Begin typing your search above and press return to search.

లోకేష్ పొలిటికల్ ఎంట్రీ వెనక అంత స్టోరీ ఉందా ?

నారా లోకేష్ ఏపీలో యువ నాయకుడు. రాజకీయంగా కొత్త తరం నాయకత్వం ఏంటో జనాలకు చూపిస్తున్న వారు.

By:  Satya P   |   22 Aug 2026 11:32 PM IST
లోకేష్ పొలిటికల్ ఎంట్రీ వెనక అంత స్టోరీ ఉందా ?
X

నారా లోకేష్ ఏపీలో యువ నాయకుడు. రాజకీయంగా కొత్త తరం నాయకత్వం ఏంటో జనాలకు చూపిస్తున్నవారు. టీడీపీలో సర్వ సత్తాక నేత, అంతే కాదు కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ ఆ భారాన్ని కూడా బాధ్యతగా మోస్తూ జనంలో ముఖ్యంగా యువతలో మంచి స్పూర్తిగా ఉన్న నాయకుడు. ఏపీలో ప్రస్తుతం చూస్తే నవ తరం నాయకుడు ఎవరు అంటే ఠక్కున అంతా చెప్పే ఒకే ఒక పేరు నారా లోకేష్. అంతే కాదు ఆయన పాలన మంత్రిగా ఎలా ఉంటుందో తనదైన శైలిలో చూపిస్తున్నారు. ఇక రానున్న కాలంలో ప్రభుత్వ సారధిగా మారితే చూడాలన్న కోరిక ఆసక్తి అయితే జనంలో ఉంది. ఆ విధంగా జనంలో ఒక ఉత్సుకతను క్రియేట్ చేసి తన యూత్ మార్క్ వేసుకున్న నేత నారా లోకేష్.

వారసుడిగా వచ్చినా :

ఇక పోతే రాజకీయాలలో నారా లోకేష్ వారసుడిగా వచ్చినా కూడా అదేమంత ఈజీగా జరగలేదు. మేరు పర్వతం లాంటి చంద్రబాబు తండ్రిగా అవతల ఉన్నారు. ఆయనతో లోకేష్ ని సరిపోల్చుతారు. అంతటి పెను భారాన్ని మోస్తూ కూడా తనదైన స్టైల్ తో పాలిటిక్స్ లో రాణిస్తున్నారు నారా లోకేష్. అంతే కాదు ఆయన ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. పప్పు అని ప్రత్యర్ధులు ఘాటు విమర్శలు చేసినా పొలిటికల్ ర్యాగింగ్ చేసినా తట్టుకుని నిలబడ్డారు. ఓడిన చోటనే గెలిచి నిలిచారు. అంతే కాదు, తనను పప్పు అన్న వారికి తాను నిప్ప్పు అని నిరూపించారు. ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ ది ఇపుడు నడుస్తున్న నవ్య చరిత్ర. మరి ఈ యువ నేతకు రాజకీయాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది. ఆయన ఎందుకు రావాలనుకున్నారు, ఏమా కధ అంటే స్టోరీ బోలెడు ఉంది.

అపుడే డెసిషన్ అంటూ :

విశాఖ జిల్లా చంద్రంపాలెం పాఠశాలలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ అక్కడ విద్యార్ధులతో మాటా మంతీ జరిపారు. వారు వేరే ప్రశ్నలకు ఆయన ఎంతో సరదాగా జవాబులు చెప్పారు. ఏ ప్రశ్న వేసినా లోకేష్ తడబడకుండా చాలా కూల్ గా జవాబు చెప్పిన తీరు అయితే అక్కడ ఉన్న వారికే కాదు టీవీలలో చూసిన వారికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూసిన వారిని కూడా ఆకట్టుకుంది. తాను రాజకీయాల్లోకి కేవలం 21 ఏళ్లకే రావాలని నిర్ణయించుకున్నాను అని లోకేష్ చెప్పుకొచ్చారు. తనకు ఆనాడు మనసులో రాజకీయ బీజం పడడానికి కారణం తన తండ్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఆయనే తన స్పూర్తి అని కూడా చెప్పారు.

ఆయన ఆదరణ చూసి :

ఇక 2005లో ఒక పెళ్ళికి చంద్రబాబు అటెండ్ అయితే అక్కడ ఉన్న అయిదు వేల మంది దాకా జనాలు ఆయనను చూసి మర్యాదపూర్వకంగా లేచి నిలబడటం తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది అని లోకేష్ చెప్పారు. అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కాదని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అక్కడికి వస్తే జనాల అభిమానం చూసిన తనకు అంత గొప్పగా తానూ రాణించాలని ఆనాడే నిర్ణయించుకున్నాను అని ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన స్టోరీని ఆసక్తికరంగా వినిపించారు. ఆ తరువాత తాను విదేశాలలో ఎంబీయే చదివినా తన మనసులో రాజకీయాల మీద మక్కువ పోలేదని అన్నారు. తాను పెళ్ళి చేసుకోబోయే ముందు తన సతీమణి బ్రాహ్మణికి కూడా ఇదే విషయం చెప్పాను అన్నారు. తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని ఆనాడే కాబోయే భార్యకు చెప్పడం ద్వారా తనలోకి ఆ కోరికను మరింత గట్టిగా వ్యక్తం చేశాను అన్నారు.

రెండో ఆలోచన లేదు :

తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం వల్ల రెండో ఆలోచన అన్నదే లేకుండా పోయింది అని నారా లోకేష్ స్పష్టం చేశారు. సో తన రాజకీయ ప్రయాణం గురించి నారా లోకేష్ చెప్పిన ఈ మాటలు చూస్తే ఒక్క విషయం స్పష్టం అవుతుంది. పట్టుదల ఉంటే తాము ఎంచుకున్న రంగంలో రాణించవచ్చు అని. అలాగే తాము ఏ రంగాన్ని ఎంచుకోవాలో మొదటే నిర్ణయించుకుని ఆ దిశగా ప్రణాళిక వేసుకుంటే సక్సెస్ అవవచ్చు అని. మొత్తానికి యూత్ ఐకాన్ గా నారా లోకేష్ ఈ విషయంలో కూడా నిలుస్తున్నారు అని చెప్పక తప్పదు.