మూడు భాషలు నేర్చుకుంటే తప్పేంటి: లోకేష్
ఏపీ మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
By: Garuda Media | 8 Sept 2025 7:00 PM ISTఏపీ మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా కోయంబత్తూరులో పర్యటించిన ఆయన ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025’లో మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మూడు భాషలు నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
అంతేకాదు.. హిందీ మాత్రమే నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదని, పైగా స్థానిక భాషకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాంటప్పుడు మూడు భాషలు నేర్చుకుంటే తప్పేముందన్నారు. తనకు కూడా మూడు భాషల్లో ప్రావీణ్యం ఉందన్న నారా లోకేష్.. హిందీని బలవంతంగా ఎవరిపైనా రుద్దడం లేదని.. దీనిపై కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే జరుగుతోందన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా.. భాషలు నేర్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.
``ప్రచంపం కుగ్రామం అయింది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవకాశాలు వస్తాయో చెప్పలేం. అందుకే.. వివిధ భాషల్లో ప్రావీణ్యం పొందడం తప్పుకాదు. కేంద్రం కూడా ఇదే చెబుతోంది. నేను స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిశాను. ఆయన కూడా ఇదే చెప్పారు. హిందీని రుద్దుతున్నారన్నది కేవలం .. అపోహే. ఇది రాజకీయ ప్రేరేపితం`` అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక, ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని లోకేష్ తెలిపారు.
సుదర్శన్ రెడ్డి తెలుగు వారే అయినప్పటికీ.. ఆయనపై తమకు గౌరవం ఉందని.. కానీ, భారత్ ఫస్ట్ అనే నినాదాన్ని తాము అనుసరిస్తున్నామని.. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పరుగులు పెడుతోందని.. అందుకే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపిక చేసిన అభ్యర్థి.. సీపీ రాధాకృష్ణన్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఈ విషయంలో అన్నీ ఆలోచించుకునే తమ నాయకుడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
