రామ్మోహన్ ఇంట్లో లోకేష్ సందడి
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో సందడి చేశారు.
By: Satya P | 11 March 2026 11:23 PM ISTఢిల్లీ పర్యటనకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో సందడి చేశారు. కేంద్ర మంత్రి ఇచ్చిన విందుకు లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కూటమికి చెందిన ఎంపీలు అంతా అక్కడికి చేరడంతో ఉల్లాసభరితమైన వాతావరణంతో అంతా గడిపారు. లోకేష్ అయితే అందరినీ పలకరిస్తూ అందరితో చనువుగా మాట్లాడుతూ అంతా తానే అయ్యారు.
చిన్నారులతో ముచ్చట్లు :
ఈ సందర్భంగా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ కూతురు కొడుకుతో చాలా సేపు ఆడుకున్నారు. వారితో ముచ్చట్లు పెట్టారు. రామ్మోహన్ కొడుకుని అయితే ఎత్తుకుని ముద్దు చేశారు. ఇక లోకేష్ పెద్దమ్మ బీజేపీ ఎంపీ కూడా రామ్మోహన్ కొడుకుని ఎత్తుకుని మురిసిపోయారు. ఈ సందర్భంగా లోకేష్ పురంధేశ్వరితోనూ అభిమానంతా పలకరించి మాట్లాడారు, ఆమె ఆశీస్సూ తీసుకున్నారు.
నిండుగా కనిపించింది :
కేంద్ర మంత్రి ఇంట్లో ఎంపీలు అందరూ ఒక్కసారిగా చేరడంతో ఏపీ కూటమి బలం అంతా అక్కడ నిండుగా కనిపించింది. ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బైరెడ్డి శబరి వంటి వారితో పాటు మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ తదితరులు కూడా ఈ విందుకు హాజరయ్యారు. అలాగే రామ్మోహన్ తల్లి కూడా ఎంపీలతో కలిసి వారి చర్చలలో పాల్గొన్నారు నారా లోకేష్ ని ఆమె దీవించడం అందరికీ ఆసక్తిని గొలిపింది.
ఆత్మీయ సమావేశం :
ఇది ఆత్మీయమైన సమావేశంగా ఎంపీలు పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడుకు గత ఏడాది కుమారుడు జన్మించాడు. ఇపుడు అందరినీ కలసి ఒకసారి తన ఇంటికి ఆహ్వానించిన కేంద్ర మంత్రి వారికి విందు ఇచ్చారని అంటున్నారు. అదే సమయంలో లోకేష్ రామ్మోహన్ ల మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ దాదాపుగా ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో మంచి స్నేహితులుగా ఉంటారు. లోకేష్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో నేరుగా కేంద్ర మంత్రి నివాసానికే వచ్చారు అని అంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా :
సాధారణంగా ఎంపీలు ఎవరైనా ప్రజా ప్రతినిధులు కలిస్తే అంతా చర్చించుకునేది రాజకీయాల గురించే. వారు అదే ఆలోచిస్తారు. కానీ ఈ ఆత్మీయ సమావేశంలో ఒకరిని ఒకరు అప్యాయంగా పలకరించుకుంటూ యోగ క్షేమాలు తెలుసుకుంటూ గడిపారు. లోకేష్ సైతం పెద్దలతో పిన్నలతో కలసి మెలసి ఉండడం కనిపించింది. టీడీపీ ఒక కుటుంబం అని చెప్పడానికే ఈ తరహా సమావేశాలు ఉదాహరణగా నిలుస్తాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
