ఎర్రబస్సు రాదన్న చోట... ఎయిర్ బస్సు వాలింది! మంత్రి నారా లోకేష్ మాస్ స్పీచ్
"కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించారు.
By: Tupaki Political Desk | 1 Aug 2026 1:04 PM IST"కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించారు. అటువాళ్లకి ఈ రోజు దిమ్మ తిరిగే సమాధానమే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం" అంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ముందుగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఉదయం 10.30 గంటల సమయంలో ప్రధాని మోదీ విమానాశ్రయానికి చేరుకోగా, ముందుగా గిరిజనుల విద్యార్థులతో ప్రదర్శించిన ధింసా నృత్యాన్ని పరిశీలించారు. అనంతరం విమానాశ్రయంలో ఫొటో ఎగ్జిబిషన్ తోపాటు టెర్మినల్ భవనాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, అనంతరం మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు.
"ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చింది. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ బస్ వచ్చింది. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఏకంగా మన నమో వచ్చారు. ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా.." అంటూ మంత్రి నారా లోకేశ్ ప్రసంగం ప్రారంభించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర నేల ఉత్తరాంధ్ర అని మంత్రి కొనియాడారు. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడింది అల్లూరి సీతారామరాజు అయితే, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చింది మాత్రం ప్రధాని మోదీ అని అన్నారు. రైతుల త్యాగం, కార్మిక కష్టం, చంద్రబాబు విజన్‌కు ఈ విమానాశ్రయం అచ్చమైన ప్రతిరూపమని ఆయన అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు గారికి ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి ప్రధాని మోదీలో కనిపిస్తాయని, నమో అంటే ధైర్యం, విశ్వాసం, సురక్షిత భారత్ అని కొనియాడారు.
డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వేగం
రాష్ట్ర విభజన వల్ల కట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభించిన ఏపీని ప్రధాని మోదీ అన్ని విధాలుగా ఆదుకున్నారని లోకేష్ గుర్తుచేశారు. ఏపీలో 'నమో' అంటే నాయుడుజీ - మోదీజీ జోడి అని, ఆ ఇద్దరి కలయికే రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టును రికార్డు సమయంలో పూర్తి చేయడంతో పాటు, ఏపీ జీవనాడి అయిన పోలవరం, అమరావతి పూర్తి చేయడానికి నిధులు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రత్యేక ప్యాకేజీ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి ఎన్నో వరాలు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా సాధ్యమయ్యాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లు రాష్ట్రానికి రావడానికి మోదీ చొరవే కారణమని పేర్కొన్నారు.
ప్రపంచపటంలో భోగాపురం
మోదీ విజన్, చంద్రబాబు ఎగ్జిక్యూషన్ కలయికే 'వికసిత్ ఉత్తరాంధ్ర' లక్ష్యమని లోకేష్ అన్నారు. నదులు, అడవులు, వనరులు, సుదీర్ఘ తీరప్రాంతం ఉత్తరాంధ్రకు పెద్ద వరమని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చామని, ఇక్కడి ప్రజల నమ్మకమే భోగాపురాన్ని ప్రపంచపటంలో నిలిపిందని సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్డీఏకి క్లీన్ స్వీప్ ఇచ్చారని, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తమ పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు.
జన్మభూమి రుణం తీర్చుకున్న జీఎంఆర్
రాజాం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన గ్రంధి మల్లికార్జునరావు రికార్డు టైమ్‌లో ఎయిర్ పోర్టు నిర్మించి తన జన్మభూమి రుణం తీర్చుకున్నారని లోకేష్ అభినందించారు. అలాగే శ్రీకాకుళం ముద్దుబిడ్డ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఐదు నెలల ముందే పనులు పూర్తి చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకి ఒక గొప్ప వరమని, ఇది ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మారబోతుందని చెప్పారు. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ హబ్‌గా మారుతూ.. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు ఈ విమానాశ్రయం వారధిగా నిలుస్తుందని తెలిపారు. రోడ్డు, రైలు, విమాన, వాటర్ కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్‌కు అసలైన 'గ్రోత్ ఇంజన్'గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు
గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, వెనుకబాటుతనం, చిన్నచూపు ఉండేవని... కానీ నేడు ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి, బంగారు భవిష్యత్తు సాకారమవుతున్నాయని లోకేష్ స్పష్టం చేశారు. "ఇప్పుడు ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం విమానాలు ఎక్కాల్సిన అవసరం లేదు. అవకాశాలే విమానం ఎక్కి ఉత్తరాంధ్రకి వస్తాయి." అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిందని, ఈ కాలంలోనే ప్రధాని మోదీ రాష్ట్రానికి ఐదుసార్లు వచ్చారంటే ఇక్కడి ప్రజలపై ఆయనకు ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతుందని అన్నారు. గుజరాత్‌లో ఒకే ప్రభుత్వం దీర్ఘకాలంగా కొనసాగుతోంది కాబట్టే అభివృద్ధి చెందిందని, ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. సంక్షేమం - అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటివని అభివర్ణించారు. "ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం కాదు… ఇది ఈస్ట్ కోస్ట్ ఇండియా యుగం. సుందర్‌బన్ నుంచి శ్రీహరికోట వరకు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాకెట్‌లా దూసుకుపోతూ అభివృద్ధి సాధిస్తోంది. ఇది నమో శక్తి" అంటూ మంత్రి లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు.
