Begin typing your search above and press return to search.

ఏపీలో జపాన్... జేబీఐసీ ముందు లోకేష్ కీలక ప్రతిపాదన!

ఈ మేరకు ఏపీ మంత్రి నారా లోకేష్, ఆర్.ఎం.జెడ్ గ్రూప్ చైర్మన్ మనోజ్ మెండా సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది.

By:  Raja Ch   |   21 Jan 2026 11:57 AM IST
ఏపీలో జపాన్... జేబీఐసీ ముందు లోకేష్ కీలక ప్రతిపాదన!
X

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో ఏపీ మంత్రి నారా లోకేష్ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తూ, వారి ముందు కీలక ప్రతిపాదనలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే కీలక ప్రాజెక్టుకు ఆర్.ఎం.జెడ్ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరిన్ని భేటీల్లో లోకేష్ మరిన్ని కీలక ప్రతిపాదనలు చేశారు.

అవును... దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026లో ఏపీ ప్రభుత్వం, ఆర్.ఎం.జెడ్ కార్పొరేషన్ కీలక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ మంత్రి నారా లోకేష్, ఆర్.ఎం.జెడ్ గ్రూప్ చైర్మన్ మనోజ్ మెండా సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. అనంతరం లోకేష్... దావోస్‌ లో ఐరన్‌ మౌంటెన్‌ ప్రెసిడెంట్, సీఈవో విలియం ఎల్‌.మీనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... డేటా సెంటర్లకు మద్దతు ఇవ్వడానికి విశాఖపట్నంలో ప్రాంతీయ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్‌ తో సహా ఆంధ్రప్రదేశ్‌ లోని అనేక అవకాశాలను అన్వేషించమని కోరినట్లు తెలిపారు!

ఇదే సమయంలో... కాగ్నిజెంట్ ప్రతినిధులతోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని కాగ్నిజెంట్‌ ప్రతినిధులను కోరారు. తాత్కాలిక క్యాంపస్‌ లో సౌకర్యాలు పెంచడం ద్వారా ఉద్యోగుల సంఖ్య పెంచే అంశాన్ని పరిశీలించాలని సంస్థ సీఈవో, చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ లను మంత్రి లోకేష్ కోరారు. ఇదే సమయంలో.. ఏపీలో ఇన్నోవేషన్లు, స్టార్టప్‌ లను ప్రోత్సహిస్తోన్న రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ తో కలిసి పనిచేయండని సూచించారు.

ఏపీలో జపాన్!:

మరోవైపు.. జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ (జేబీఐసీ) సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎండీ హషియామా షిగెట్ తోనూ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచారు. ఇందులో భాగంగా... ఏపీలో ఓడరేవుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధన భద్రత, ఇతర రంగాలకు నిధులు సమకూర్చడంతో పాటు విదేశీ పెట్టుబడులను సులభతరం చేయడంలో రాష్ట్రంతో కలిసి పనిచేయాలని కోరారు.

ఇదే సమయంలో... రాష్ట్రంలో మూలపేట, మచిలీపట్నం, దుగరాజపట్నాల్లో ఏర్పాటుచేసే నౌకానిర్మాణ క్లస్టర్లలో పెట్టుబడులకు జపాన్‌ నౌకా నిర్మాణం, మారిటైమ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలను ప్రోత్సహించాలని.. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ వెంట ఏపీలో జపనీస్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌ షిప్‌ అభివృద్ధి చేసే ప్రతిపాదనను పరిశీలించాలని.. షిప్‌ బిల్డింగ్, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్ రంగాల్లో జపాన్‌ పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడంలో సహకరించాలని లోకేష్.. షిగెట్ ను కోరారు.

ఇదే సమయంలో... దావోస్‌ కాంగ్రెస్‌ విలేజ్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఆధ్వర్యంలో 'బలమైన ఆవిష్కరణల కోసం పెట్టుబడులను బలోపేతం చేయడంలో మనం ఎక్కడ?' అనే అంశంపై నిర్వహించిన సదస్సులోనూ మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా... 18నెలల్లో రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్‌ బోర్డు రూ.8.75లక్షల కోట్ల విలువైన 211 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

అదేవిధంగా... క్లీన్‌ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి.. 167 గిగావాట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇదే క్రమంలో.. క్వాంటమ్‌ వ్యాలీ, భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్‌ సిటీ, స్పేస్‌ సిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.