ఆ ఫార్ములానే నన్ను గెలిపించింది: లోకేష్
2019లో తాను ఓడిపోయినప్పుడు.. అనేక అవమానాలు ఎదురయ్యాయని తెలిపారు. అయితే.. వాటిని సవాలుగా తీసుకుని.. మళ్లీ ఓడిపోయిన చోటే పోటీ చేయాలని అనుకున్నట్టు తెలిపారు.
By: Garuda Media | 28 Sept 2026 4:39 PM ISTఎన్నికల్లో గెలుపు మజా ఇస్తుందని.. ఓడిపోతే.. నీరసం వస్తుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే.. గెలుపుతోపాటు ఓటమిని కూడా బలంగా తీసుకోవాలని సూచించారు. 2019లో తాను ఓడిపోయినప్పుడు.. అనేక అవమానాలు ఎదురయ్యాయని తెలిపారు. అయితే.. వాటిని సవాలుగా తీసుకుని.. మళ్లీ ఓడిపోయిన చోటే పోటీ చేయాలని అనుకున్నట్టు తెలిపారు. ఎందుకు ఓడిపోయామో అధ్యయనం చేసి.. దానిని సరిచేసుకుని ముందుకు సాగానని చెప్పారు. ఇదే ఫార్ములా నాయకులకు వర్తిస్తుందన్నారు.
ఓటమి తర్వాత కుంగిపోయి.. నియోజనకవర్గాలకు దూరంగా ఉంటే ఇబ్బందులు పెరుగుతాయన్నారు. తాను ఓడిపోయినా.. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను నిరంతరం కలుసుకుని.. వారికి హామీలు ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఆ నమ్మకమే తనను 93 వేల ఓట్ల మెజారిటీతో గెలిచేలా చేసిందని లోకేష్ వివరించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలోనేకాకుండా.. ప్రజల కోణంలో తాను ఆలోచన చేస్తానన్నారు.
తాజాగా సోమవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గంలోని 347 మంది పేదలకు ఇళ్ల పట్టాలను నారా లోకేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పట్టాల సమస్య పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుదలతో పనిచేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 2 వేల కోట్ల రూపాయల విలువైన ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశామని వివరించారు. ఇక ముందు కూడా ఈ యజ్ఞం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా పట్టాదారులకు బట్టలు పెట్టి.. కానుకలు అందించారు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయించారు.
చేసింది చెప్పాలి..
ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని లోకేష్ పిలుపునిచ్చారు. చేసింది చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని.. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అదేసమయంలో ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా చేస్తున్న మంచిని కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. టీడీపీ చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమం హిట్ అయిందన్నారు. వచ్చే ఏడాది కూడా ఈ కార్యక్రమం మరోసారి సాగుతుందన్నారు. ఎన్నికల లోగా.. మూడు సార్లయినా.. ప్రతి మంత్రి, ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ తిరిగేలా ప్రజలకు మంచిని వివరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
