వావ్ లోకేశ్.. ఢిల్లీకి విద్యార్థులు.. సింగపూర్ కు టీచర్లు.. ఏపీ విద్యాశాఖలో కొత్త ప్రయోగాలు!
ఏపీ విద్యామంత్రిగా నారా లోకేశ్ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన మంత్రి అయ్యాక విద్యా శాఖలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు.
By: Tupaki Political Desk | 6 Nov 2025 9:41 AM ISTఏపీ విద్యామంత్రిగా నారా లోకేశ్ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన మంత్రి అయ్యాక విద్యా శాఖలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగుతో మొదలుపెట్టిన సంస్కరణలు ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అధునాతన విద్యా విధానాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థులను ఢిల్లీకి పంపారు. అదేవిధంగా ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపనున్నారు.
ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులను విమానంలో ఢిల్లీకి పంపాలని మంత్రి లోకేశ్ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బస్సుల్లో స్కూలుకు వెళ్లడమే గొప్పగా భావిస్తున్న రోజుల్లో విద్యార్థులను విమానాల్లో విజ్ఞాన విహార యాత్రకు పంపడం విశేషంగానే చెబుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 52 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. బుధవారం వీరంతా విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల ఈ పర్యటనలో విద్యార్థులకు ప్రముఖ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నిపుణులతో అవగాహన కల్పిస్తారు.
ఢిల్లీ వెళ్లిన విద్యార్థులు తొలి రోజు ఱస్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ (రష్యన్ హౌస్)ను సందర్శిస్తారు. ఇండో – రష్యన్ స్పేస్ సమన్వయంపై ప్రత్యేక సెషన్ లో పాల్గొంటారు. స్పత్నిక్ పై ఫిల్మ్ ప్రదర్శన, ఇండో – రష్యన్ స్పేస్ ఫ్రెండషిప్పుపై పోటీలు ఉంటాయి. ఇక రెండో రోజు నేషనల్ సైన్స్ మ్యూజియం సందర్స్తిస్తారు. రాకెట్రీ వర్క్ షాపులో పాల్గొంటారు. రాకెట్ డిజైన్, ప్రొపల్షన్, శాటిలైట్ లాంచ్ పై ఇందులో చర్చ ఉంటుంది. మోడల్ రాకెట్ లాంచ్ సెషన్ లో విద్యార్థులు భాగస్వామ్యం అవుతారు. మూడో రోజు నెహ్రూ ప్లానిటేరియం సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించి భారత నాయకత్వం, టెక్నాలజీ, సైంటిఫిక్ విజన్ అంశాల గురించి తెలుసుకుంటారు. విద్యార్థులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలని ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో మంత్రి లోకేశ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో విద్యాబోధనపై మన ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 78 మందిని సింగపూర్ పర్యటనకు పంపుతున్నారు. ఈ నెల 27న నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు ఈ ఉపాధ్యాయులు సింగపూర్ లో పర్యటిస్తారు. అక్కడి పాఠశాలలు, బోధన పద్ధతులు, తరగతి వాతావరణంపై అధ్యయనం చేసి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు నివేదిక సమర్పించాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు.
