Begin typing your search above and press return to search.

లోకేష్ భేటీలు ఆసక్తికరం !

ఏపీలోని టీడీపీ కూటమిలో యువ మంత్రిగా ఉన్న నారా లోకేష్ జాతీయ స్థాయిలో తన పలుకుబడిని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Satya P   |   19 Jun 2026 4:00 AM IST
లోకేష్ భేటీలు ఆసక్తికరం !
X

ఏపీలోని టీడీపీ కూటమిలో యువ మంత్రిగా ఉన్న నారా లోకేష్ జాతీయ స్థాయిలో తన పలుకుబడిని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ మంత్రిగా ఆయన కేవలం రాష్ట్రానికే పరిమితం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి వస్తున్నారు. కేంద్ర మంత్రులను విరివిగా కలుస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశం అవుతున్నారు. తాను చురుకైన యువ నేతగా ఏపీ రాజకీయాల్లో ఉన్నాను అని తెలియచేసేందుకు ఈ పర్యటనలు లోకేష్ కి ఎంతగానో దోహదపడుతున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

బీజేపీ ముఖ్యమంత్రులతో :

కేవలం దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే లోకేష్ పర్యటనలు పరిమితం కావడం లేదు, ఆయన వివిధ రాష్ట్రాలలో కూడా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీదనే ఈ పర్యటనలు అని ప్రచారం జరుగుతున్నా వాటితో పాటుగా స్వామి కార్యం అన్నట్లు లోకేష్ ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న నాయకులను ముఖ్యమంత్రులను కలుసుకుంటూ వారితే మమేకం అవుతూ యంగ్ డైనమిక్ లీదర్ గా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సువేందుతో కీలక భేటీ :

ఇదిలా ఉంటే నారా లోకేష్ తాజాగా పశ్చిమ బెంగాల్ కి వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో కోల్ కతాలో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి లోకేష్ సువెందుకు తెలిపారు. ఏపీలో అత్యధిక మందికి సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామని కూడా చెప్పారు. [పశ్చిమ బెంగాల్ లో అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఏపీ బెంగాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని సువేందుని లోకేష్ కోరడం విశేషం. ఇదే సందర్భంలో పశ్చిమ బెంగాల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి అన్ని విధాలా సాయం అందిస్తామని సువేందుకు లోకేష్ విన్నవించారు.

మహారాష్ట్ర సీఎంతోనూ :

ఇంతకు ముందు ముంబై పర్యటనకు వెళ్ళిన నారా లోకేష్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా భేటీ అయి అనేక అంశాలను ముచ్చటించారు. ఇలా లోకేష్ బీజేపీలో కీలకమైన రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువ ముఖ్యమంత్రులతో భేటీలు వేయడం రాజకీయంగా ఆసక్తిని కలిగించే అంశంగానే చూస్తున్నారు ఈ ఇద్దరు నేతలూ బీజేపీలో ఎంతో భవిష్యత్తు ఉన్న వారు కావడం విశేషం. ఇక ఏపీ నుంచి రాజకీయంగా ఎదుగుతున్న నేతగా లోకేష్ ఉన్నారు. దాంతో ఆయన జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పెద్దలతో పాటు యువ ముఖ్యమంత్రులతోనూ అదే రకమైన సాన్నిహిత్యం నెరపడం వెనక ముందు చూపు ఉందని అంటున్నారు. రానున్న రోజులలో ఆయన ఇదే తీరులో మరెంత మంది ముఖ్యమంత్రులను కీలక నేతలను కలుస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఏది ఏమైనా ఏపీకి చెందిన మంత్రిగా ఉన్న లోకేష్ తన పలుకుబడిని జాతీయ స్థాయిలో ఒక క్రమపద్ధతిలో విస్తరించుకుంటున్నారు అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.