జగన్ కోసం రెండో రోజూ వెయిటింగ్ : ఫన్నీ మీమ్ వదిలిన లోకేశ్
డీఎస్పీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో చర్చించేందుకు తాను ఎదురుచూస్తున్నానని మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
By: Tupaki Political Desk | 18 Aug 2026 1:40 PM ISTడీఎస్పీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో చర్చించేందుకు తాను ఎదురుచూస్తున్నానని మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘డే 2 ఆఫ్ వెయిటింగ్ వైఎస్ జగన్ టు యాక్సెప్ట్ మై చాలెంజ్ ఫర్ ఏ డీఎస్సీ డిబేట్’ అంటూ పోస్టు చేసిన లోకేశ్ ఫన్నీ మీమ్ జత చేశారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో లోకేశ్ ఈ పోస్టు చేయగా, నెటిజన్లు రికార్డు స్థాయిలో స్పందిస్తున్నారు. కేవలం నాలుగు గంటల సమయంలోనే 15 వందల మందికి పైగా ఈ పోస్టును రీపోస్టు చ చేయగా, సుమారు 10 వేల మంది పోస్టుకు లైక్ కొట్టారు. అదేవిధంగా వందల మంది కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి బహిరంగ చర్చకు రావాలని మంత్రి లోకేశ్ సోమవారం అసెంబ్లీ వేదికగా చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు తాను బహిరంగ చర్చకు రమ్మని పిలుస్తున్నా, జగన్ రెడ్డి రావడం లేదని లోకేశ్ ఆరోపించారు. ఈ క్రమంలో మంగళవారం కూడా చర్చకు సిద్ధమంటూ లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అసెంబ్లీ బయట, లోపల ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమేనంటూ లోకేశ్ చేస్తున్న ప్రకటనలు రాజకీయంగానూ హీట్ పుట్టిస్తున్నాయి.
మంత్రి లోకేశ్ చాలెంజ్ చేస్తున్నా అంటున్నా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నుంచి రియాక్షన్ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా మంత్రి లోకేశ్ ఈ తరహా ప్రకటనలు చేయగా, వైసీపీ నేతలు కూడా చర్చకు సిద్ధమంటూ ప్రకటనలు చేశారు. అయితే లోకేశ్ స్థాయికి తాము సరిపోతామని చెబుతూ, తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చర్చకు రారని తేల్చిచెప్పారు. అయినప్పటికీ మంత్రి లోకేశ్ వెనక్కి తగ్గడం లేదు. జగన్ రెడ్డి మాత్రమే చర్చకు రావాలంటూ పొలిటికల్ హీట్ ను కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి మంత్రి నారా లోకేశ్ ట్వీట్ రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. డీఎస్సీపై తాను బహిరంగ చర్చకు సిద్ధం అని లోకేశ్ గర్జిస్తుంటే, లోకేశ్ స్థాయికి మాజీ మంత్రి పేర్ని నాని సరిపోతారని వైసీపీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో లోకేశ్ సవాల్ పై వైసీపీ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీపై చర్చిద్దామని మంత్రి లోకేశ్ రెండు రోజులుగా పిలుపునిస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు ఎవరూ మాట్లాడలేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ నేతలు మండలి వేదికగా ప్రభుత్వంపై గట్టి పోరాటమే చేస్తున్నారని అంటున్నారు.
