మూడు దఫాలుగా అక్కడ సెంటిమెంట్ పాలిటిక్స్.. నెక్ట్స్ ఏంటి..?
2014లో బగ్గు రమణమూర్తి టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఈయనకు మంచి పేరు.. ప్రజల్లో మంచి హవా కూడా ఉంది.
By: Garuda Media | 1 Dec 2025 11:00 PM ISTరాజకీయాలకు సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. అడుగు తీసి అడుగు వేయాలంటే నాయకులు సెంటిమెం టుకు ప్రాధాన్యం ఇస్తారు. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా కూడా నాయకులు ముహూర్తాలు చూసుకుంటారు. ఇక, నామినే షన్ల నుంచి ప్రమాణ స్వీకారాల వరకు కూడా సెంటిమెంటునే నమ్ముకుంటారు. ఇలా.. రాజకీయాలకు-సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం పెనవేసుకుపోయిందన్నది వాస్తవం. ఇలానే.. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఓ కీలకనియోజకవర్గంలోనూ గత మూడుదఫాలుగా సెంటిమెంటు కొనసాగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంటు కొనసాగుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
అదే.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం. ఇక్కడ మూడు దఫాలుగా జరిగిన ఎన్నికలను గమనిస్తే.. వరుసగా ఎవరూ విజయం దక్కించుకోలేదు. ఒకరి తర్వాత.. ఒకరిని ఇక్కడి ప్రజలు గెలిపించారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ సెంటిమెంటుకు మరింత పునాదులు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. 2014లో టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించిన ప్రజలు 2019కి వచ్చే సరికి వైసీపీకి పట్టం కట్టారు. అదేసమయంలో 2024లో మళ్లీ టీడీపీని గెలిపించారు. ఇలా మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు నాయకులు ఒకరు తర్వాత ఒకరు విజయం దక్కించుకున్నారు.
2014లో బగ్గు రమణమూర్తి టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఈయనకు మంచి పేరు.. ప్రజల్లో మంచి హవా కూడా ఉంది. పార్టీ పరంగా కూడా మంచిమార్కులే వేయించుకున్నారు. అయినప్పటికీ.. 2019లో మాత్రం వైసీపీ తరఫున ధర్మాన కృష్ణదాస్ విజయం దక్కించుకున్నారు. ఇక, ఆయన మంత్రిగా కూడా జగన్ హయాంలో పనిచేసారు. కానీ.. 2024 నాటికి ప్రజలు ఆయనను ఓడించి మళ్లీ బగ్గు రమణ మూర్తిని గెలిపించారు. ఇలా.. మూడు ఎన్నికల్లో నాయకులు ఒకరు తర్వాత ఒకరు విజయం దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు ఈ సెంటిమెంటునే నమ్ముకుంటారా? అనేది చూడాలి.
మరో వాదన కూడా..
ఇక, మరో వాదన కూడా వినిపిస్తోంది. పార్టీల హవాను బట్టి నరసన్నపేట ప్రజల మూడ్ మారుతోందన్న చర్చ ఉంది. 2014లో చంద్రబాబు హవా కొనసాగడంతో టీడీపీ వైపు మొగ్గు చూపారని.. అభ్యర్థికంటే కూడా హవాకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన ఉంది. ఇక, 2019లో కూడా ఇలానే జగన్ పాదయాత్ర హవాతోనే ధర్మానను గెలిపించారన్న చర్చ కూడా నడిచింది. అదేవిధంగా 2024లో కూటమి ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వీచిందని.. అందుకే ఇక్కడ మార్పు కనిపించిందన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇలాంటి భారీ హవా వస్తే.. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
