Begin typing your search above and press return to search.

జగన్ విమర్శలు, లోకేశ్ తగ్గేదేలే.. టీ20 ఫైనల్స్ లో యువనేత

టీడీపీ యువనేత, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేశ్ టీ20 ఫైనల్స్ లో సందడి చేశారు.

By:  Tupaki Political Desk   |   9 March 2026 12:54 PM IST
జగన్ విమర్శలు, లోకేశ్ తగ్గేదేలే.. టీ20 ఫైనల్స్ లో యువనేత
X

టీడీపీ యువనేత, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేశ్ టీ20 ఫైనల్స్ లో సందడి చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను లోకేశ్ వీక్షించారు. ఈ టోర్నీలో మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడటానికి లోకేశ్ వెళ్లడం కొత్త కానప్పటికీ, ఈ మ్యాచ్ కు ముందు ఆయన పర్యటనలపై విపక్షం విమర్శలు గుప్పించడం, వాటిని సమర్థిస్తూ టీడీపీ అనుకూల మీడియా అధిపతి తన వీక్లీ కాలమ్ లో ప్రత్యేక ప్రస్తావన తీసుకురావడం తాజా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు. వీక్ ఎండ్ లల్లో జరిగే మ్యాచ్ లను చూసేందుకు లోకేశ్ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్స్ ను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వెళ్లారు.

మంత్రిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన లోకేశ్ వ్యక్తిగత సరదాల కోసం పర్యటనలు చేయడమేంటి? అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ గతంలో విమర్శలు చేశారు. మంత్రి లోకేశ్ తన సరదాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే జగన్ విమర్శలను లోకేశ్ సోషల్ మీడియా ద్వారా దీటుగా తిప్పికొట్టారు. చిత్తూరు యాసలో నా దుడ్లు నేను ఖర్చు పెట్టుకుంటే నీకేంటి ఇబ్బంది అంటూ ఒక సారి, జగన్ రెడ్డి వస్తే క్రికెట్ మ్యాచ్ లకు తీసుకువెళతానంటూ మరోసారి లోకేశ్ సెటైర్లు వేశారు. దీంతో మంత్రి లోకేశ్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది.

మంత్రి తన పర్యటనకు పూర్తిగా సొంత డబ్బులు వినియోగిస్తున్నప్పటికీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి సరదాలకు దూరంగా ఉండాలని టీడీపీ అనుకూల మీడయా కూడా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది. దీంతో ఐసీసీ టోర్నీలకు మంత్రి లోకేశ్ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడిచింది. ఈ క్రమంలో జగన్ విమర్శల తర్వాత రెండు మ్యాచుల్లో లోకేశ్ కనిపించలేదు. మంత్రి వెళ్లారో? లేదో? కానీ టీడీపీ సోషల్ మీడియా ఆ విషయన్ని ఎక్కడా హైలెట్ చేయలేదు.

తాజాగా ఫైనల్స్ తరువాత మంత్రి లోకేశ్ అహ్మదాబాద్ లో సందడి చేసిన వీడియోలు ప్రత్యక్షం కావడంపై మళ్లీ చర్చ మొదలైంది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరు విమర్శలు చేసినా వ్యక్తిగత పర్యటనలు, ఆసక్తులను వదులుకునేది లేదని లోకేశ్ స్పష్టం చేసినట్లైందని అంటున్నారు. అంతేకాకుండా జగన్ విమర్శలు, ఆ తర్వాత లోకేశ్ కౌంటర్లను గుర్తు చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాను స్టేడియానికి వెళ్లి చూసిన ఏ మ్యాచ్‌లో కూడా భారత క్రికెట్ జట్టు ఓడిపోలేదంటూ మంత్రి లోకేశ్ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.