Begin typing your search above and press return to search.

టీడీపీలో హాట్ టాపిక్ గా మంగళగిరి మోడల్.. తమ్ముళ్లకు టార్గెట్ సెట్ చేసిన లోకేశ్

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి మోడల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Political Desk   |   8 Jun 2026 2:00 PM IST
టీడీపీలో హాట్ టాపిక్ గా మంగళగిరి మోడల్.. తమ్ముళ్లకు టార్గెట్ సెట్ చేసిన లోకేశ్
X

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి మోడల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పనితీరు, రాజకీయ వ్యూహాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడం చర్చనీయాంశంగా మారింది. సాక్ష్యాత్తూ అధినేత చంద్రబాబును ఆకర్షించిన మంగళగిరి మోడల్ ఏంటి? దానిని అందుకోవడం మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎందుకు సాధ్యం కావడం లేదన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో పోటి చేసిన తొలిసారి ఓటమి ఎదుర్కొన్న మంత్రి లోకేశ్ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పటిష్టమైన కోటలా తీర్చిదిద్దుకున్న తీరు.. ఆ తర్వాత నియోజకవర్గ వాసులతో ఆయన పెంచుకున్న సంబంధాలు అధినేత చంద్రబాబును ఆకట్టుకుందని అంటున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. సాధారణంగా లోకేశ్ స్థాయి నాయకులు ఓడిపోతే తర్వాత ఎన్నికల నాటికి సురక్షిత స్థానాన్ని ఎంచుకుంటారు. ఓడిన నియోజకవర్గాన్ని పక్కన పెట్టేస్తారని భావిస్తారు. కానీ, మంత్రి లోకేశ్ అందరిలా ఆలోచించలేదు. టీడీపీ చరిత్రలో ఎప్పుడు గొప్పవిజయాలు సాధించని మంగళగిరిని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారని చెబుతున్నారు. తన ఓటమిని సవాల్‌గా తీసుకుని మంగళగిరిలోనే మకాం వేశారు. 2024 ఎన్నికల కంటే ముందే నియోజకవర్గంలోని ప్రతి ఇంటినీ పలకరించారు. 'యువగళం' పాదయాత్రకు ముందే మంగళగిరి సందు సందుల్లో తిరిగారు. ఫలితంగా 2024 లో ఊహించని రీతిలో భారీ మెజారిటీతో విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఒక వ్యవస్థగా మార్పు

మంత్రిగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, విద్యాశాఖ వంటి అత్యంత కీలకమైన బాధ్యతలు చూస్తూ సచివాలయంలో బిజీగా ఉంటున్నప్పటికీ, మంగళగిరిని ఆయన ఏమాత్రం విస్మరించడం లేదు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, స్థానిక అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడం, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం వంటి చర్యలతో ప్రజల్లో మన లీడర్ అనే బలమైన ముద్ర వేశారని చెబుతున్నారు. ఇటీవలే మంగళగిరి లైబ్రరీలో సమ్మర్ నాలెడ్జ్ క్యాంప్ ప్రారంభించడం, నులకపేటలో కమ్యూనిటీ హాల్స్, ఆధునిక స్మశాన వాటికల అభివృద్ధి వంటి క్షేత్రస్థాయి పనులు ఆయన నిరంతర పర్యవేక్షణకు అద్దం పడుతున్నాయని అంటున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలకు సవాల్‌

మంత్రి నారా లోకేష్ మంగళగిరిని తీర్చిదిద్దుతున్న విధానం, టెక్నాలజీని వాడుకుంటూ సోషల్ మీడియా ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం ఇప్పుడు మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఒక బెంచ్‌మార్క్‌గా మారిందని అంటున్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లోకేశ్ ను ఫాలో అవ్వాలని చెబుతున్నారు. అయితే, ఈ వేగాన్ని అందుకోవడంలో కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు పాత తరం రాజకీయాలకే పరిమితమవగా, అధిష్టానం మాత్రం లోకేష్ తరహాలోనే ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలని స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. ఇక నాయకత్వం అంటే కేవలం పదవులు అనుభవించడం కాదు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం అని లోకేష్ మంగళగిరి ద్వారా నిరూపించారని ప్రశంసలు అందుకుంటున్నారు. 2029 లక్ష్యంగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో, మంగళగిరి మోడల్ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో, మిగిలిన ప్రజాప్రతినిధులు ఈ వేగాన్ని ఎలా అందుకుంటారో చూడాల్సివుందని అంటున్నారు.