విజయవాడకు చేరిన 'మత్తు'.. ఏం జరిగింది?
మత్తు పదార్థాల వినియోగం.. రవాణాపై నిషేధం విధించిన ప్రభుత్వం.. వాటి వినియోగంతో వచ్చే అనర్థాలపై ప్రచారం కూడా చేస్తోంది.
By: Garuda Media | 15 Oct 2025 5:56 PM ISTఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు మాత్రమే పరిమితమైన మత్తు పదార్థాలు.. మత్తు వినియోగం ఇప్పుడు విజయవాడకు కూడా చేరిపోయింది. అది కూడా.. జిమ్ కేంద్రాల్లోనే ఈ వ్యవహారం వెలుగు చూడడం సంచలనంగా మారింది. విజయవాడ బెంజిసర్కిల్‌లోని ఓ జిమ్‌లో తాజాగా బుధవారం ఉదయం పోలీసులు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం నగరంలో సంచలనం సృష్టించింది.
వాస్తవానికి విజయవాడలో గంజాయి వినియోగం ఎక్కవని పోలీసులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఎక్క డికక్కడ నిఘా పెట్టారు. సహజంగా రిక్షాపుల్లర్లు.. చెత్త ఏరుకునే కార్మికులు గంజాకు అలవాటు పడ్డారని గుర్తించిన పోలీసులు.. వారిని ఆ వ్యసనం నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇంతలో నే విజయవాడలో మత్తు పదార్థాలు లభించడం కలకలం రేపింది. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది.
సదరు జిమ్‌ను మూసివేయడంతోపాటు.. ట్రైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాల వినియోగం.. రవాణాపై నిషేధం విధించిన ప్రభుత్వం.. వాటి వినియోగంతో వచ్చే అనర్థాలపై ప్రచారం కూడా చేస్తోంది. ఈగల్ టీంలను ఏర్పాటు చేసి... ఎక్కడికక్కడ నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుం టోంది. కాలేజీలలో కూడా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతున్నా.. తాజాగా జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
ఎక్కడ పట్టుకున్నారు?
పటమట పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా స్టెరాయిడ్స్ తోపాటు.. ఇతర మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిమ్ ట్రైనర్ వద్ద స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకుని తనిఖీలు నిర్వహించగా.. ఇతర మత్తు పదార్థాలు కూడా లభించాయి. దీనిని బట్టి బెజవాడలో జోరుగా స్టెరాయిడ్స్ వ్యాపారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు.
