లోకేష్ గ్రాఫ్ పైపైకి.. తాజా అప్డేట్ ఇదే...!
టీడీపీ యువ కిశోరం.. మంత్రి నారా లోకేష్ గ్రాఫ్.. గత మూడేళ్లుగా పైపైకి పుంజుకుంటున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 25 Sept 2025 4:46 PM ISTటీడీపీ యువ కిశోరం.. మంత్రి నారా లోకేష్ గ్రాఫ్.. గత మూడేళ్లుగా పైపైకి పుంజుకుంటున్న విషయం తెలిసిందే. యువగళం పాదయాత్రకు ముందు.. తర్వాత.. ఆయన గ్రాఫ్‌ను పరిశీలిస్తే.. తారా జువ్వను తలపిస్తోందన్న వాదన పార్టీ నాయకుల్లోనే కాదు.. ప్రభుత్వ వర్గాల్లోనూ వినిపిస్తోంది. యువగళం పాదయాత్ర ద్వారా మాస్ నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత.. ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్న నారా లోకేష్.. మరింతగా తన పనితీరుతో దూసుకుపోతున్నారు.
పెట్టుబడుల కల్పన, డీఎస్సీ నిర్వహణ వంటి వాటి ద్వారా.. పాలన పరంగా లోకేష్ మార్కులు వేయించు కుంటున్నారు. మరోవైపు..ఎక్కడ ఏ సమస్య ఉన్నా. నేనున్నానంటూ ఆయన స్పందిస్తున్న తీరు, ప్రజలకు చేరువ అవుతున్న విధానం వంటివి ప్రజల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇక, తాజాగా నారా లోకేష్ గ్రాఫ్.. అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర విద్యారంగంలో జరుగుతున్న వినూత్నమైన మార్పులకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కాయి.
ప్రపంచ బ్యాంకు, సమగ్ర శిక్షలో అమలవు తున్న సాల్ట్ ప్రోగ్రాం కార్యక్రమాలు వినూత్నంగా అమలవుతున్నాయని, ఈ కార్యక్రమాలు దేశానికే కాకుండా దక్షిణ ఆసియా మొత్తానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని ఏకంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి మంత్రి నారా లోకేశ్ కు ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా లీప్ కార్యక్రమానికి సాల్ట్ ప్రొగ్రాంను లింక్ చేసి.. రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధిస్తున్న తీరు.. వీటిని అనుసంధానం చేస్తున్న మంత్రి నారా లోకేష్ స్పందన బాగున్నాయన్నది ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చెబుతున్న మాట.
సో.. దీనిని బట్టి.. ఇంట గెలవడమే కాదు.. రచ్చ గెలవడంలోనూ.. నారా లోకేష్ దూసుకుపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంత ఈజీగా ఎవరినీ ప్రశంసించ రు. కానీ, తొలిసారి.. ఈ గౌరవం నారా లోకేష్‌కే దక్కింది. అంతేకాదు.. ఆయన పనితీరుకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ పరిణామాలతో నారా లోకేష్ గ్రాఫ్ మరింత పుంజుకుందని.. ఆయన ఫ్యూచర్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. ఇన్నటి వరకు ఉన్న లెక్క వేరు.. తాజాగా మారిన లెక్కతో లోకేష్ గ్రాఫ్ మరింత పెరిగిందన్నది వాస్తవమేనని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
