'ఒక్క ఛాన్స్' నమ్మొద్దు.. బీహార్ యువతకు వివరించిన లోకేష్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అక్కడి యువ ఓటర్లను చైతన్య పరిచే విధంగా తన ప్రసంగాన్ని దంచికొట్టారు.
By: Garuda Media | 9 Nov 2025 8:46 PM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అక్కడి యువ ఓటర్లను చైతన్య పరిచే విధంగా తన ప్రసంగాన్ని దంచికొట్టారు. ఆదివారం సాయంత్రంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. దీనికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీహార్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో చిన్న చిన్న ప్రలోభాలకు లొంగరాదని ఆయన సూచించారు.
అదేసమయంలో ఒక్క ఛాన్స్ అంటూ.. ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు. ఏపీలోనూ 2019లో ఒక్క ఛాన్స్ అంటూ.. ఒకరు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని.. కానీ, ఆ తర్వాత ఐదేళ్లు విధ్వంసం చేశారని.. దీంతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాకపోగా.. ఉపాధి కూడా కరువైందని తెలిపారు. అప్పటి వరకు వచ్చిన పెట్టుబడి దారులను కూడా తరిమేశారని చెప్పారు. మళ్లీ 2024లో ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టడంతో కేవలం 16 మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉ ద్యోగాలు తీసుకువచ్చామన్నారు.
ఏపీలోను, బీహార్‌లోనూ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. విశాఖలో డేటా కేంద్రం, అమరావతిలో రాజధాని నిర్మాణాలు వడివడిగాసాగుతున్నాయన్న నారా లోకేష్.. వీటికి కారణం.. బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కారు బీహార్‌లోను, టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో ఉన్నందుకేనని చెప్పారు. ప్రధాని మోడీ సహకారంతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నా రు. ఇప్పుడు ఎవరో వచ్చి ఒక్క ఛాన్స్ అంటే.. వారి మాయలో పడితే.. బీహార్ మరోసారి జంగిల్ రాజ్‌గా మారుతుందని చెప్పారు.
పాట్నాలో తాను పారిశ్రామిక వేత్తలతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారుపై వారు సంతోషం వ్యక్తం చేశారని నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతం అనేక అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని, వాటిని కొనసాగించాలంటే.. డబుల్ ఇంజన్ సర్కారుకే మరోసారి ఓటు వేసి విజయం దక్కించాలని.. నితీష్ సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీహార్ అభివృద్ధి చెందుతుందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కావాలా? జంగిల్ రాజ్(ఆటవిక పాలన) కావాలా? అని ప్రశ్నించారు.
