Begin typing your search above and press return to search.

రాప్తాడుకు 20 మంది కౌన్సిల‌ర్లు.. విద్యార్థుల్లో స్థైర్యం నింపిన మంత్రి నారా లోకేష్

కేవలం వైద్య సహాయానికే పరిమితం కాకుండా.. తోటి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక శ్రద్ధ అందరి దృష్టినీ ఆకర్షించింది.

By:  Sivaji Kontham   |   1 Nov 2026 1:23 PM IST
రాప్తాడుకు 20 మంది కౌన్సిల‌ర్లు.. విద్యార్థుల్లో స్థైర్యం నింపిన మంత్రి నారా లోకేష్
X

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన క్రూరమైన దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సిన తరగతి గదిలోనే ఈ ఘటన జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ విషాద సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ తీసుకున్న చర్యలు, అందించిన సహాయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

గాయపడిన విద్యార్థిని ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం భావించింది. అనంతపురంలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం.. బాధితురాలికి అత్యున్నత స్థాయి వైద్యం అందించేందుకు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సమయం వృధా కాకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి `గ్రీన్ కారిడార్` ఏర్పాటు చేయించి ఆసుపత్రికి త్వరగా చేర్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వైద్య బృందం ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి చేసి చిన్నారి ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచడంలో విజయం సాధించింది.

కేవలం వైద్య సహాయానికే పరిమితం కాకుండా.. తోటి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక శ్రద్ధ అందరి దృష్టినీ ఆకర్షించింది. తమ కళ్లముందే జరిగిన ఘోరాన్ని చూసి భయపడిపోయిన పదో తరగతి విద్యార్థులతో పాటు 8, 9, 10 తరగతుల బాలికల ఇళ్లకు 20 మంది ప్రత్యేక కౌన్సెలర్ల బృందాన్ని పంపించారు. ప్రతి విద్యార్థి నివాసానికి వెళ్లి వారిలో ఆందోళనను తగ్గించి.. ఆత్మస్థైర్యం నింపేందుకు మానసిక నిపుణులు కృషి చేస్తున్నారు.

కళ్లముందు జరిగిన హింసాత్మక ఘటనతో భవిష్యత్తులో పిల్లలు బడికి రావడానికి భయపడకుండా ఉండాలనే దూరదృష్టితో ఈ ముందస్తు ఏర్పాట్లు చేశారు. ``ఏ ఒక్క చిన్నారి కూడా భయంతో చదువుకు దూరం కాకూడదు`` అనే ఆలోచనతో లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గొప్ప ప్రయత్నమని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, విద్యావేత్తలు కొనియాడుతున్నారు. చిన్నారి కోలుకోవడానికి అందిస్తున్న అండతో పాటు.. తోటి పిల్లలకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం గొప్ప విష‌యం.

మరోవైపు నేరానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు కఠిన శిక్ష పడేలా చర్యలు వేగవంతం చేశారు. సంక్షోభ సమయంలో బాధితురాలి ప్రాణాలు కాపాడటం నుంచి ఇతర విద్యార్థుల మానసిక భద్రత వరకు ప్రతి అంశాన్నీ పర్యవేక్షించిన లోకేష్ పనితీరు ప్రశంసనీయం. ఈ ఘటన అనంతరం పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలను పెంచడంపై చర్చ ప్రారంభమైంది. అపరిచితులు పాఠశాలల్లోకి ప్రవేశించకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని.. పాఠశాలల వద్ద రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.