట్ చేస్తే.. దగ్గరదగ్గర పన్నెండేళ్ల కాలంలో ఆయన ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 మిలియన్లకు చేరుకోవటం విశేషంగా చెప్పాలి.
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 ఇన్ స్టా ఫాలోవర్లు కలిగి ఉన్న ప్రముఖుల్ని చూస్తే.. వారిలో ఒక్కరు కూడా రాజకీయ నేతలు కనిపించరు. ఆ మాటకు వస్తే రాజకీయ నేతల్లో టాప్ 1 స్థానంలో ఉన్న మోడీ తర్వాత రెండో స్థానంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. అయితే.. ఫాలోవర్ల రీత్యా చూస్తే.. ఈ ఇద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం భారీగా కనిపిస్తుంది. ప్రధాని మోడీ వంద మిలియన్లతో నెంబర్ వన్ గా ఉంటే.. ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 15 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలుస్తారు.
నాలుగో స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డాసిల్వా 14.4 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఐదో స్థానంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 11.6 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్నారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన బరాక్ ఒబామా 36.2 మిలియన్ ఫాలోవర్లతో ఉన్నారు. మాజీ నేతల్ని తీసుకుంటే..ట్రంప్ తర్వాతి స్థానంలో నిలుస్తారు. ఇక్కడ మరో కీలక అంశాన్ని ప్రస్తావించాలి. టాప్ 5లో మోడీ తర్వాత ఉన్న నలుగురు నేతల మొత్తం ఫాలోవర్లను కలిపినా మోడీ ఫాలోవర్ల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
దేశీయంగా చూస్తే.. మోడీ తర్వాత ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలుస్తారు. ఆయనకు 16.1 మిలియన్ ఫాలో వర్లు ఉండగా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 12.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 2014లో ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన మోడీ.. తన తొలి పోస్టును అహ్మదాబాద్ లో నవంబరు 12న చేశారు. 2018 నాటికి 15 మిలియన్ల ఫాలోవర్ల మార్కును టచ్ చేస్తే.. 60 మిలియన్ల ఫాలోవర్లను 2021 నాటికి చేరుకున్నారు. 2023 నాటికి 80మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆయన 2026 మార్చి 26 నాటికి ఆయన వంద మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇన్ స్టాలో తన పన్నెండేళ్ల ప్రయాణంలో మోడీకి అత్యధికంగా ఫాలోవర్లు చేరింది మాత్రం 2024లో భారీగా పెరిగారు. ఎన్నికల సమయం కావటంతో కొద్ది నెలల వ్యవధిలోనే ఆయన దాదాపు10-15 మిలియన్ల కొత్త ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇన్ స్టాలో మోడీకి ఉన్న ఫాలోవర్లలో 94.75 శాతం మంది భారత్ నుంచే కాగా.. మిగిలిన వాటిల్లో పలు దేశాల నుంచి కూడా ఆయన్ను ఫాలో అవుతున్నారు.
భారత్ తర్వాత టాప్ 4 ఫాలోవర్లు ఉన్న దేశాల జాబితాను చూస్తే.. భారత్ తర్వాత అమెరికా నిలుస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండోనేషియాలో ఆయనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ నిలుస్తుంది. మోడీని ఫాలో అయ్యే ఫాలోవర్లలో 83 శాతం మంది 18-34 ఏళ్ల వయసు వారే ఉండటం విశేషం. యూత్ ను ఆయన అంతగా కనెక్టు అయ్యారని చెప్పొచ్చు.
