రేపటి నుంచి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. ఎందుకంటే!
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.
By: Garuda Media | 18 Oct 2025 7:37 PM ISTఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ గత నెలలో మంత్రి లోకేష్ కు ఆహ్వానం పంపారు. దీనిని గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ అందుకున్నారు. తర్వాత.. రాజకీయ నాయకుల్లో అందుకున్న నేత నారా లోకేష్ మాత్రమే కావడం గమనార్హం.
రాష్ట్రంలోని తన శాఖ ద్వారా.. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో తీసుకువచ్చిన సంస్కరణలను ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. దీనిలో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడి అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు.
దీంతోపాటు నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం 19వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ ను సందర్శిస్తారు.
పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. 21న పర్రమట్టలో సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నిర్వహించే సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. బ్రిస్బేన్ లో క్వీన్స్ లాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అలాగే, ఏపీలో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్ షిప్ టీమ్ తో భేటీ అవుతారు.
