లోకేష్ యునానిమస్...నో సర్ప్రైజ్
నిజానికి అటు లోకేష్ కానీ ఇటు జూనియర్ కానీ ఎపుడూ తమ మధ్య విభేదాలు ఉన్నాయని నోరు విప్పలేదు. ఆ మాటకు వస్తే ఇద్దరూ స్పోర్టివ్ గానే ఉంటారు.
By: Satya P | 25 Jan 2026 9:31 AM ISTనారా లోకేష్ గురించి చెప్పుకోవాల్సిందే. ఒక విధంగా స్పూర్తిగా తీసుకోవాల్సిందే. నెగిటివిటీని పాజిటివిటీగా మార్చుకుని ఈ రోజుకు ఈ స్థితికి చేరుకున్నారని చెప్పాలి. పప్పు అన్న వారే వామ్మో నిప్పు అనే స్థితికి తెచ్చారు అంటే దటీజ్ లోకేష్. అందుకే ఆయనకు యునానిమస్ గా మద్దతు ఉంది. ఆయన పుట్టిన రోజు గతంలో కంటే గొప్పగా జరిగింది. వారూ వీరూ కాదు అందరూ ఆల్ ది బెస్ట్ లోకేష్ అని చెప్పారు అంటే అది ఆయన సాధించిన ఘన విజయం కిందనే చూడాల్సి ఉంది.
జూనియర్ సైతం :
ఈసారి లోకేష్ కి వచ్చిన బర్త్ డే విషెస్ తీసుకుంటే సినీ నటుడు నందమూరి మూడవ తరం వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ని గ్రీట్ చేయడం విశేషంగానే అంతా చూస్తున్నారు. లోకేష్ కి జూనియర్ గ్రీట్ చేస్తూ ఆయన ముందున్న మరో అద్భుతమైన సంవత్సరంలోనూ గొప్పగా రాణించాలని కోరుకున్నారు. అంటే గడచిన సంవత్సరంలో లోకేష్ అద్భుతంగా తన ప్రతిభను చూపించారని అందరూ అంటున్న సంగతే. జూనియర్ ఎన్టీఆర్ సైతం లోకేష్ టీడీపీలో క్రమంగా ఎదుగుతున్న సంగతికి గుర్తించారు. అంతే కాదు ఆయన టీడీపీకి కీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో జూనియర్ గ్రీట్ చేయడం ప్రత్యేకంగానే టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
విభేదాలు లేవంటూ :
నిజానికి అటు లోకేష్ కానీ ఇటు జూనియర్ కానీ ఎపుడూ తమ మధ్య విభేదాలు ఉన్నాయని నోరు విప్పలేదు. ఆ మాటకు వస్తే ఇద్దరూ స్పోర్టివ్ గానే ఉంటారు. అయితే ఈ ఇద్దరి మధ్యన ఏదో ఉందని గ్యాప్ అంటూ కధనాలు వచ్చాయి. కానీ ఇపుడు అవన్నీ పటాపంచలు అయిపోయినట్లే పరిస్థితి అయితే ఉంది అని అంటున్నారు. టీడీపీ వర్గాలు అయితే లోకేష్ జూనియర్ ఇద్దరూ బాగుండాలనే కోరుకుంటున్నారు.
వీరంతా ఒక్కటిగా :
అదే విధంగా కాంగ్రెస్ పార్ర్టీ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సైతం నారా లోకేష్ కి గ్రీట్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా లోకేష్ కి గ్రీట్ చేశారు. ఈ విధంగా చూస్తే అందరి గ్రీటింగ్స్ అందరి ప్రేమను పొందిన లోకేష్ ఈ ఏకగ్రీవమైన ప్రేమకు పాత్రుడు అయ్యారని అంటున్నారు. ఏపీ రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. ప్రత్యర్ధుల కంటే కూడా ఎక్కువగా పోరు సాగుతూ ఉంటుంది. అలాంటి చోట నారా వారి వారసుడు పార్టీలకు అతీతంగా అందరి నుంచి విషెస్ అందుకోవడం బట్టి చూస్తే ఇక్కడ రెండు విషయాలు అర్ధం అవుతాయి. ఒకటి లోకేష్ అందరినీ కలుపుకుని పోయే తత్వంతో వ్యవహరించిన తీరు. రెండవది టీడీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీలో లోకేష్ తిరుగులేని నేతగా ఎదుగుతున్న విధానం. పుట్టిన రోజున లోకేష్ కి బర్త్ డే విషేష్ రూపంలో వచ్చిన ఈ సంకేతాలు ఆయన భవిష్యత్తు ఏపీ నాయకుడు అని చెప్పకనే చెబుతున్నాయని అంతా విశ్లేషిస్తున్నారు.
