Begin typing your search above and press return to search.

ప్రపంచ ఛాంపియన్ ఇన్ఫోసిస్? లోకేశ్ ట్వీట్ పై ఇంట్రస్టింగ్ డిబేట్

ఏపీ ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారంటూ సోమవారం మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Gallery Desk   |   16 Dec 2025 2:15 PM IST
ప్రపంచ ఛాంపియన్ ఇన్ఫోసిస్? లోకేశ్ ట్వీట్ పై ఇంట్రస్టింగ్ డిబేట్
X

విశాఖ సిద్ధంగా ఉండు.. అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ పై హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఏపీ ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారంటూ సోమవారం మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖకు వచ్చే ప్రపంచ ఛాంపియన్ ఎవరో చెప్పగలరా? అంటూ నెటిజన్లను తన ట్వీట్ ద్వారా మంత్రి లోకేశ్ ప్రశ్నించడం కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో విశాఖకు అనేక ప్రముఖ సంస్థలు తరలివస్తున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, కాగ్నిజెంట్ కూడా విశాఖలో తమ క్యాంపస్ లు నిర్మాణానికి ముందుకొచ్చాయి.

ఇప్పటికే కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్ కోసం కాపులుప్పాడలో భూమి పూజ కూడా చేసింది. మూడేళ్లలో ఇక్కడ భవన నిర్మాణం పూర్తి చేసేలా కాగ్నిజెంట్ అడుగులు వేస్తోంది. మరోవైపు టీసీఎస్ కూడా రుషికొండ ఐటీ హిల్స్ లో టెంపరెరీ క్యాంపస్ ను తెరుస్తోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ వచ్చే ప్రపంచ ఛాంపియన్ ఎవరు? అన్న ప్రశ్నపై నెటిజన్లలో విస్తృత చర్చ జరుగుతోంది. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ యే ఆ ప్రపంచ ఛాంపియన్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

ఇన్ఫోసిస్ కు ఇప్పటికే విశాఖలో కార్యాలయం ఉంది. అయితే ఈ కార్యాలయాన్ని మరింత విస్తరించాలని ఇన్ఫోసిస్ ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. విశాఖకు పలు ఐటీ సంస్థలు క్యూ కడుతుండటం వల్ల ఇన్ఫోసిస్ కూడా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ నిర్మిస్తే.. రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని అంటున్నారు. దీంతో లోకేశ్ ట్వీట్ ఇన్ఫోసిస్ కోసమేనంటూ ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

ఇన్ఫోసిస్ పర్మినెంట్ క్యాంపస్ కోసం నగరంలోని ఎండాడ సమీపంలో 20 ఎకరాలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ స్థలంపై ఇన్ఫోసిస్ కూడా ఆసక్తి చూపిందని, ఇతర రాయితీలపైనే ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ చర్చలు కొలిక్కి వచ్చాయని, ఈ నెలలో అధికారికంగా ప్రకటన చేయొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మంత్రి లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై స్పష్టత రావడంతోనే ఆయన నెటిజన్లలో క్యూరియాసిటీ పెంచేలా ట్వీట్ చేశారని చెబుతున్నారు.

విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని 2023, అక్టోబర్ 16న అధికారికంగా ప్రారంభించారు. అంతకుముందు 2022 అక్టోబర్ నుంచే మధురవాడలోని ఒక తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలను సాగించింది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థ ఏర్పాటు కావడం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. రుషికొండ ఐటీ హిల్సలో 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్ఫోసిస్ కార్యాలయం నిర్మించారు. ఇందులో ప్రస్తుతం వెయ్యి మంది వరకు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కొత్త పాలసీ ఆకర్షణీయంగా ఉండటంతో విశాఖ క్యాంపస్ ను మరింత విస్తరించాలని ఇన్ఫోసిస్ భావిస్తోందని అంటున్నారు.