Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వ పాఠశాలలో డేవిడ్ బెక్ హోమ్... లోకేష్ రియాక్షన్ ఇదే!

ఇంగ్లాండ్ మాజీ ఫుట్ బాల్ కెప్టెన్, యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్, సర్ డెవిడ్ బెక్ హోమ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు.

By:  Raja Ch   |   27 Nov 2025 3:58 PM IST
ఏపీ ప్రభుత్వ పాఠశాలలో  డేవిడ్  బెక్  హోమ్... లోకేష్  రియాక్షన్  ఇదే!
X

ఇంగ్లాండ్ మాజీ ఫుట్ బాల్ కెప్టెన్, యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్, సర్ డెవిడ్ బెక్ హోమ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఇందులో భాగంగా... ఏపీలో పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా... అక్కడ ఏపీ విద్యార్థుల నుంచి ఘన స్వాగతం పొందిన అనంతరం.. వారితో ముచ్చటిస్తూ, మైదానంలో వారితో ఫుట్ బాల్ ఆడారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

అవును... ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం డేవిడ్ బెక్ హోమ్ విశాఖలో పర్యటించారు. ఇందులో భాగంగా... ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ (పీబీఎల్) కార్యకలాపాలను చూశారు. ఆయన పర్యటన ఏపీ, బీహార్, నాగాలాండ్, ఒడిశా అంతటా క్లాస్ రూమ్స్ ను మెరుగుపరుస్తున్న ఎడ్యుకేషన్ అబౌవ్ ఆల్ మద్దతు ఇవ్వబడిన "మంత్ర4చేంజ్" కార్యక్రమంలో ఓ భాగం.

ఈ నేపథ్యంలో.. ఏపీ ఐటీ, విద్య, మానవ వనరుల మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో సంభాషించినందుకు దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ డెవిడ్ బెక్ హోమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇంగ్లిష్ ఫుట్ బాల్ ప్లేయర్ విశాఖలో అడుగుపెట్టి, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారని లోకేష్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా... విశాఖ సమీపంలోని కొత్తవలసలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించినందుకు లెజెండరీ ఫుట్ బాల్ క్రీడాకారుడు, యూనిసెఫ్ ఇండియా గుడ్ విల్ అంబాసిడర్ డెవిడ్ బెక్ హోమ్ కు ధన్యవాదాలు అని తెలిపారు. మీ హృదయపూర్వక సంభాషణలు, ప్రోత్సాహం, ఉల్లసభరితమైన శక్తి.. మా తరగతి గదులను, ఆట స్థలాన్ని మరింత వెలిగించాయని అన్నారు.

అదేవిధంగా... పిల్లలు కలలు, విద్య పట్ల మీ నిబద్ధతకు తాము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాస్తూ.. బెక్ హోమ్ విద్యార్థులతో కలిసిన వీడియోను పంచుకున్నారు మంత్రి లోకేష్.

ఆ వీడియోలో.. నేను భారతదేశానికి తిరిగి వచ్చాను.. ఈరోజు నేను తిరిగి స్కూల్ కి వెళ్తున్నాను అని బెక్ హోమ్ అన్నారు. ఈ వీడియోలో ఆయన తన సాకర్ నైపుణ్యాలను విద్యార్థులకు ప్రదర్శించారు, వారితో కలిసి ఫుట్ బాల్ ఆడారు. ఈ సమయంలో స్కూల్ లోని బాలికలు తనను వెల్ కమ్ డ్యాన్స్ తో పలకరించారని.. సంగీత వాయిద్యాలు తయారు చేశారని, మొక్కలు నాటారని తెలిపారు.

కాగా... మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) సొసైటీ భాగస్వామ్యంతో, ఎడ్యుకేషన్ అబౌవ్ ఆల్ (ఈఏఏ) మద్దతుతో మంత్ర4చెంజ్.. ఏపీ అంతటా 107 రెసిడెన్షియల్ స్కూల్స్ లో బోధన, అభ్యాసాన్ని పునఃరూపకల్పన చేసింది! ఇదే సమయంలో.. సుమారు 18,000 మంది విద్యార్థులను చేర్చుకుంది. ఇక్కడ విద్యార్థులు వినడం ద్వారా చూడటం ద్వారా కాకుండా చేయడం ద్వారా నేర్చుకుంటారు.