Begin typing your search above and press return to search.

నన్ను అంతా 'డోలో 650' అంటారు : లోకేశ్

ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి లోకేశ్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు.

By:  Tupaki Political Desk   |   26 Sept 2026 10:44 AM IST
నన్ను అంతా డోలో 650 అంటారు : లోకేశ్
X

గుజరాత్ లో పర్యటనలో మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఆంధ్రప్రదేశ్ "డోలో-650" అని పిలుస్తుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. తలనొప్పి వస్తేనే మందు బిళ్ల గుర్తుకు వచ్చినట్లు, పరిశ్రమలు లేదా పారిశ్రామికవేత్తలకు ఎక్కడైనా సమస్య తలెత్తితేనే తనను గుర్తుకు తెచ్చుకుంటారని అన్నారు. మిగతా సమయంలో మర్చిపోతుంటారని ఆయన నవ్వుతూ పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి లోకేశ్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. అధికారిక సమావేశాలలో ఎప్పుడూ సీరియస్‌గా, పాలనాపరమైన అంశాలపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడే లోకేశ్.. ఈ భేటీలో మాత్రం తనదైన శైలిలో చమత్కారంగా మాట్లాడి పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకున్నారని అంటున్నారు.

ఎంటర్‌ప్రెన్యూర్లకు ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన 'తలనొప్పి' (సవాల్) ఎదురైనా దానిని కేవలం ఒక వ్యక్తిగత సమస్యగా కాకుండా.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన వ్యవస్థాపరమైన సమస్యగా తాను చూస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తల వేగాన్ని అందుకోవడమే కాకుండా, వారి కంటే వేగంగా అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తేల్చిచెప్పారు. భూ కేటాయింపులు, గ్రౌండ్ వర్క్ పూర్తి కావడం, కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం వంటి అంశాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలే స్వయంగా టైమ్‌ లైన్‌లను నిర్ణయించవచ్చని, ఆ తేదీల కల్లా నీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులను సమకూర్చి సకాలంలో డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు. వేగం అంటే కేవలం నిర్ణయాలు వేగంగా తీసుకోవడం కాదని, వ్యవస్థ మొత్తాన్ని సమూలంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ తెలిపారు. యువ ఐఏఎస్ అధికారులతో కూడిన బృందం ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ, ఏ ఒక్క పారిశ్రామికవేత్తకు సమస్య ఎదురైనా తక్షణమే సరిదిద్దే తపనతో పనిచేస్తోందని చెప్పారు.

ఇక దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న ఏపీలో, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 'సింగిల్ విండో' లేదా అంతకంటే వేగవంతమైన విధానాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందనే విషయాన్ని మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని అంటున్నారు.పారిశ్రామికవేత్తల సమస్యలను తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటానని చెప్పడమే కాకుండా, తమ రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాలు అమలు చేస్తామని, నిరంతరం అండగా ఉంటామని చెప్పేందుకు లోకేశ్ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మంత్రి లోకేశ్ అనుసరిస్తున్న ఈ అనధికారిక, స్నేహపూర్వక సమస్య పరిష్కార ధోరణి పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకోవడంతో పాటు, రాష్ట్రంపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మారిన శైలి

మరోవైపు మంత్రి లోకేశ్ తాజా వ్యాఖ్యలు ఆయన ప్రసంగం తీరులో స్పష్టమైన మార్పును సూచిస్తోందని అంటున్నారు. ఇప్పటికే తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేసుకుని అందరినీ ఆకర్షించిన మంత్రి లోకేశ్ ఇప్పుడు మంచి వ్యాఖ్యాతగా కూడా మెరుగు పడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. తన రాజకీయ ప్రసంగాల్లో పంచ్ డైలాగులు పేల్చుతూ కేడర్ ను ఉర్రూతలూగించిన విధంగానే.. అధికారిక పర్యటనలు, పెట్టుబడులు తీసుకువచ్చే ముఖ్యమైన సమావేశాలలో కూడా మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే డోలో 650 వంటి పదాలను ప్రయోగిస్తూ తనతో సమావేశం పారిశ్రామికవేత్తలకు ఒక మరుపురాని సంఘటనగా మిగిలిపోయేలా నడుచుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.