ప్రశ్నలకు.. సమాధానమై నిలబడ్డ నాయకుడు బాబే: లోకేష్
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 30 Aug 2025 1:03 PM ISTటీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నలకు సమాధానమై నిలిచిన నాయకుడు చంద్రబాబేనని చెప్పారు. గతం నుంచి ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు సంధించిన వారు ఉన్నారని, కానీ.. ఇప్పుడు ఆ ఫలాలను వారే అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం సాయంత్రం విశాఖలోని ఓ హోటల్‌లో జరిగిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఐఐ సదస్సులో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత చంద్రబాబు నిర్ణయాలను ప్రస్తావించారు.
గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి భారీ ఎత్తున భూసేకరణ చేసినప్పుడు అనేక మంది చంద్రబాబును విమర్శించారని లోకేష్ చెప్పారు. అంత భూమి ఎందుకని ప్రశ్నించారని అయినా.. చంద్రబాబు 2020 విజన్‌ను దృష్టిలో పెట్టుకుని భూ సమీకరణ చేశారని, ఇది ఇప్పుడు ఇస్తున్న ఫలాలను తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటోందన్నారు. నాడు విమర్శించిన వారు కూడా నేడు మెచ్చుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా అమరావతి భూమి విషయంలోనూ ఇప్పుడు అనేక మంది విమర్శలు చేస్తున్నారని, విష ప్రచారం చేస్తున్నారని, కానీ, భవిష్యత్తులో ఇది అభివృద్ధి చెందాక.. ఏపీకి ఒక మణిహారంలాగా, ఆదాయ వనరుగా మారుతుందని లోకేష్ చెప్పారు.
అనేక ప్రశ్నలు ఎదురైనా.. చంద్రబాబు ఎప్పుడూ సమాధానంగా నిలిచారని లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఐటీ కేంద్రంగా మారనుందని తెలిపారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను పెంచనున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టామని.. త్వరలోనే విశాఖలోనూ పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. 15 శాతం వృద్ధి సాధించేలా సంపద సృష్టి జరుగుతుందన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని.. దీనిని సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
ఇప్పటికే సూపర్ 6 పథకాల్లో దాదాపు అన్నింటినీ పేదలకు చేరువ చేసినట్టు లోకేష్ తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమకు సహకరిస్తోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగా అభివృద్ధి సాకారం అవుతోందని చెప్పారు. ప్రతి విషయాన్నీ రాజకీయంగా చూడడం ఒక పార్టీ నేతల తరహా అయితే.. ప్రతి విషయంలోనూ ప్రజలను, వారి భాగస్వామ్యాన్ని చూడడం చంద్రబాబు తరహా అని, ఆయన పాలనకు ఇదే నిదర్శనమని నారా లోకేష్ చెప్పారు.
