'డీఎస్సీ'తో యువ మనసులు దోచ్చుకున్న లోకేష్!
తాము అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీని నిర్వహించి వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం ఈ ఫైలుపైనే చేశారు.
By: Garuda Media | 26 Sept 2025 3:11 PM ISTరాజకీయాల్లో నాయకులు.. ఒక్కొక్క పంథాను అనుసరించి.. ప్రజలకు చేరువ అవుతారు. అలానే.. టీడీపీ యువ కిశోరం, మంత్రి నారా లోకేష్ యువత మనసులో చోటు చేసుకున్నారు. దీనికి డీఎస్సీని ఆయన ప్రాతిపదికగా మార్చుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నారా లోకేష్ సారథ్యంలో మెగా డీఎస్సీ నిర్వహించారు. ఎన్నికలకు నిర్వహించిన యువగళం పాదయాత్ర ద్వారా మాస్ జనాలకు చేరువ అయిన లోకేష్.. యువతను ఆకట్టుకునేందుకు ఉద్యోగ ప్రకటనలు.,. ముఖ్యంగా డీఎస్సీని ప్రకటించారు.
తాము అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీని నిర్వహించి వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం ఈ ఫైలుపైనే చేశారు. తాజాగా 14 వేల మందికి పైగా అభ్యర్థులు.. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందారు. దీనికి సంబంధించి అప్పాయింట్ మెంటు పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని అమరావతిలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సుమారు 40 నిమిషాల పాటు కీలక ప్రసంగం చేసిన నారా లోకేష్.. యువత మనసును చూరగొనేలా వ్యాఖ్యలు చేశారు.
ఇక, నుంచి ప్రతి ఏటా జనవరిలో డీఎస్సీని నిర్వహిస్తామని.. వచ్చే నాలుగేళ్లపాటు డీఎస్సీ నిర్వహణ ఉంటుందని కూడా చెప్పారు. అంతేకాదు.. యువత సిద్ధంగా ఉండాలని చెప్పారు. తద్వారా ఉద్యోగార్థులకు ఆయన ఆశలు చిగురించేలా చేశారు. ప్రస్తుతం 16 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 2 వేల పోస్టుల వరకు భర్తీకాలేదు. ఈ నేపథ్యంలో వాటిని వచ్చే ఏడాది జనవరిలో జారీ చేసే నోటిఫికేషన్‌లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా మరుసటి ఏడాది కూడా ఇలానే భర్తీ చేయనున్నారు.
యువత ఓట్లపై దృష్టి
నాయకులు ఏం చేసినా.. ఓట్ల కోసమే. అధికారంలో ఉన్నా.. లేకున్నా..ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పవు. ఈ క్రమంలో సుమారు 1.2 కోట్లుగా ఉన్న యువత ఓట్లను తనవైపు తిప్పుకోవడంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిం చారన్న టాక్ వినిపిస్తోంది. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. ఈ క్రమంంలో యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా.. వారి ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్న చర్చ జరుగుతుండడం గమనార్హం.
