ఫొటోస్ ఆఫ్ జెన్-Z.. లోకేశ్ ట్వీట్ వైరల్
తన ట్వీట్ కు నాలుగు ఫొటోలు జత చేయగా, అందులో ఒక్కరు కూడా యువకులు కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు.
By: Tupaki Political Desk | 11 Aug 2026 3:28 PM ISTడీఎస్సీ స్టోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విపక్షం వైసీపీ చేస్తున్న ఆందోళనలపై మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. వైసీపీ తన ఆందోళనలకు జెన్-జీ వార్ అంటూ పేరు పెట్టగా, విపక్షం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో జెన్ జీ యువత ఎవరూ పాల్గొనడం లేదని అధికార పక్షం ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ తన అధికారిక ఎక్స్ లో వైసీపీ రిలే నిరాహారదీక్షల్లో కూర్చున్న వృద్ధులు, వయోజనుల ఫొటోను షేర్ చేస్తూ ‘‘ఫొటోస్ ఆఫ్ జెన్-Z @ వైసీపీ ప్రొటెస్ట్స్’’ అంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు నాలుగు ఫొటోలు జత చేయగా, అందులో ఒక్కరు కూడా యువకులు కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ రిలే నిరాహారదీక్షలపై మంత్రి లోకేశ్ వ్యంగ్యంగా స్పందించడం వైరల్ అవుతోంది. వైసీపీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై తొలి నుంచి భిన్నమైన ప్రచారమే జరుగుతోందని చెబుతున్నారు. డీఎస్సీ పరీక్షలు ముగిసిన ఏడాది తర్వాత వైసీపీ ఆందోళనలకు పిలుపునివ్వడం ఏంటని అని ప్రశ్నిస్తున్న అధికార పక్షం డీఎస్సీ రాసిన అభ్యర్థులు పెద్దగా స్పందించలేదన్న విషయాన్ని ఎత్తిచూపుతోంది. ఇదే సమయంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాల్లో వృద్ధులు, సీనియర్ కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై జెన్-Z లేవనెత్తుతున్న ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన ప్రకటనను ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించగా, ఆ క్లిప్ ను ట్యాగ్ చేస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ నిరసనల్లో జెన్-Z లేరన్న విషయాన్ని ఆయన నేరుగా ఎత్తిచూపారని అంటున్నారు. రాజకీయం కోసమే వైసీపీ ఆందోళనలు చేస్తుందనే విషయాన్ని చెప్పడానికి వృద్ధులు ఆందోళన చేస్తున్న ఫొటోను షేర్ చేశారని చెబుతున్నారు.
కాగా, వైసీపీ రాజకీయ లక్ష్యంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టడాన్ని తప్పుపట్టకపోయినా, నిరసనలకు జెన్-Z వార్ అంటూ పేరు పెట్టడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో మెగా డీఎస్సీ పరీక్ష రాసి ఉద్యోగాలలో చేరిన వారికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ చెప్పలేకపోవడాన్ని పార్టీ నేతలు తప్పుబడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో నిరసనలకు పెట్టిన పేరుతో మొత్తం విషయం పక్కదారి పట్టినట్లైందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికార పక్షం పట్టుకుని తిరిగి వైసీపీపై రివర్స్ అటాక్ చేస్తోందని అంటున్నారు.
