Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేస్తే యాక్షన్ కి లోకేష్ రెడీ !

నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఆయన అధినేత చంద్రబాబు కంటే రాజకీయంగా దూకుడుగా ఉన్నారు.

By:  Satya P   |   13 Jan 2026 2:00 PM IST
టీడీపీ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేస్తే యాక్షన్ కి లోకేష్ రెడీ !
X

నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఆయన అధినేత చంద్రబాబు కంటే రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. ఆయన కొత్త రకం ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో అవినీతి మీద విమర్శలు ఉంటాయి. అయితే అవి కేవలం ప్రత్యర్ధుల మీద మాత్రమే వినియోగిస్తూ తమ వారిని కాపాడుకునే సంస్కృతి దేశంలో అన్ని పార్టీలలో ఉంది. అయితే తొలిసారిగా దాన్ని బ్రేక్ చేస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఆరోపణ వచ్చినా విచారణ జరుపుతామని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ఒక భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. తొందరలోనే దాన్ని అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

సాధారణ ప్రజలే :

ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఇప్పటిదాకా మీడియావే ఆరోపణలు రాస్తూ ఉంటుంది. వాటిని నాలుగు గోడల మధ్యన చర్చించి వదిలేస్తారు. కానీ ఫస్ట్ టైం ప్రజల నుంచి ఆరోపణలు ఫిర్యాదులను స్వీకరించాలని నారా లోకేష్ నిర్ణయించడం విశేషం. తమ పర తేడా లేకుండా ప్రభుత్వం అందినే పాలన పారదర్శకంగా ఉండాలని అందరికీ చేరువ కావాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతి ఎవరు చేసినా తప్పే అన్నది ఆయన ఆలోచనగా ఉంది. అంతే కాదు ఫిర్యాదులు తమ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేల మీద వచ్చినా కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవడం అంటే ఇది నిజంగా విప్లవాత్మకమైన చర్యగానే చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.

నియోజకవర్గం నుంచే :

తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది. ఆయన గానీ అనుచరులు కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నారా దాని వల్ల జనాలు ఇబ్బంది పడుతూంటే ఆ మేరకు వారు ఏ అభ్యంతరం లేకుండా పార్టీకే ఫిర్యాదు చేయవచ్చు అని ఒక గోల్డెన్ చాన్స్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం కూడా రెండేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. దాంతో తప్పులు జరిగి జనంలో పార్టీ అభాసుపాలు కావడం కంటే కూడా తమ పార్టీ వారు అయినా సరిదిద్దుకునే చర్యలకు ఇప్పటి నుంచే దిగితే మేలు అన్నది లోకేష్ చేస్తున్న వినూత్న ఆలోచన అని చెబుతున్నారు.

ప్రత్యేక ఫోన్ నంబర్ తో :

ఇక పార్టీ పరంగా ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ని ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. ఆ నంబర్ కి ఫిర్యాదుదారుడు ఎవరైనా ఫోన్ చేయవచ్చు. తమ ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేస్తున్నారు, ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏమిటి అవినీతి దందాలు ఏమైనా నియొజకవర్గంలో జరుగుతున్నాయా వంటి వాటిని ఈ ఫోన్ నంబర్ ద్వారా ఫిర్యాదుదారుడు ఏ విధమైన భయం లేకుండా చేసేలా లోకేష్ అవకాశం ఇవ్వబోతున్నారు. అలా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను వారి పేర్లను కూడా పూర్తిగా గోప్యంగా ఉంచబోతున్నారు. దాంతో వారికి ఏ బెంగా ఉండదు, ఫిర్యాదు కూడా ఎవరికి చేరాలో వారికి చేరిపోతుంది. ఆ మీదట జనాలు కోరుకున్న విధంగా చర్యలు కూడా ఉంటాయని అంటున్నారు.

అధికారుల పైన కూడా :

ఇక ఎమ్మెల్యేలతో పాటుగా అధికారుల అవినీతి మీద పనితీరు మీద కూడా ఫిర్యాదులు చేసేలా ప్రజలకు అవకాశం ఇస్తున్నారు. ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తారు, అందులోని నిజానిజాల నిగ్గు తేలుస్తారు. అవసరమైన పక్షంలో చర్యలు కూడా తీసుకుంటారని పార్టీ నుంచి అందుతున్న సమాచారంగా ఉంది. అది ఎమ్మెల్యే అయినా లేక అధికారి అయినా ఎటువంటి వ్యత్యాసం వివక్ష లేకుండా విచారణ జరుపుతారని తప్పు అని తేలిన పక్షంలో తగిన చర్యలు ఉంటాయని అంటున్నారు. ఇది దేశంలో ఎక్కడా లేని విధమైన నూతన విధానం. దీనిని తొందరలోనే ప్రకటించి జనాల చేతికే వజ్రాయుధాన్ని ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల అధికారులలో ఎమ్మెల్యేలతో భయం ఉంటుందని తప్పులు జరగకుండా ఉంటాయని జనాలు కూడా ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా ఉంటారని భావించి అమలు చేసేందుకు లోకేష్ సిద్ధపడుతున్నారు అని అంటున్నారు.